నటీనటులు: శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మీ శరత్ కుమార్, మురళీ శర్మ
డైరక్టర్: తేజ మార్నీ
నిర్మాత: బన్నీ వాసు
హీరోయిన్:శివాని రాజశేఖర్,
లీడ్ రోల్ : శ్రీకాంత్
రేటింగ్: 2.5
Kotabommali PS Movie Review: మలయాళంలో తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచిన నాయట్టు అనే సినిమాను తెలుగులో కోటబొమ్మాళి పీఎస్ పేరుతో రీమేక్ చేస్తున్నారు అనగానే సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీద ఈ సినిమా నిర్మించడం మరింత అంచనాలను రేకెత్తించింది. తేజ మార్ని దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమాలో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మీ శరత్ కుమార్, మురళీ శర్మ కీలక పాత్రలలో నటించారు. టీజర్, ట్రైలర్ చూశాక నేటి తరం రాజకీయాల మీద ఎక్కు పెట్టిన బాణంలా అనిపించడంతో మరింత ఇంట్రెస్ట్ పెంచింది. ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.
కోటబొమ్మాళి పీఎస్ కథ:
శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గం ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రూలింగ్ పార్టీ తమ టాస్క్ మాస్టర్ హోమ్ మినిస్టర్ (మురళీ శర్మ)ను రంగంలోకి దించుతుంది. ఇక అదే సమయంలో నియోజకవర్గంలోని కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ లో పని చేసే రామకృష్ణ(శ్రీకాంత్), లేడీ కానిస్టేబుల్ కుమారి (శివానీ రాజశేఖర్) ట్రైనీ కానిస్టేబుల్ రవి( రాహుల్ విజయ్) అనుకోకుండా ఒక మర్డర్ కేసులో చిక్కుకుంటారు. చనిపోయిన వ్యక్తి కులం ఓట్ల కోసం ఈ ముగ్గురిని సప్సెండ్ చేయాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకోవడంతో ఒక్క దెబ్బకు మిస్ అవుతారు. 24 గంటల్లో వారిని పట్టుకుని ఎన్నికల్లో ఒక కులం ఓట్లు దక్కించుకోవాలని వారిని పట్టుకోవడానికి హోమ్ మినిస్టర్ రజియా అలీ(వరలక్ష్మీ శరత్ కుమార్)ను రంగంలోకి దించుతాడు. ఇక అలా మిస్సయిన ముగ్గురు ఏమయ్యారు? 24 గంటల్లో రజియా అలీ వారిని ట్రేస్ చేసిందా? ఎన్నికల్లో ఏమైంది? ఎవరు గెలిచారు? అనే విషయాలు వెండి తెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
ఇది మలయాళంలో తెరకెక్కి చాలా నాచురల్ అనిపించుకుని సూపర్ హిట్ గా నిలిచిన నాయట్టు అనే సినిమాకి తెలుగు రీమేక్. నిజానికి ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ కూడా కొనుక్కుని కూడా రీమేక్ చేసింది. అంటే ఈ సినిమాకి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఉండడంతో సినిమా చేసేశారు మేకర్స్. మలయాళ సినిమా చూసినప్పుడు భలే చిన్న లైన్ తో సినిమా చేశారు అనిపించింది. ఇప్పుడు అలానే మన తెలుగులో కూడా తెరకెక్కించారు. ముగ్గురు నిజాయితీ గల పోలీసులు అనుకోకుండా చేయని మర్డర్ కేసులో ఇరుక్కోవడం, వారు తప్పిచుకునే ప్రయత్నంతో సినిమా మీద ఆసక్తి మొదలవుతుంది. నాయకులు పోలీసులను తమ అవసరాల కోసం ఎలా వాడుకుంటారు? నిజాయితీ ఉన్నా, ఒత్తిడి కారణంగా ఎలా వారి కోసం పని చేస్తారు? లాంటి విషయాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు. అయితే ఒరిజినల్ సినిమా చూసిన వారు ఈ సినిమాలో పెద్దగా మార్పులు కనిపించలేదు అనే చెబుతారు. ఒరిజినల్ లో అన్నీ మనల్ని ఆలోచించుకోమని వదిలేస్తే మన తెలుగు సినిమాలో మాత్రం అన్నీ డైలాగులతో సహా ప్రేక్షకులకు వివరించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. న్యాయం మీద ఎప్పుడూ రాజకీయం గెలవ కూడదు అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న