హీరో త్రిగుణ్, దర్శకుడు శ్రీనివాస్ మన్నె కాంబినేషన్‌లో 16 ఏళ్ల క్రితం వచ్చిన ‘కథ’ ఒక విభిన్నమైన ప్రయత్నంగా నిలిచింది. మళ్ళీ ఇన్నాళ్లకు వీరిద్దరి కలయికలో, హెబ్బా పటేల్ హీరోయిన్గా, రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ సిరి హనుమంతు మరో జంటగా వచ్చిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’. ఈ సినిమాను వంశీ నందిపాటి రిలీజ్ చేయడంతో సినిమా మీద అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భయపెట్టడంలో ఏ మేరకు సఫలమైందో ఈ సమీక్షలో చూద్దాం.
కథ:
కళ్యాణ్ (త్రిగుణ్), నయన (హెబ్బా పటేల్), అపర్ణ (సిరి హన్మంతు), వినయ్ (అఖిల్ రాజ్) నలుగురూ చిన్ననాటినుంచే ప్రాణ స్నేహితులు. ఒకపక్క ఉద్యోగం చేసుకుంటూనే మరోపక్క సమాజంలో ఆత్మలు, దెయ్యాల పేరుతో మోసం చేసే దొంగ బాబాల గుట్టు రట్టు చేయడం వీరి హాబీ. ఈ క్రమంలో ఒరిస్సా సరిహద్దుల్లో ఆశ్రమం నడుపుతున్న మాజీ బ్రెయిన్ సర్జన్ డాక్టర్ ఆది దేవ్ (పృథ్వీరాజ్) గురించి వీరికి తెలుస్తుంది. అతని మోసాలను బయటపెట్టాలని వెళ్లిన ఈ నలుగురికి ఆది దేవ్ ఒక సవాల్ విసురుతాడు. ఒక పాడుబడిన బంగ్లాలో మూడు రాత్రులు గడపమని అలా గడిపితే తాను కూడా ఆత్మలు లేవని నమ్ముతారని సవాల్ చేస్తాడు. ఆ బంగ్లాలో వీరికి ఎదురైన భయానక పరిస్థితులు ఏమిటి? పుణ్యవతి అనే మహిళ ఆత్మకు వీరికి ఉన్న సంబంధం ఏంటి? చివరికి వీరు ఏం తెలుసుకున్నారు? అనేదే చిత్ర కథ.
విశ్లేషణ:
హారర్ సినిమాల్లో ఒక పాత బంగ్లా, అందులో కొంతమంది స్నేహితులు ఇరుక్కోవడం, అక్కడ జరిగే వింత సంఘటనలతో కథ అల్లుకోవడం సర్వసాధారణం. ‘ఈషా’ కూడా అదే రొటీన్ పద్ధతిలో సాగుతుంది. సినిమా ప్రారంభం ఆసక్తికరంగానే ఉన్నా, కథ బంగ్లాలోకి ప్రవేశించిన తర్వాత నెమ్మదిస్తుంది. దర్శకుడు పాత కాలపు హారర్ సినిమాల ఫార్ములానే నమ్ముకోవడంతో చాలా సన్నివేశాలు ఊహకు అందేలానే ఉండడం కొంత ఇబ్బందికర అంశం. సినిమాలో చెప్పుకోదగ్గ అంశం క్లైమాక్స్. చనిపోయిన వారు ఆత్మలుగా ఎందుకు మారుతారు, వారు తమ మరణాన్ని ఎందుకు అంగీకరించరు అనే పాయింట్‌తో ముగించిన తీరు ఆకట్టుకుంటుంది. అయితే, అంతవరకు నడిపించిన కథనంలో వేగం లేకపోవడంతో లాగ్ ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి ఈ సినిమా బాడ్ కాదు ప్రమోషన్ మిస్ లీడింగ్. స్పైన్ చిల్లింగ్, హార్ట్ పేషెంట్ రావద్దు అంటూ ప్రమోషన్ చేశారు. ప్రమోషన్లలో చెప్పినంత స్థాయిలో భయం కలగకపోయినా, కొన్ని చోట్ల ఆర్.ఆర్. ధృవన్ అందించిన నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఒక కుదుపునకు గురిచేస్తుంది. సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని హారర్ ఎలిమెంట్స్ పర్వాలేదనిపిస్తాయి. భారీ అంచనాలు లేకుండా థియేటర్‌కు వెళ్తే క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. సీక్వెల్ కోసం ఇచ్చిన హింట్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది.
నటీనటుల విషయానికి వస్తే:
త్రిగుణ్, హెబ్బా పటేల్ తమ పాత్రలకు న్యాయం చేశారు. గతంలో ’24 కిసెస్’ లో నటించిన ఈ జంట మధ్య కెమిస్ట్రీ బాగానే కుదిరింది. అఖిల్, సిరి హనుమంతు పెయిర్ కూడా బాగుంది. ఇక కీలక పాత్రలో నటించిన పెళ్లి పృథ్వీరాజ్ తన ఆహార్యంతో, గంభీరమైన గొంతుతో ఆది దేవ్ పాత్రలో కొత్తగా కనిపించారు. ఈ సినిమాలో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మైమ్ మధు గురించి. దెయ్యం పట్టిన వ్యక్తిగా ఆయన చూపించిన హావభావాలు నిజంగానే భయం కలిగించేలా ఉన్నాయి. సినిమా మొత్తానికి ఆయనే ప్రధాన ఆకర్షణ అనడంలో సందేహం లేదు.
సాంకేతిక విభాగం:
సాంకేతిక విభాగం విషయానికి వస్తే సంగీత దర్శకుడు ధృవన్ ఈ సినిమాకి టెక్నికల్ హీరో. బలహీనంగా ఉన్న సన్నివేశాలను కూడా తన మ్యూజిక్‌తో ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. సినిమాటోగ్రఫీ ఆ మూడ్ కు తగ్గట్టుగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి.
ఫైనల్లీ: ఈ ‘ఈషా’ ఒక రెగ్యులర్ హారర్ డ్రామా. హారర్ సినిమాలను ఇష్టపడేవారు ఒకసారి చూడొచ్చు.