NTV Telugu Site icon

Maayon Movie Review : మాయోన్ రివ్యూ

Maayaon Movie Review

Maayaon Movie Review

 

ప్రముఖ నటుడు సత్యరాజ్ తనయుడు శిబి కొంతకాలంగా హీరోగా నిలదొక్కుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ బాక్సాఫీస్ మీద పట్టుచిక్కడం లేదు. తాజాగా అలాంటి ప్రయత్నమే ‘మాయోన్’ చిత్రంతో చేశాడు. కాకపోతే ఈసారి సోషల్ సబ్జెక్ట్ కాకుండా మైథలాజికల్ థ్రిల్లర్ జానర్ ను ఎంచుకున్నాడు. గత నెల 24న తమిళంలో విడుదలైన ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ జూలై 7న జనం ముందుకు వచ్చింది. సీనియర్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ మామిడాల శ్రీనివాస్ మూవీ మాక్స్ ద్వారా ఈ సినిమాను రిలీజ్ చేశారు.

ఐదు వేల సంవత్సరాల నాటి ఓ పురాతన గుడిలో బయటి ప్రపంచానికి తెలియని రహస్య మందిరం ఉందని, అందులో వివిధ దేశాలకు చెందిన బంగారు నాళేలు, బోలెడన్ని ఆభరణాలు ఉన్నాయనే విషయం ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ కు తెలుస్తుంది. ఆ వివరాలు సేకరించడానికి గుడికి వెళ్ళిన ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తుంటారు. ఆ మిస్టరీని ఛేదించే పనిని ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ వాసుదేవరావు (కె.యస్. రవికుమార్)కు అప్పగిస్తుంది. ఇదే సమయంలో ఆ శాఖకే చెందిన అర్జున్ (శిబి సత్యరాజ్), దేవరాజ్ (హరీశ్‌ పేరడి) కలిసి మన దేశంలోని పురాతన విగ్రహాలను విదేశాలకు దొంగచాటుగా చేరవేస్తుంటారు. వారి దృష్టి ఈ దేవాలయంలోని సంపద మీద పడుతుంది. వాటిని కొల్లగొడితే జీవితం సెటిల్ అయిపోతుందని భావిస్తారు. వాసుదేవరావు కళ్ళు కప్పి అర్జున్, దేవరాజ్ తమ మాస్టర్ ప్లాన్ అమలు చేయగలిగారా? వారి డిపార్ట్ మెంట్ కే చెందిన అంజన (తాన్య రవిచంద్రన్) వీరికి ఎలాంటి సాయం చేసింది? తరతరాలుగా గుడిని నిర్వహిస్తున్న ఊరి పెద్ద నుండి ఎలాంటి ప్రతిఘటన ఎదురైంది? అనేది మిగతా సినిమా.

వేల సంవత్సరాల నాటి దేవాలయాలు, వాటిలో ఉండే నిధినిక్షేపాలు, వాటి కోసం ప్రాణాలకు తెగించి చేసే సాహసం… ఈ కథాంశాలతో వివిధ భాషల్లో చాలానే సినిమాలు వచ్చాయి. అయితే ఆ ప్రయత్నం ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ ఉద్యోగులతో చేయించడం, అందులోనూ కొందరు అవినీతి పరులు ఉండటం అనేది ఈ కథలోని కొత్తదనం. ఇక్కడి పురాతన దేవతా మూర్తుల విగ్రహాలను ఇటలీకి దొంగచాటుగా చేరవేయడం, అలాంటి ఓ ముఠాను పట్టుకోవడం పతాకసన్నివేశం. ఇలాంటి కథలను చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా శిబి ఈ జానర్ లో మూవీ చేశాడు అంతే!! చిత్రం ఏమంటే… ఏదో బ్రహ్మాండం బద్దలవ్వబోతోందన్నట్టుగా దర్శకుడు ఎన్. కిశోర్ సినిమా ప్రారంభం నుండి బిల్డప్ ఇస్తూ వచ్చాడు. కానీ చివరకు అవన్నీ భ్రమలని తేల్చేయడంతో చూసే జనం నీరుకారిపోతారు. అయితే మూవీ ముగింపులో ఓ కొసమెరుపు పెట్టాడు. ఒక సంఘటనను చూసినప్పుడు ఆశ్చర్యానికి లోను కావడం, అద్భుతంగా ఉందనుకోవడం కొందరి లక్షణమైతే, అలానే దాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా విస్మయం చెందకుండా విస్మరించడం మరికొందరి లక్షణం. అలాంటి కొన్ని సంఘటనల పట్ల ఆయా వ్యక్తులు ఎలా స్పందించారన్నదే ‘మాయోన్’ చిత్రం.

మాయోన్మల అనే గ్రామంలోని పురాతన దేవాలయం పేరు మాయోన్ అని ఈ సినిమాలో చూపించారు. అదే పేరు తమిళ, తెలుగు భాషల్లో పెట్టేశారు. తమిళంలో ఏ పేరు పెట్టినా కనీసం తెలుగుకు వచ్చే సరికీ మరో ఆసక్తికరమైన, క్యాచీ టైటిల్ పెట్టాల్సింది. సినిమా నిడివి 2 గం. 13 నిమిషాలే అయినా… చాలా సేపు చూసిన భావన కలుగుతుంది. దీనికి తోడు విజువల్ ఎఫెక్ట్స్ పేలవంగా ఉన్నాయి. బట్ శిబి స్థాయికి ఇది మంచి బడ్జెట్ లో తీసిన సినిమానే. ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్ ఇళయరాజా సమకూర్చిన నేపథ్య సంగీతం. మరోసారి ఆయన తన సత్తాను చాటారు. శిబి సత్యరాజ్ నటన ఫర్వాలేదు, ఓకే! ‘రాజా విక్రమార్క’ చిత్రంతో తెలుగువారి ముందుకు వచ్చిన తాన్య రవిచంద్రన్ ఇందులో ఎపిగ్రాఫిస్ట్ గా నటించింది. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ తెర మీదే ఉంటుంది. అయితే ఆమె తప్ప మరో మహిళ ఈ సినిమాలో ఈ స్థాయి పాత్రలో కనిపించ లేదు. సీనియర్ దర్శకుడు కె.ఎస్. రవికుమార్, హరీశ్ పేరడి, రాధారవి, మారిముత్తు, భగవతి పెరుమాళ్ తో పాటు చిత్ర నిర్మాత అరుణ్ మోళి మాణిక్యం కూడా ఓ పాత్రను పోషించారు. ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్ ఓ సీన్ లో మెరుపులా మెరిశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమా మైథలాజికల్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారికి నచ్చే ఆస్కారం ఉంది.

 

ప్లస్ పాయింట్స్
మైథలాజికల్ థ్రిల్లర్ కావడం
ఇళయరాజా నేపథ్య సంగీతం
రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ

మైనెస్ పాయింట్స్
రొటీన్ స్టోరీ కావడం
నిరాశ పర్చిన క్లయిమాక్స్

ట్యాగ్ లైన్: టెంపుల్ మిస్టరీ!