NTV Telugu Site icon

F3 Movie Review: జస్ట్ ఫన్ రైడ్

F3 Movie

F3 Movie

మూడేళ్ళ క్రితం సంక్రాంతి కానుకగా వచ్చిన ‘ఎఫ్‌ 2’ చిత్రం సూపర్ హిట్ కావడంతో దానికి ఫ్రాంచైజ్ చేయాలని దర్శక నిర్మాతలు అనిల్ రావిపూడి, దిల్ రాజు భావించారు. అయితే కరోనా కారణంగా ఈ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి మొదలు కాలేదు. అలానే పూర్తి కూడా కాలేదు. మొత్తానికీ ఇప్పుడు ‘ఎఫ్‌ 3’గా రూపుదిద్దుకుని జనం ముందుకు వచ్చింది.

కథ విషయానికి వస్తే…
ఈసారి వెంకీ (వెంకటేష్)కి ఓ కుటుంబం ఉంటుంది. తల్లి చనిపోగానే అతని తండ్రి మరో పెళ్ళి చేసుకోవడంతో ఆమెకో నలుగురు పిల్లలు పుడతారు. సో… సవతి తల్లితో ఉండే ఇబ్బందులు, సినిమా కష్టాలు అతన్ని వెంటాడుతూ ఉంటాయి. బాగా డబ్బులు సంపాదించి, ఈ కష్టాల ఊబి నుండి బయటపడాలన్నది వెంకీ కోరిక. ఇక అనాథ అయిన వరుణ్ యాదవ్ (వరుణ్ తేజ్) కు బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని రాత్రికి రాత్రి బిలియనీర్ అయిపోవాలనే అత్యాశ. అక్కాచెల్లెళ్ళైన హారిక (తమన్నా), హనీ (మెహ్రీన్) తల్లి, బామ్మలతో కలిసి మంగ టిఫిన్ సెంటర్ నడుపుతూ ఉంటారు. ఆ హోటల్ పెట్టడం కోసం వెంకీని, అతనితో ఉండే రఘుబాబును బుట్టలో వేసుకుని అరవై లక్షలు గుంజేస్తారు. ఆ డబ్బులు తిరిగి వసూలు చేసుకోలేక వెంకీ సతమతమౌతుంటాడు. హనీ బాగా డబ్బున్న అమ్మాయని భ్రమపడి వరుణ్ ఆమెను ట్రాప్ చేయాలని చూస్తాడు. అందుకోసం వెంకీ దగ్గరే డబ్బులు తీసుకుని ఆమె విలాసాలకు ఖర్చు చేస్తాడు. ఆ డబ్బుల్ని హనీ ఫ్యామిలీ స్టాక్ మార్కెట్ లో పెట్టి మొత్తం పోగొట్టుకుంటుంది. చివరకు అందరికీ అత్యాశకు పోయి దెబ్బ తిన్నామనే విషయం బోధపడుతుంది. అదే సమయంలో పారిశ్రామిక వేత్త ఆనంద ప్రసాద్ (మురళీ శర్మ) ఇల్లు విడిచి వెళ్ళిపోయిన తన కొడుకు కోసం ఎదురు చూస్తున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెబుతాడు. ఆయన కొడుకుగా నటించి కోట్లు కొల్లగొట్టాలని వెంకీ, వరుణ్‌, హారిక వేర్వేరుగా పథక రచన చేసి ఆయన పంచన చేరతారు. వారి ప్లాన్ నెరవేరిందా లేదా అనేది మిగతా కథ.

‘ఎఫ్‌ 2’ సినిమాలో ప్రేమ, పెళ్ళి కారణంగా క్రియేట్ అయ్యే ఫన్‌ అండ్ ఫ్రస్ట్రేషన్ పై దృష్టి పెట్టిన అనిల్ రావిపూడి ఇప్పుడు అన్ని వర్గాలను ఆకట్టుకోవాలనే ఉద్దేశ్యంతో మనీ కోసం మనుషులు వేసే తప్పటడుగులు, దాని ద్వారా క్రియేట్ అయ్యే ఫ్రస్ట్రెషన్ ను బేస్ చేసుకుని ఈ కథను రాసుకున్నాడు. పెద్ద పెద్ద కలలు కనడం, వాటిని సాకారం చేసుకోవడానికి ఈజీ మనీ పొందాలనుకోవడం, అందుకై అడ్డదారులు తొక్కడం కామన్! ఆశ ఉంటే తప్పులేదు కానీ అది దురాశ అయితేనే చేటు. ఈ సినిమాలోని ప్రతి పాత్ర అలాంటి దురాశను కలిగినదే కావడం విశేషం. డబ్బు పిచ్చిలో మనిషి చేసే తిక్క పనులే ఈ సినిమా అంతా ఉన్నాయి. దాంతో మూవీ చూస్తున్నంత సేపు మనం మరో ఆలోచన లేకుండా ఆ వినోదాన్ని ఆస్వాదిస్తాం. అయితే దర్శకుడు అనిల్ రావిపూడి కేవలం వినోదానికే పెద్ద పీట వేసి వదిలేయకుండా, చివరిలో చిన్నపాటి సందేశాన్ని సైతం అందించాడు.

