Heat Movie Review: తెలుగు సినిమా అంటే విందు భోజనంలా ఉండాలని మనవాళ్ళు భావిస్తుంటారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయింది. హాలీవుడ్ తరహాలో రకరకాల జానర్స్ లో తెలుగులోనూ సినిమాలు వస్తున్నాయి. అందరినీ ఆకట్టుకోవాలనే ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టి, టార్గెట్ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని సింపుల్ పాయింట్ తో సినిమాలు తీసేస్తున్నారు. అలా తెరకెక్కిందే ‘హీట్’ మూవీ. సీనియర్ ఎడిటర్ ఎం. ఆర్. వర్మ… సంజోష్ తో కలిసి నిర్మించిన ఈ సినిమాను గురువారం మీడియాకు ప్రదర్శించారు.
రెండు భిన్నమైన మతాలకు చెందిన సిరిల్, ఆరాధ్య ప్రేమించుకుంటారు. నిశ్చితార్థం రోజున ఆరాధ్య ఇంటి నుండి వెళ్ళిపోయి, చర్చ్ లో సిరిల్ ను పెళ్ళి చేసుకుంటుంది. సిరిల్ చిన్ననాటి స్నేహితుడు, కొలిగ్ అయిన అభి, అతని లవర్ మాన్య వీరిద్దరికీ దన్నుగా నిలుస్తారు. ఆరాధ్య ప్రేమ వివాహం గురించి తెలిసిన ఆమె అన్న రుద్ర ఆవేశంతో రగిలిపోతాడు. ఎలాగైనా సిరిల్ ను చంపేస్తానంటూ అతని తల్లికి వార్నింగ్ ఇస్తాడు. ఈ గొడవలకు దూరంగా సిరిల్, ఆరాధ్యను మలేసియా పంపాలని అభి ప్లాన్ చేసిన రోజు రాత్రే వాళ్ళిద్దరూ కిడ్నాప్ కు గురౌతారు. ఓ సైకో రంగంలోకి దిగి సిరిల్, ఆరాధ్యలను అడ్డం పెట్టుకుని అభితో ఆటలాడటం మొదలెడతాడు. అంతేకాదు… సిరిల్, చర్చి ఫాదర్, రుద్ర లను దారుణంగా హత్య చేస్తాడు. ఈ మూడు హత్యలు అభి చేసినట్టుగా ప్రూఫ్స్ క్రియేట్ చేస్తాడు. దాంతో పోలీసులు అభి వెనక పడతారు. అసలు సైకో మాస్టర్ ప్లాన్ ఏమిటీ? అతను చేసే హత్యలకు, అభికి సంబంధం ఏమిటీ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మాస్టర్ అయిన సైకోకు అభి ఎలా చెక్ పెట్టాడు అనేది మిగతా కథ.
సినిమా ప్రారంభంలో ఇది పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన కథ అనిపిస్తుంది. కాస్తంత ముందుకు వెళ్ళాక, కార్పొరేట్ మాఫియాకు సంబంధించిన వైరం అనే భావన కలుగుతుంది. ప్రీ క్లయిమాక్స్ కు వచ్చిన తర్వాత సైకలాజికల్ డ్రామా అనే విషయం బోధపడుతుంది. ఆ రకంగా దర్శక ద్వయం ఎం. ఎన్. అర్జున్, శరత్ వర్మ ప్రేక్షకుల ఊహకు అందని విధంగా కథను మలుపు తిప్పారు. అయితే… తాను ప్రేమించిన అమ్మాయి మరొకరి సొంతం కావడాన్ని భరించలేక సైకోగా మారిన వ్యక్తుల కథలు మనకు కొత్త కాదు. కానీ దాన్ని ప్రెజెంట్ చేసిన తీరు ఇందులో కొత్తగా ఉంది. మరీ ముఖ్యంగా హీరో – సైకో మధ్య సాగే మైండ్ గేమ్, టామ్ అండ్ జెర్రీ తరహా వార్ ఆసక్తికరం. తర్వాత సీన్ లో ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకూ రన్ అవుతూనే ఉంది. దాంతో ఇది సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ను తలపిస్తుంది. సైకో క్యారెక్టర్ ను మలిచిన తీరే కాకుండా… ఒక్కో మర్డర్ వెనుక ఉన్న రీజన్ ను రివీల్ చేసిన తీరు బాగుంది.
ఇందులో వర్షన్ గుర్రాల, స్నేహా ఖుషీ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ కావడంతో వాళ్ళ మధ్య లవ్ సీన్స్ ను యక్సెపెక్ట్ చేయలేం. ఇతర ప్రధాన పాత్రలను మోహన్ సాయి, అంబికా వాణి, వంశీ రాజ్, పుల్కిత్, అప్పాజీ అంబరీష, జయశ్రీ రాచకొండ, ప్రభావతి వర్మ తదితరులు పోషించారు. ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు తగ్గట్టుగా చక్కటి నటన ప్రదర్శించారు. నిర్మాతల్లో ఒకరైన ఎడిటర్ ఎం. ఆర్. వర్మ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. అలానే ‘ఫ్రెండ్ అంటే వెలుతురు ఉన్నప్పుడు షాడో లాంటి వాడు కాదు.. చీకట్లో కూడా వెలుతురునిచ్చే వాడే నిజమైన ఫ్రెండ్’ వంటి డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. గౌతమ్ రవిరామ్ సంగీతం, రోచిత్ బాచు సినిమాటోగ్రఫీ మూవీకి హైలైట్. రొటీన్ సినిమాలను చూసి బోర్ ఫీలయ్యే వాళ్ళకు ‘హీట్’ ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెండ్ మూవీస్ కు థియేటర్ల కంటే ఓటీటీ రిలీజ్ బెస్ట్!
రేటింగ్: 2.75/5
ప్లస్ పాయింట్స్:
సైకో థ్రిల్లర్ కావడం
ఆకట్టుకునే స్క్రీన్ ప్లే
ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్
మేకింగ్ వాల్యూస్
మైనస్ పాయింట్స్:
కథలో కొత్తదనంలేకపోవడం
నిదానించిన ద్వితీయార్థం
ట్యాగ్ లైన్: ‘హీట్’ పుట్టిస్తుంది!