Natho Nenu Movie Review: జబర్దస్ట్ కమెడీయన్‌గా, మిమిక్రీ ఆర్టిస్ట్ మంచి గుర్తింపు తెచ్చుకున్న శాంతికుమార్ డైరెక్టర్ అయ్యాడు. ఆయన ‘నాతో నేను’ అనే సినిమా డైరెక్ట్ చేయగా ఆ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైలాగ్ కింగ్ సాయికుమార్, రాజీవ్ కనకాల, ఆదిత్యా ఓం వంటి వారు కీలక పాత్రలలో పోషించడంతో సినిమా మీద అందరిలో ఆసక్తి మొదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది సినిమా రివ్యూలో చూద్దాం.
కథ:
ఓ గ్రామంలో మంచి పొజిషన్లో ఉన్న కోటేశ్వరరావు (సాయికుమార్) అనుకోని సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అదే తరుణంలో ఓ స్వామిజీ కోటేశ్వరరావు కలిసి, కష్టాన్ని తెలుసుకుని ఒక వరమిస్తాడు. ఇక మరో పక్క సాయి శ్రీనివాస్, దీప (ఐశ్వర్య)తో ప్రేమలో పడతాడు. ఇంటిలో పెద్దలు అంగీకరించకపోవడంతో ఐశ్వర్య సాయికి హ్యాండ్ ఇస్తుంది. మరో పక్క ఓ మిల్లులో పని చేసే కోటిగాడు (ఆదిత్య ఓం) ప్రేమించిన నాగలక్షీ (దీపాలి) కూడా దూరం అవుతుంది. 60 ఏళ్ల సాయికుమార్, 40 ఏళ్ల ఆదిత్య ఓం, 20 ఏళ్ల సాయి శ్రీనివాస్‌ల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? అసలు ఇంతకీ స్వామిజీ కోటేశ్వరరావుకి ఇచ్చిన వరం ఏంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
డబ్బే రా అన్నిటికి మూలం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా ఇది. ఇరవయ్యేళ్ల వయసు తేడా ఉన్న ముగ్గు వ్యక్తుల జీవితాలను ఆధారంగా చేసుకుని ఆ పాయింట్ చెప్పే ప్రయత్నం చేశారు. పుట్టినప్పటి నుంచి డబ్బు పరమావధిగా భావించి దాని వెనకే జీవితం ఉందనుకుని పరిగెత్తే వారికి ఏమీ మిగలదనే సందేశం ఇచ్చే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. శాంతి కుమార్ కేవలం కమెడియన్ అని మాత్రమే కాదు మంచి డెప్త్ ఉన్న పాయింట్ చెప్పేలా సినిమా తెరకెక్కించాడు. ముఖ్యంగా కీలక పాత్రలో నటించిన సాయికుమార్ డైలాగ్‌లు అదిరిపోయేలా రాసుకున్నాడు. సాయికుమార్, ఆదిత్యా ఓం, సాయి శ్రీనివాస్ పాత్రలను మలచిన తీరు ఆకట్టుకునేలా ఉంది. ఓ మిల్లులో పని చేస్తూనే తను ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుని మోసపోయిన పాత్రలో ఆదిత్య ఓం, ప్రేమ విఫలం పొందిన పాత్రలో సాయి శ్రీనివాస్ నటన బాగుంది. తొలిసారి దర్శకత్వం వహించిన శాంతి కుమార్ తూర్లపాటి మూడు కీలక పాత్రల నడుమ సాగే కథను బాగానే రాసుకున్నా తెరకెక్కించే విషయంలోనే తడబడినట్టు అనిపించింది. డైలాగ్స్ బాగున్నాయి. కామెడీ సహా ఎమోషనల్ సీన్స్ విషయంలో ఇంకా కేర్ తీసుకుంటే వేరే లెవల్లో ఉండేది.
ఎవరెలా చేశారంటే?
సాయి కుమార్, ఆదిత్య ఓం, సాయి శ్రీనివాస్ ముగ్గురూ సినిమా మొత్తాన్ని భుజస్కంధాల మీద వేసుకుని నడిపించారు. ఇక మిగతా పాత్రలలో నటించిన రాజీవ్ కనకాల, సివిఎల్ నరసింహరావు, ఐశ్వర్య, దీపాలు తమ తం పాత్రల పరిధి మేర ఆకట్టుకునేలా నటించారు. ఎడిటింగ్ టేబుల్ మీద ద్రుష్టి పెట్టి ఫస్టాఫ్‌లో కాస్త కత్తెరకు పని చెప్పాల్సింది. సినిమాలో లొకేషన్లు చూస్తే నిర్మాతలు కొత్త వారే అయినా కాంప్రమైజ్ అయినట్లు కనిపించలేదు. అయితే నటుడిగా అనుభవం ఉన్నా దర్శకుడికి అనుభవం లేకపోవడం కాస్త మైనస్ అయిందనిపించింది. ఇక సంగీతం విషయంలో కూడా మరింత కేర్ తీసుకుని స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ గా రాసుకుని ఉంటే బాగుండేది.
బాటమ్ లైన్
కామెడీతో ఆకట్టుకుంటూనే మెసేజ్ ఇచ్చే ఈ సినిమాను ఒకసారి చూసేయొచ్చు.