NTV Telugu Site icon

Sodara Sodarimanulara review: సోదర సోదరీమణులారా రివ్యూ

Sodara Sodarimanulara

Sodara Sodarimanulara

Sodara Sodarimanulara Movie review: గతంలో కొన్ని సినిమాల్లో హీరోగా నటించి మరికొన్ని సినిమాల్లో సైడ్ యాక్టర్ గా నటించిన కమల్ కామరాజు హీరోగా ఒక సినిమా తెరకెక్కింది. వాస్తవానికి ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమే అయింది కానీ సెప్టెంబర్ 15వ తేదీ రిలీజ్ కావాల్సిన చాలా సినిమాలు వాయిదా పడటంతో అనూహ్యంగా రేసులోకి దిగింది ఈ సోదర సోదరీమణులారా అనే సినిమా. 9 EM ఎంటర్టైన్మెంట్స్, IR మూవీస్ బ్యానర్స్‌పై కమల్ కామరాజు, అపర్ణాదేవి జంటగా రఘుపతి రెడ్డి గుండ అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో విజయ్ కుమార్ పైండ్ల నిర్మించిన ‘సోదర సోదరీమణులారా’ వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం..

కథ:
హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కావడంతో శివారులో ఉన్న ఒక గ్రామంలో తన భార్య కుమార్తెతో కలిసి నివసిస్తూ ఉంటాడు క్యాబ్ డ్రైవర్ రాజు (కమల్ కామరాజు). భార్య శ్రావణి (అపర్ణాదేవి), కూతురు మహాతో ఒకపక్క కష్టపడుతూ మరోపక్క బతుకు బండిని లాగుతూ మంచి రోజులు రాకపోతాయా అని ఎదురుచూస్తూ బతికేస్తాడు. సన్నీ అనే కుర్రాడిని వికారాబాద్ అడవుల్లో ఉన్న రిసార్ట్‌కు తీసుకెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో అనూహ్యంగా పోలీసులు వచ్చి రాజును అరెస్ట్ చేస్తారు. సన్నీ పారిపోగా రాజుపై రేప్, మర్డర్ కేస్ బుక్ చేస్తారు పోలీసులు. అసలు రాజు కారులో ఉన్న అమ్మాయి ఎవరు? రాజుకు, అమ్మాయికి లీక్ ఏంటి? ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? పోలీసులు చెప్పిన ప్రకారంగా రాజూ ఆ ఆమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేశాడా? రాజు జైలు శిక్ష అనుభవిస్తాడా? లేక నిర్దోషిగా బయటకు వస్తాడా? అనేది తెలుసుకోవాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ:
ఏదైనా ఒక కేసులో ఒత్తిడి ఉన్నప్పుడు పోలీసులు ఆ కేసును ఎలాగోలా క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తారు అని గతంలో ఎన్నో సినిమాల్లో చూశాం. బయట కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. దాదాపు అదే పాయింట్ ని ఎంచుకుని ఈ సినిమా తెరకెక్కించాడు కొత్త దర్శకుడు. బాయ్ ఫ్రెండ్ ని నమ్మి రిసార్ట్ కు వెళ్ళిన అమ్మాయి మృత్యువాత పడితే ఆ అమ్మాయి హత్యను అభం శుభం తెలియని ఒక క్యాబ్ డ్రైవర్ మీద మోపడానికి రిసార్ట్ యాజమాన్యంతో పాటు పోలీసులు చేసిన కుట్ర నుంచి ఆ అమాయకపు క్యాబ్ డ్రైవర్ ఎలా బయటపడ్డాడు అనేది ఈ సినిమా ప్లాట్. సినిమా చూస్తున్నంత సేపు వాస్తవికతకు చాలా దగ్గరగా తీశారు అనిపిస్తుంది. అలాగే పోలీసులు, మీడియా చెప్పిందే నిజం కాదు కేసులో అసలు నిజాలు ఆ కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వారికి మాత్రమే తెలుస్తాయి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పినట్టు అనిపించింది.

