NTV Telugu Site icon

Simbaa Review: ‘సింబా’ రివ్యూ!

Simbaa Review

Simbaa Review

Simbaa Movie Review: ఈమధ్య ప్రేక్షకుల అభిరుచిలో మార్పురావండతో దర్శకనిర్మాతల ఆలోచనల్లో కూడా మార్పు వస్తుంది. సందేశాత్మక సినిమాలను కూడా కమర్షియల్ ఫార్మాట్ లో తెరకెక్కించి విజయం సాధించడం అనేది సాధ్యపడుతుంది. అలాంటి ఒక మంచి ఆలోచనని కమర్షియల్ అంశాలతో కలిపి తెరెక్కించిన చిత్రమే ‘సింబా’. ‘ది ఫారెస్ట్ మ్యాన్’ అనేది ట్యాగ్ లైన్. ‘రచ్చ’ తో పాటు అనేక హిట్ సినిమాలు డైరెక్ట్ చేసిన సంపత్ నంది ఈ సినిమాకి కథ అందించారు. జగపతి బాబు నటించిన సినిమా అనే ప్రచారంతో ఈ సినిమాకి డీసెంట్ బజ్ క్రియేట్ అయ్యింది. అనసూయ, దివి, అనీష్ కురువిల్లా లాంటి తారాగణం కూడా నటించడంతో సినిమా స్కేల్ పెరిగింది. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది?, ప్రేక్షకులను ఎంతవరకు అలరించింది అనేది ఇప్పుడు చుద్ద్దాం.

కథ:
ఈ సినిమా కథ విషయానికి వస్తే హైదరాబాద్ లో ఒక దారుణ హత్య జరుగుతుంది. పార్ధ గ్రూప్ కి సంబందించిన కీలక వ్యక్తి అతను. దానికి సంబందించి పోలీసుల విచారణ జరుగుతుండగా అదే గ్రూప్ కి సంబంధించి మరొక వ్యక్తి కూడా హత్యకి గురువవుతాడు. అయితే ఆ హత్యలు చేసింది అక్షిక (అనసూయ) అనే ఒక స్కూల్ టీచర్, డిజిటల్ ఛానల్ లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన ఫాజిల్ (మాగంటి శ్రీనాథ్) అని నిర్ధారణకు వచ్చిన పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తారు.అయితే ఈ సారి అందరు చూస్తుండగానే మరొక హత్య జరుగుతుంది.ఆ హత్యలో ప్రముఖ డాక్టరు కూడా పాలుపంచుకోవడంతో కథ కొత్తమలుపు తిరుగుతుంది.అయితే ఆ హత్యలకు కారణం ఏంటి? అని విచారణ కొనసాగించిన పోలీసులకి విస్తుపోయే నిజాలు తెలుస్తాయి… ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు?,ఎందుకు చేస్తున్నారు?, ఈ హత్యలకు ఫారెస్ట్ మ్యాన్ అయిన పురుషోత్తం రెడ్డి (జగపతిబాబు)కి సంబంధం ఏంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

సినిమా ఎలా ఉందంటే?:
సినిమా ఒక ఇంట్రెస్టింగ్ నోట్ లో స్టార్ట్ అవుతుంది.అనసూయ పాత్ర ఇంట్రడక్షన్ ఆ తర్వాత ఆమెలో చూపించే మరొక యాంగిల్ ఆసక్తి పెంచుతుంది. ఆ తర్వాత ఇష్ట(దివి) – ఫాజిల్ (మాగంటి శ్రీనాథ్) లవ్ స్టోరీ కూడా కాస్త కొత్తగా,షార్ట్ గానే ఉంటుంది.రెండో హత్య తాలూకూ సంఘటనలు కూడా ఆసక్తిగా ఉన్నాయి. అయితే ఈ మధ్యలో పోలీస్ ఇవెస్టిగేషన్ అంత కొత్తగా కానీ,లాజికల్ గా కానీ ఉండదు.నార్మల్ గా CC టీవీ ఫుటేజ్,కాల్ రికార్డ్స్ ఆధారంగా ఊహించినట్టుగా సాగుతుంది.మూడో హత్య తర్వాత ప్రేక్షకులకి సినిమాపై ఒక అంచనాకు వచ్చేస్తారు.

