హ్యాష్ ట్యాగ్ నైన్టీస్ అనే సిరీస్‌తో మంచి పేరు తెచ్చుకున్న కంటెంట్ క్రియేటర్ మౌళి హీరోగా, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ హీరోయిన్ శివాని హీరోయిన్‌గా లిటిల్ హార్ట్స్ అనే సినిమా అనౌన్స్ చేశారు. ఈటీవీ విన్ ఒరిజినల్ మూవీగా రూపొందిన ఈ సినిమాని థియేటర్లోకి తీసుకొచ్చారు బన్నీ వాసు అండ్ ఫ్రెండ్స్. సినిమా ప్రమోషనల్ కంటెంట్ అంతా వర్కౌట్ అయింది, సినిమా చూడాలని ఆసక్తి ప్రేక్షకులలో ఏర్పడింది. అయితే రిలీజ్‌కి ఒక రోజు ముందుగానే సినిమాని ప్రీమియర్స్ ప్రదర్శించారు. సినిమా ఎలా ఉంది, ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ:
అఖిల్ (మౌళి)కి చదువు మీద పెద్దగా ఆసక్తి ఉండదు. ఇంటర్ పూర్తయిన తర్వాత అతన్ని ఎలా అయినా ఇంజనీర్‌ని చేయాలని తండ్రి రాజీవ్ కనకాల ప్రయత్నిస్తూ ఉంటాడు. అందులో భాగంగానే లాంగ్ టర్మ్ ఎంసెట్ కోచింగ్ కోసం ఒక చోట జాయిన్ చేస్తాడు. అప్పటికే ఒక బ్రేకప్‌తో బాధపడుతున్న అఖిల్, అక్కడ మెడిసిన్ లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం వస్తున్న కాత్యాయని (శివాని)తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఎన్నో ప్రయత్నాల తర్వాత కాత్యాయని కూడా అఖిల్‌తో ప్రేమలో పడుతుంది. ఇక వీరిద్దరి జంట చట్టపట్టాలు వేస్తూ తిరుగుతున్న సమయంలో కాత్యాయని ఇంట్లో వీరి ప్రేమ విషయం తెలుస్తుంది. దీంతో ఆమెను బెంగళూరు పంపించి చదివించే ప్రయత్నం చేస్తారు. మరి వీరి ప్రేమ ఫలించిందా? కాత్యాయని, అఖిల్ ఒకటయ్యారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ సినిమా దర్శకుడి ముఖ్య ఉద్దేశం ప్రేక్షకుడిని థియేటర్లో కడుపుబ్బా నవ్వించి బయటకు పంపడమే. అందుకోసం 90స్ కిడ్స్ కనెక్ట్ అయ్యేలా చాలా సీన్స్ రాసుకున్నాడు. జియో సిమ్ రాకముందు, వచ్చిన తర్వాత అంటూ విడదీసుకుని కథలు మొదలుపెట్టిన ఆయన, ముందుగా మౌళి పాత్ర పరిచయం, తర్వాత హీరోయిన్‌తో ప్రేమలో పడటం అంటూ ఫస్టాఫ్ ఆసక్తికరంగా నడిపించాడు. నిజానికి కథగా చెప్పుకోవాలంటే పెద్ద అద్భుతమైన కథ ఏమీ కాదు, గతంలో మనం ఎన్నో సినిమాల్లో చూసిన కథే. కానీ మౌళి తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తన స్నేహితుడు మధు పాత్రధారితో కలిసి కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్ అంతా ఆసక్తికరంగా సాగిపోతే, సెకండ్ హాఫ్ కూడా దాదాపు అలాగే సాగుతుంది, కానీ చాలా ప్రెడిక్టబుల్ స్టోరీ. కానీ ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేశారు. సెకండ్ హాఫ్‌లో కథ పెద్దగా ఏమీ అనిపించదు, ఉన్నదాన్నే లాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. మొత్తంగా లాజిక్స్ లేకుండా ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా రూపొందించిన ఈ సినిమా, దాదాపుగా నవ్వించే విషయంలో సఫలమైనట్లే.
నటీనటుల విషయానికి వస్తే, మౌళి పాత్రతో వన్ మాన్ ఆర్మీలా నవ్వించే ప్రయత్నం చేశాడు, అతనికి మధు పాత్రధారి తోడయ్యాడు. శివాని చాలా చోట్ల అందంగా కనిపిస్తూనే, తన భావ శైలిలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. రాజీవ్ కనకాలకు పెద్ద పాత్ర కాకపోయినా, చెప్పుకోదగ్గ పాత్రే పడింది. కాంచికి చాలా కాలం తర్వాత కాస్త నిడివి ఉన్న పాత్ర దక్కింది అని చెప్పచ్చు. మిగతా పాత్రధారులు అందరూ ఆకట్టుకునేలా నటించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే, కథ పెద్దగా లేకపోయినా డైలాగ్స్ బాగున్నాయి, నవ్విస్తూనే ఆలోచింపజేసేలా రాసుకున్నారు. సినిమాకి ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది సంగీతం. స్పీడ్ బ్రేకర్లు అనిపించకుండా సరదాగా సాగిపోయే పాటలతో పాటు నేపథ్య సంగీతం బావుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి, సినిమాటోగ్రఫీ కొత్తగా ఉంది. నిడివి తక్కువగానే ఉన్నా, సెకండ్ హాఫ్ ఇంకా లాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది.
ఫైనల్లీ, ఈ లిటిల్ హార్ట్స్ ఓ సరదా టైంపాస్ మూవీ, కానీ షరతులు వర్తిస్తాయి.