Meter Review: యస్ ఆర్ కళ్యాణమండపం తర్వాత వరుస సినిమాలతో నిరాశపరిచిన కిరణ్ అబ్బవరం గత
చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’తో పర్వాలేదనిపించాడు. తాజాగా మైత్రీ మూవీస్ సంస్థ తీసిన ‘మీటర్’ తో జనం ముందుకు వచ్చారు. శుక్రవారం విడుదలైన ‘మీటర్’ పై ఆయన అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. మరి వారిని కిరణ్ మెప్పించగలిగాడా? లేదో? చూద్దాం
‘మీటర్’ కథ విషయానికి వస్తే కానిస్టేబుల్ గా తన తండ్రికి ఎదురైన కష్టాలను, అవమానాలను చూసి పోలీస్ అంటేనే గిట్టని స్థాయికి చేరుకుంటాడు హీరో కిరణ్. అయితే తండ్రి మాత్రం తన కొడుకు మంచి పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటాడు. పోలీస్ అంటే ఇష్టంలేని కిరణ్ అనుకోకుండా పోలీస్ ఇన్ స్పెక్టర్ గా మారవలసి వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామలతో సిన్సియర్ ఆఫీసర్ గా ఎలా మారాడు? తండ్రి కోరికను కిరణ్ ఎలా నెరవేర్చాడన్నదే కథాంశం.
నటుడుగా ఈ సినిమాలో కిరణ్ అబ్బవరంలో కొంత సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ కనిపించింది. అయితే తనతో ఓవర్ గా యాక్షన్ చేయించటం, బలవంతంగా బిల్డప్ షాట్స్ చేయించటం ప్రేక్షకులకు ఇంకా డైజెస్ట్ కాదు. హీరోయిన్ గా అతుల్య రవి కేవలం పాటలకే పరిమితం అయింది. సప్తగిరి హీరో మామగా ఉన్నంతలో బాగానే చేశాడు. అయితే విలన్ గా నటించిన ధనుష్ పవన్ మాత్రం ఆకట్టుకుంటాడు. తనకు టాలీవుడ్ లో ముందుముందు మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది. పోసాని, వినయ్ వర్మ తదితరులు తమ తమ పాత్రల పరిధి మేరకు ఓకె అనిపించారు. దర్వకుడు రమేశ్ కాడూరి బిల్డప్ షాట్స్ కి ఇచ్చిన ప్రాధాన్యం కథ, కథనాలపై కనిపించలేదు. దీంతో పరమ రొటీన్ గా ఉండి ఏ సీన్ ఆకట్టుకునేలా రూపొందలేదు. సాయికార్తిక్ బాణీల్లో కొత్తదనం కనిపించకున్నా “ఛమక్ ఛమక్ పోరీ…నా ధడక్ ధడక్ నారీ…”, “అడ్డే లేదు.. అడ్డా లేదు…”, “అందమెట్టి కొట్టావే…అందనట్టు పోతావే…” పాటలు పర్వాలేదనిపిస్తాయి. వెంకట్ దిలీప్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణాత్మక విలువలు బాగున్నా అవి బూడిదలో పోసిన పన్నీరే అనిపిస్తాయి.
ప్లస్ పాయింట్స్
ప్రొడక్షన్ వాల్యూస్
ఆక్కడక్కడా డైలాగ్స్
ఒకటి రెండు పాటలు
విలన్ ధనుష్ పవన్ నటన
మైనస్ పాయింట్స్
ఆకట్టుకోని కథ, కథనం
బోరు కొట్టించే బిల్డప్
అనవసరమైన యాక్షన్
రేటింగ్: 2.25/5
ట్యాగ్ లైన్: తిరగని ‘మీటర్’