అయితే సినిమాకి కీలకమయిన సెకండ్ హాఫ్ లో ఫారెస్ట్ మ్యాన్ పురుషోత్తం రెడ్డి ఎంట్రీ ఉంటుంది. ప్రస్తుతం సమాజానికి కావాల్సిన అంశం అయిన చెట్లని రక్షించడం,చెట్లని ప్రేమించడం అనే సందేశం ఈ సినిమాలో చెప్పడం మెచ్చికోదగ్గ విషయం.కానీ అది హత్తుకునేలా చెప్పడానికి తగిన స్కోప్ క్రియేట్ చేసుకోలేదు అనిపిస్తుంది. ఇలాంటి సందేశాన్ని స్పీచ్ లా కాకుండా హత్తుకునే సన్నివేశాలు,ఆలోచింపజేసే సంభాషణల ద్వారా చెప్పి ఉంటే ఇంకా బావుండేది అనిపించింది. అయితే ఈ సినిమాకి కీలకమయిన బయోలాజికల్ మెమరీ అనే కాన్సెప్ట్ ఈ మధ్య మరొక సినిమాలో టచ్ చెయ్యడంతో ఆ ఫ్రెష్ ఫీల్ మిస్ అయ్యింది.

పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ప్రేక్షకుల ఊహకి అందని ట్విస్టులు అనేది ఎవర్గ్రీన్ హిట్ ఫార్ములా.అయితే ఈ సినిమాలో ఆ హత్యల మోటో అనేది మెయిన్ ఎలిమెంట్ గా తీసుకోవడంతో కథనం అంతగా ఆకట్టుకోదు.ఇక మెయిన్ ఫారెస్ట్ మ్యాన్ ఎపిసోడ్ ఇంకాస్త ఆసక్తికరంగా చెప్పి ఉంటె బావుండేది అనిపిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ డ్రామాకి ఒక మంచి సందేశం జోడించి చెప్పడం అనే ఆలోచన బావున్నా అది తెరపై అనుకున్నంత బలంగా రిఫ్లెక్ట్ అవ్వలేదు అనిపిస్తుంది.

ఎవరెలా చేసారు?:
ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసిన జగపతి బాబుకి ఈ సినిమాలోని పురుషోత్తం రెడ్డి పాత్ర పెద్ద చాలెంజింగ్ ఏమీ కాదు. ఆ పాత్రలో ఎమోషన్,యాక్షన్,డ్రామా ఇలా ఇచ్చిన ప్రతి యాంగిల్ ని తన స్టైల్ లో డీసెంట్ గా ప్రెసెంట్ చేసారు.అనసూయ కూడా ఏ మాత్రం తడబాటు లేకుండా నీట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఇక దివి,మాగంటి శ్రీనాథ్,వసిష్ఠ సింహ పాత్రల పరిధిమేర నటించి మెప్పించారు. ఒక కీలక పాత్రలో నటించిన గౌతమికి కొత్తగా ట్రై చెయ్యడానికి స్కోప్ లేదు. కబీర్ సింగ్ తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా కనిపిస్తారు. ఇక కృష్ణ సౌరభ్ సంగీతం,కెమెరా పనితనం బావుంది.సంపత్ నంది అందించిన కథకి మురళి మనోహర్ రెడ్డి ఇంకొన్ని తన తరహా మార్పులు,మెరుపులు యాడ్ చేసి ఉంటే బావుండేది అనిపిస్తుంది.

ఫైనల్ గా చెప్పాలంటే:
సింబా మెచ్చుకోతగ్గ సందేశాత్మక చిత్రం.