ఒక రాజకీయ నాయకుడి కోసం ఒక పోలీసు అధికారి తెగించి పనిచేస్తూ ఆ నాయకుడే తనను చంపమన్నప్పుడు న్యాయం వైపు నిలబడినట్టు సినిమాలో చూపించారు.. నిజ జీవితాల్లో చాలా జరుగుతున్నా అవి బయటకు రావడం కూడా చాలా కష్టమే. కానీ అందులో ఒక దాన్ని తన కథాంశంగా తీసుకున్న దర్శకుడు తాను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పే ప్రయత్నం చేశాడు. దర్శకుడికి ఇది మొదటి సినిమానే అయినా చెప్పాలనుకున్న పాయింట్ సూటిగా సుత్తి లేకుండా చెప్పే ప్రయత్నం చేశాడు. ఒక పేదవాడి కొడుకు మంచి స్థాయి రాగానే పెద్ద వాడి కోసం పని చేస్తే, తన సాటి పేదవారికి అన్యాయం జరుగుతుంది, ఒక్కరైనా దాన్ని అడ్డుకుంటే కొత్త మార్పు తేవచ్చు అనే పాయింట్ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే బడ్జెట్ లిమిటేషన్స్ వాళ్ళను ఏమో తెలియదు కానీ పూర్తిస్థాయిలో అది కన్వే అవ్వలేదేమో అనిపిస్తుంది. అదేవిధంగా సినిమా టైటిల్ సోదర సోదరీమణులారా అనేది సినిమాకి ఎందుకు పెట్టారో జస్టిఫై చేయలేకపోయారు. అయితే గంటన్నరలో ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ మూవీ చూశామన్న ఫీలింగ్ మాత్రం కలుగుతుంది.

ఎవరెలా చేశారంటే:
అమాయక క్యాబ్ డ్రైవర్ రాజు పాత్రలో కమల్ కామరాజు ఒదిగిపోయాడు. రాజు భార్యగా నటించిన అపర్ణాదేవి భర్తను ప్రాణంగా ప్రేమించే మిడిల్ క్లాస్ యువతిగా ఆకట్టుకునేలా నటించింది. మినిస్టర్‌గా సీనియర్ నటుడు పృథ్వీ విలన్ తరహా పాత్రలో ఎప్పటిలాగే జీవించేసాడు. సీఐ భాస్కర్ పాత్రలో కాలకేయ ప్రభాకర్ కూడా తనకు బాగా అలవాటు అయిన నెగిటివ్ షేడ్స్ తో ఆకట్టుకున్నాడు. ఇతర పాత్రధారులు సైతం తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ఒక చిన్న లైన్ తోనే ఈ సినిమా తెరకెక్కించాడు దర్శకుడు. కథగా చూస్తే ఇది రొటీన్ కథనే కదా అనిపిస్తుంది కానీ దాన్ని ఫ్యామిలీ డ్రామాగా మార్చే ప్రయత్నం చేశాడు. కథగా బాగానే ఉన్నా స్క్రీన్ ప్లే విషయంలో కొంత కేర్ తీసుకుని ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది. బడ్జెట్ లిమిటేషన్స్ బాగా కనిపిస్తున్నాయి. ఆ విషయంలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఉంటే బాగుండేది. మోహన్ చారి కెమెరా వర్క్ మహిమో ఏమో కానీ రొటీన్ గా కాకుండా విజువల్స్ కొంత భిన్నంగా ఉన్నాయి. పాటలు లేవు కానీ వర్ధన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. నిడివి కూడా గంటన్నర ఉండటం సినిమాకి మరో ప్లస్ పాయింట్.

ఫైనల్లీ
‘సోదర సోదరీమణులారా’ అందరికీ కాదు.. క్రైమ్ కథలు ఇష్టపడే వారికి నచ్చచ్చు