కథను అదేవిధంగా తెలుగులో కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు డైరెక్టర్. తెలుగులో చాలా మార్పులు చేర్పులు చేశాం అని చెబుతూనే ఒరిజినల్ వాసన ఎక్కడ పోకుండా చూసుకోవడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. ఇక్కడ రాజకీయం కోసం బలి పశువులు అయ్యేది సామాన్య జనం లేదా సిస్టంలో కింది స్థాయిలో ఉన్న వ్యక్తులు మాత్రమే అనే విషయాన్ని చాలా బలంగా చెప్పే ప్రయత్నం చేసినట్టు అనిపించింది. రాజకీయ నాయకుల బందోబస్తు మొదలు వారి పర్సనల్ అవసరాల కోసం కూడా పోలీసులను ఏ విధంగా వాడుకుంటున్నారు? పోలీసులు కూడా తమ భుక్తి కోసం ఎంతలా రాజకీయ నాయకుల కోసం పనిచేస్తున్నారు? అనే విషయాలను ఎలాంటి దాపరికాలు లేకుండా చూపించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులకు తమ కుటుంబాలతో ఉన్న అనుబంధాన్ని చూపించే విషయంలో పూర్తిస్థాయిలో ప్రేక్షకులు రిజిస్టర్ కాడు. ఒకసారి పోలీస్ యూనిఫామ్ ఒంటి మీదకు వచ్చాక కుటుంబాలను ఎలా దూరంగా బతుకుతున్నారు అనే విషయాలను మాత్రం ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే కేరళ పోలీసు వ్యవస్థను తెలుగు పోలీసులకు అన్వయించే విషయంలో మాత్రం కొన్ని లోపాలు కనిపించాయి. శ్రీకాంత్ కి ఇచ్చే ఎలివేషన్స్ పూర్తి స్థాయిలో కరెక్టుగా అనిపించలేదు. ఎందుకంటే ఒరిజినల్ సినిమాలో ఇదే విధంగా జోజు జార్జ్ పాత్ర చనిపోతుంది. అలా చనిపోయినందుకు బాధపడని ప్రేక్షకుడే ఉండడు, అయితే అలాంటి తెలుగులో బాధ పడరు అని ముందు నుంచి చెబుతూ వచ్చిన సినిమా యూనిట్ ఆ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఎలాగూ సొంత కథ కాదు కాబట్టి స్క్రీన్ ప్లే విషయంలో మరింత కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మీద దర్శకుడు చాలా నమ్మకం పెట్టుకున్నాడు కానీ ఎందుకో స్క్రీన్ ప్లే విషయంలో కూడా కేర్ తీసుకుని ఉంటే బాగుండు అనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో రామకృష్ణ అనే పాత్రలో ఒక హెడ్ కానిస్టేబుల్ గా శ్రీకాంత్ జీవించాడు. గతంలో కూడా శ్రీకాంత్ పలు పోలీసు పాత్రలలో నటించాడు కానీ ఎందుకు ఈ పాత్ర కాస్త ఒరిజినాలిటీకి దగ్గరగా అనిపించింది. బహుశా వయసు ప్రభావము మరి ఏమిటో తెలియదు కానీ శ్రీకాంత్ ఈ పాత్రకు సరిగ్గా సూట్ అవ్వడమే కాదు నటనలో కూడా తన పరిణితి కనబరిచాడు. కానిస్టేబుల్ కుమారి పాత్రలో శివాని రాజశేఖర్ కూడా మెప్పించింది కొత్తగా జాయిన్ అయిన కానిస్టేబుల్ రవి పాత్రలో రాహుల్ విజయ్ కూడా ఉన్నంతలో మెప్పించాడు. ప్రమాదకారి అయిన పోలీస్ అధికారిని పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ జీవించింది. ఇక మురళీ శర్మ, బెనర్జీ, పవన్ తేజ్ కొణిదల, కంచరపాలెం కిషోర్ వంటి వారు తమ తమ పాత్రల పరిధి మీద నటించే ఆకట్టుకున్నారు. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఈ సినిమా చాలా రిచ్ గా కనిపించే విషయంలో సినిమాటోగ్రఫీ చాలా వర్క్ అవుట్ అయింది. సంగీత దర్శకుడు అందించిన పాటలలో లింగు లింగు లింగిడి అనే పాట ఇప్పటికే చార్ట్ బస్టర్, అయితే ఈ పాట తప్ప మిగతావి పెద్దగా గుర్తించుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు గీతా ఆర్ట్స్ టు బ్యానర్ కి తగినట్టుగా బాగున్నాయి.
ఫైనల్లీ: ఇది దాదాపుగా మక్కీకి మక్కీ రీమేక్, పెద్దగా మార్పులు చేర్పులు చేయకుండా తెలుగు ఫ్లేవర్ తగిలించి వదిలారు. ఒరిజినల్ సినిమా చూసినవారు కనెక్ట్ కావడం కష్టమే కానీ చూడని వారు ఒకసారి చూడొచ్చు.