Jaabilamma Neeku Antha Kopama Review in Telugu: తమిళంలో సక్సెస్ఫుల్ హీరోగా అనేక సూపర్ హిట్ లు అందించిన ధనుష్ దర్శకుడిగా కూడా పలు చిత్రాలు చేశారు. తాజాగా ఆయన దర్శకుడిగా తన మేనల్లుడు పవీష్ హీరోగా ఒక సినిమా తెరకెక్కించారు. తెలుగులో దాన్ని జాబిలమ్మ నీకు అంత కోపమా అనే పేరుతో ఫిబ్రవరి 21వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. అయితే తెలుగు మీడియాకి ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించింది సినిమా టీం. అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్తో ప్రేక్షకులలో ఒక అంచనాలు సంపాదించుకుంది. మరి ఈ సినిమా ఆ అంచనాలను ఏ మేరకు అందుకుంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ
ప్రభు (పవీష్) ఓ చెఫ్. తన స్నేహితుడి లవ్ యానివర్సరీ పార్టీలో నీల(అనిఖా) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. మొదటి చూపులోనే ప్రేమ కలగకపోయినా ఒకరంటే ఒకరికి ఆకర్షణ ఏర్పడి అది క్రమంగా ప్రేమగా రూపాంతరం చెందుతుంది. అయితే వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకుని నీల తండ్రి (శరత్ కుమార్) దగ్గరకు వెళితే ఎందుకో శరత్ కుమార్ ప్రభు నీకు కరెక్ట్ కాదని నీలాతో వాదనకు దిగుతాడు. కొన్నాళ్లు ట్రావెల్ చేయాలని నీలా కోరడంతో ఇష్టం లేకపోయినా ప్రభుతో ట్రావెల్ చేయడానికి సిద్ధమవుతాడు. అయితే ఇలా సాగుతున్న క్రమంలో ప్రభు ఒక్కసారిగా నీలాను అవాయిడ్ చేయడం మొదలుపెడతాడు. అయితే ఎందుకు అని నిలదీయడానికి వెళ్లిన నీలాను అవమానిస్తాడు. దీంతో నీలా ప్రభుకి దూరమవుతుంది. తర్వాత ఆమె మరో పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమవుతుంది. నీల వెడ్డింగ్ ఇన్విటేషన్ రావడంతో అప్పటికే తన చిన్నప్పటి క్లాస్ మేట్ (ప్రియా ప్రకాష్ వారియర్)తో మరో పెళ్లికి సిద్ధమవుతున్న ప్రభు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పెళ్లికి వెళ్లాలని ఫిక్స్ అవుతాడు. అలా ప్రభు తన స్నేహితుడు(రాజేష్)తో కలిసి నీలా పెళ్లికి వెళతాడు. వెళ్లిన తర్వాత ఏం జరిగింది? ప్రభు, నీల మళ్లీ కలుస్తారా? ప్రభు తాను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? నీలా పెళ్లి ఫిక్స్ అయిన వ్యక్తితోనే జరిగిందా? లాంటి వివరాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే..
విశ్లేషణ
ప్రేమ అంటే ఎప్పుడు ఎవరి మీద ఎందుకు ఎక్కడ ఎలా పుడుతుందో తెలియదు. బహుశా ఇదే లైన్ ఆధారంగా చేసుకుని ధనుష్ ఈ కథ రాసుకున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా ఓపెనింగ్ లోనే ఒక బ్రేకప్ అయిన కుర్రాడు పెళ్లి చూపులకు సిద్ధమవుతున్నట్టు చూపిస్తారు. తర్వాత ఆ పెళ్లి చూపులలో స్నేహితురాలు ఉండడం ఆమె మీద ఆకర్షణ మొదలై పెళ్ళి వరకు వెళ్లాలనుకున్న సమయంలో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ శుభలేఖ ఇంటికి రావడంతో ఒక ఆసక్తికరమైన మలుపు తీసుకుంటుంది. అక్కడ నుంచి సదరు వ్యక్తి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వివాహానికి వెళ్లి అక్కడ ఏం చేశాడు? చివరికి ఆమె పెళ్లి చూసి వచ్చాడా? లేక చెడగొట్టి వచ్చాడా? లాంటి విషయాలను ఆసక్తికరంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తర్కెక్కించడంలో ధనుష్ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా యూత్ కనెక్ట్ అయ్యే ఎన్నో అంశాలను ఈ సినిమా కథలో మిళితం చేసిన విధానం ఆకట్టుకుంటుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాజేష్ అనే పాత్ర లేకుంటే ఈ సినిమాలో జీవం లేదు. ధనుష్ మేనల్లుడు హీరోగా నటించాడు