NTV Telugu Site icon

Itlu Maredumilli Prajaneekam Movie Review: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం రివ్యూ

Itlu Maredumilli Prajaneeka

Itlu Maredumilli Prajaneeka

గత యేడాది ‘నాంది’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘అల్లరి’ నరేశ్… ఇప్పుడు అర్థవంతమైన చిత్రాలపై దృష్టి పెట్టాడు. అందులో భాగంగా తెరకెక్కిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ శుక్రవారం జనం ముందుకు రాగా, ‘ఉగ్రం’ మూవీ సెట్స్ పై ఉంది. ఎ.ఆర్. మోహన్ దర్శకత్వంలో రాజేశ్‌ దండు నిర్మించిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఎలా ఉందో చూద్దాం.

శ్రీపాద శ్రీనివాస్ (నరేశ్‌) తెలుగు టీచర్. ఎన్నికల డ్యూటీలో భాగంగా మారేడుమిల్లిలోని గిరిజన గూడెం వెళతాడు. పాలకులు తమ కనీస అవసరాలు తీర్చడం లేదనే బాధతో అక్కడి ప్రజలు కొన్నేళ్ళుగా ఎన్నికలను బహిష్కరిస్తుంటారు. వారిని ఒప్పించి, నూరుశాతం ఓటింగ్ అక్కడి గిరిజన గ్రామాలలో జరిగేలా చూడటానికి శ్రీనివాస్ కృషి చేస్తాడు. ‘ఓటు వెయ్యం’ అని భీష్మించుకున్న గ్రామస్థులను అతను ఎలా ఒప్పించాడు? కనీస సౌకర్యాలు లేని ఆ గ్రామాల బాగు కోసం ఏం చేశాడు? ఆ క్రమంలో ప్రభుత్వ అధికారుల కుట్రలు, కుతంత్రాలను ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే మిగతా కథ.

మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇటీవలే అమృతోత్సవాలనూ ఘనంగా జరుపుకున్నాం. కానీ గిరిజన గ్రామాల్లోని ప్రజానీకం ఇప్పటికీ అనేకానేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం వాళ్ళకు అందుబాటులో లేదు. ఎన్నికల సమయంలో హామీలు గుప్పించే నాయకులు సైతం, గెలిచిన తర్వాత ఆ అట్టడుగు వర్గాల వారిని విస్మరిస్తున్నారు. మళ్ళీ మళ్ళీ ఎన్నికలు వస్తాయి… నేతలు హామీలు గుప్పిస్తారు… మళ్ళీ గిరిజనులు వాటిని నమ్మి మోసపోతుంటారు! ఈ తంతుకు ఓ తెలుగు టీచర్ ఎలా ఫుల్ స్టాప్ పెట్టాడన్నదే ఈ సినిమా. రాజకీయ నేతలు మాత్రమే కాదు… ఈ నిర్లక్ష్యానికి ప్రభుత్వ అధికారులూ బాధ్యులే అని డైరెక్టర్ ఎ.ఆర్. మోహన్ నమ్మాడు. అదే అంశాన్ని తెరపై చూపించాడు. ప్రజల బాగోగులు ప్రజా ప్రతినిధులతో పాటు జిల్లా అధికారులకూ పట్టాలని, అందుకోసం వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేయాలనే తెలిపాడు.

సినిమా ప్రధమార్థం సాదాసీదాగా సాగినా… అసలు కథ ద్వితీయార్థంలోనే మొదలైంది. అధికారుల మెడలు వంచడానికి ఓ స్కూల్ టీచర్ తో పాటు గ్రామీణులంతా ఒకే త్రాటిపైకి వచ్చిన విధానం అబ్బుర పరుస్తుంది. అయితే… ఈ కథను ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు విఫలమయ్యాడు. మూవీ గ్రాఫ్ అలా పైకి లేచి టప్పున పడిపోతూ ఉంటుంది. స్టోరీ క్లయిమాక్స్ కు చేరింది అనుకున్న సమయంలో దాన్ని మరింత సాగదీసి, బోర్ కొట్టించేలా చేశారు. ఓటు హక్కు ఎంత విలువైనదో చెబుతూ, దానికి ఒక్కొక్క సమయంలోనే విలువ ఉంటుందన్నాడు. రెండు, మూడుదొందల ఓట్లే కదా అని నిర్లక్ష్యం చేసిన అధికారులే గెలుపుకు ఆ ఓట్లే ప్రధానమైనప్పుడు ఎలా ప్రవర్తిస్తారో చూపాడు. ప్రభుత్వ అధికారుల హోదా సాటి మనిషికి మేలు చేయడానికి ఉపయోగపడాలనే సందేశాన్ని అందించాడు. అంతేకాదు… తెలుగు భాష గొప్పతనం చాటే మాటలతో పాటు ఓ పాట కూడా ఇందులో ఉంది.

తెలుగు టీచర్ గా, ఎన్నికల అధికారిగా నరేశ్ తన పాత్రకు సంపూర్ణ న్యాయం చేకూర్చాడు. అతని వెన్నంటి ఉండే పాత్రలో ‘వెన్నెల’ కిశోర్ నవ్వుల పువ్వులు పూయించాడు. గిరిజన యువతిగా ఆనంది మెప్పించింది. దళారిగా రఘుబాబు తనదైన శైలిలో కామెడీ పండించాడు. ఇతర ప్రధాన పాత్రలను శ్రీతేజ్, కుమనన్, సంపత్ రాజ్, ప్రవీణ్, రవిప్రకాశ్, నాగ మహేశ్ తదితరులు పోషించారు. అబ్బూరి రవి ఆలోచింప చేసే మాటలు రాశాడు. అంతేకాదు… ఓ పాట రాసి అతనే పాడాడు కూడా! శ్రీచరణ్‌ పాకాల నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సి.జి. వర్క్ పేలవంగా ఉంది. ప్రథమార్ధంతో పోల్చితే ద్వితీయార్ధం ఆసక్తికరంగా ఉన్నా… క్లయిమాక్స్ సాగదీసి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. దర్శక నిర్మాతలు మంచి ఉద్దేశ్యంతో ఈ సినిమా తీసినా, దాన్ని మరింత ఆసక్తికరంగా మలిచి ఉంటే, ఎక్కువ మందిని చేరేది.

రేటింగ్: 2.5 / 5

ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న కథ
నరేశ్ నటన
సంభాషణలు

మైనెస్ పాయింట్స్
బోర్ కొట్టే ప్రథమార్థం
ఆకట్టుకోని పాటలు
సాగదీసిన క్లయిమాక్స్

ట్యాగ్ లైన్: ఓటుతో ఫైట్!