కానీ సినిమా మొత్తాన్ని తన భుజాల మీద వేసుకుని మాథ్యూ నడిపించాడేమో అనిపిస్తుంది. నిజానికి ఈ రోజుల్లో ప్రేమ చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది. ఎప్పుడు ఎవరిమీద ఎలా ఎందుకు పుడుతుందో తెలియడం లేదు. ఈరోజు ఉన్న యువత మనస్తత్వాలను బాగా స్టడీ చేసిన తర్వాత ధనుష్ రాసుకున్న కథగా ఈ సినిమా అనిపిస్తుంది. నిజానికి ధనుష్ తన రియల్ లైఫ్ లో కూడా ఒక బ్రేకప్ ఫేస్ చేసిన వ్యక్తి. కాబట్టి దానిని మరింత ఓన్ చేసుకున్నాడో ఏమో తెలియదు కానీ మొత్తం మీద ఒక కాంప్లికేటెడ్ లవ్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. నిజానికి సినిమా ప్రారంభమైన తర్వాత ఫస్ట్ ఆఫ్ సాగుతూ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఎప్పుడైతే ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ మొదలైందో అప్పుడు సినిమా పరుగులు పెడుతుంది. ఫస్ట్ అఫ్ ప్రేక్షకులను పెద్దగా ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్ లేకపోయినా సెకండ్ హాఫ్ మాత్రం పరుగులు పెడుతూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఆలోచింపజేస్తూ సాగుతుంది. అయితే సెకండ్ పార్ట్ కోసం క్లైమాక్స్ వదిలేసిన తీరు కొంత మందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ప్రేమ కథలో అందరూ ఎక్కువ భాగం మంచి పాజిటివ్ ఎండింగ్ కోరుకుంటారు. కానీ సెకండ్ పార్ట్ లీడ్ కోసం దానిని నిర్దాక్షిణ్యంగా అక్కడికక్కడ ముగించిన ఫీలింగ్ కొంతమందికి నచ్చకపోవచ్చు. ఓవరాల్ గా ఒక యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ను తెలుగు ప్రేక్షకుల ముందు తీసుకురావడంలో ధనుష్ సక్సెస్ అయ్యాడు.
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాతో ధనుష్ మేనల్లుడు పవీష్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఎక్కడా కొత్త కుర్రాడు నటించిన ఫీలింగ్ కలగకుండా సినిమా మొత్తాన్ని క్యారీ చేయడంలో సక్సెస్ అయ్యాడు. అయితే డ్యాన్స్, కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ లో తేలిపోయాడు. అతనితోపాటు సినిమా మొత్తం కనిపించే పాత్రలో మలయాళ మాథ్యూ అదరగొట్టాడు. అలాగే అనిఖా సురేంద్రన్ తో పాటు ప్రియా ప్రకాష్ వారియర్ కూడా తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా నటించారు. శరత్ కుమార్ పాత్ర కొన్ని సీన్స్ కే పరిమితమైనా సరే ఎక్కడ ఆయన కూడా తగ్గకుండా నటించడంలో సక్సెస్ అయ్యాడు. ఆడు కాలం నరేన్, శరణ్య వంటి వారి పాత్రల పరిమితమే. ఇక స్నేహితుల పాత్రలో నటించిన వారు కూడా సినిమాలో ఒక్కొక్క పాత్రలో ఒదిగిపోయారు అనడం ఎలాంటి సందేహం లేదు. టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాను ప్రేక్షకులలోకి తీసుకువెళ్లడంలో సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ పాత్ర మరువలేనిది. గోల్డెన్ స్పారో అనే సాంగ్తో తమిళంలోనే కాదు తెలుగులో కూడా ప్రేక్షకులందరికీ ఈ సినిమాని పరిచయం చేశాడు. ఇక సినిమా ఆద్యంతం ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. పాటలలో గోల్డెన్ స్పెరో ఒకటే బాగుంది మిగతావి తెలుగులో ఎందుకో అంత వినసొంపుగా అనిపించలేదు. సినిమాటోగ్రఫీ మాత్రం అత్యద్భుతంగా కుదిరింది. తెలుగులో హనుమాన్ చౌదరి రాసిన డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. నిడివి కూడా సినిమాకి కలిసి వచ్చే అంశం. నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి.
ఫైనల్లీ ఈ జాబిలమ్మ నీకు అంత కోపమా ఒక ట్రెండీ లవ్ ఎంటర్టైనర్ విత్ ఎంజాయబుల్ మూమెంట్స్.
Jaabilamma Neeku Antha Kopama Rating