‘ఎఫ్‌ 2’లోని పాత్రలను మాత్రమే తీసుకుని, మరింత వినోదం అందించాలని అనుకున్నాడు. అందువల్ల దీన్ని ‘ఎఫ్‌ 2’కు సీక్వెల్ అని చెప్పలేం. ఎందుకంటే అందులో వెంకటేష్‌కు కుటుంబమే ఉండదు. కానీ ఇందులో ఉంటుంది. అలానే వరుణ్‌ తేజ్‌ ముందు సినిమాలో తల్లి చాటు బిడ్డ. కానీ ఇందులో అతనికి ఫ్యామిలీ లేదు. ఓ స్నేహితుడు మాత్రమే ఉంటాడు. పైగా ఆ చిత్రంలో లేని మరెన్నో పాత్రలను ఈ సినిమాలో పెట్టారు. సునీల్‌, అలీ, మురళీశర్మ, సోనాల్ చౌహాన్, పూజా హెగ్డే తదితరుల పాత్రలు గ్రాండియర్ కోసం, మోర్ ఫన్ ను క్రియేట్ చేయడం కోసం, అలానే మోర్ గ్లామర్ ను అద్దడం కోసం యాడ్ చేసినవే. నటీనటులంతా చాలా చక్కగా తమ పాత్రలకు న్యాయం చేశారు. రేచీకటి ఉన్న వ్యక్తిగా వెంకటేష్‌ మంచి ఫన్ క్రియేట్ చేశాడు. అయితే వరుణ్ తేజ్ నత్తి పాత్ర, దానికి అతనితో చేయించిన మేనరిజమ్స్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాయి. ఇక ఆనంద ప్రసాద్ మనవరాలిని ఎవరు? ఎందుకు? కిడ్నాప్ చేశారో దర్శకుడు ఎక్కడా వివరణ ఇవ్వలేదు. పాటలు బయట వినడానికి బాగున్నా, సినిమాలో ఏ ఒక్క పాట కూడా సరిగ్గా అతకలేదు. పైగా ప్రతి సన్నివేశంలోనూ ఫన్ ను దర్శకుడు చొప్పించే ప్రయత్నం చేయడంతో అది కాస్త వెగటు పుట్టే విధంగా తయారైంది. పాయసంలో జీడిపప్పు, కిస్ మిస్ మాదిరి వినోదం ఉండాలే కానీ పాయసం మొత్తం అవే ఉంటే తినలేం. అలాంటి పరిస్థితే ఇక్కడ కూడాను.

బలహీనమైన కథ కావడం, ప్రతి సన్నివేశంలోనూ ఓవర్ కామెడీ ఉండటం, అవసరమైన పాత్రలు అనేకం ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడంతో ప్రేక్షకుడు ఎక్కడా ఏ సన్నివేశాన్ని ఆస్వాదించ లేని పరిస్థితి నెలకొంది. ఇక క్లయిమాక్స్ అయితే మరీ దారుణం. వెంకటేష్‌ను నారప్ప గెటప్‌లో, వరుణ్ తేజ్‌ను వకీల్ సాబ్ గెటప్‌లో చూపడం వారి అభిమానులకు నచ్చొచ్చేమో కానీ సాధారణ ప్రేక్షకుడికి మాత్రం చికాకే కలుగుతుంది. పూజా హెగ్డే మీద చిత్రీకరించిన పాట కూడా సినిమాలో ఏమంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. సెకండ్ హాఫ్‌లో తమన్నా గెటప్‌ను సీక్రెట్‌గా ఉంచినా, ప్రేక్షకులు పెద్దంత సర్ ప్రైజ్‌కు గురికారు. అలాంటి ట్రిక్కులు గతంలో చాలా సినిమాల్లో వారు చూశారు. దర్శకుడు అనిల్ రావిపూడి ప్రతి పాత్రకూ మేనరిజం ఇస్తూ, హోమ్ వర్క్ బాగానే చేశాడు కానీ అది అతి అయిపోయింది. పంచ్ డైలాగ్స్ కొన్ని చోట్ల బాగా పేలాయి. దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీలోని ప్రతి పాటనూ ఓ స్పెషల్ నంబర్ గానే భావించి ట్యూన్ చేసినట్టుగా అనిపిస్తోంది. శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఓకే. ఓవర్ ఆల్ గా ఆడియెన్స్‌కు మోర్ ఫన్ అందించడం కోసం అనిల్ రావిపూడి చేసిన కృషి తెర మీద కనిపిస్తుంది. కానీ జనమే దానికి కనెక్ట్ కాలేరు. అయితే అనిల్ మీద నమ్మకంతో ‘దిల్’ రాజు, శిరీష్ ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను భారీగా తీశారు. అంతేకాదు… రేటు పెంచకుండా ఉన్న టిక్కెట్ రేట్లతోనే సినిమాను జనాలకు చూపించాలని అనుకున్నారు. బట్… మూవీ బాగుంటే జనాలు చూస్తారు కానీ టిక్కెట్ రేటు పెంచలేదని చూడరు కదా. సో… ఫన్ కంటే ఫ్రస్టేషన్ ఎక్కువ కలిగించే ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతవరకూ ఆదరిస్తారన్నది సందేహమే.

ప్లస్ పాయింట్స్
‘ఎఫ్ 2’కు ఫ్రాంచైజ్ కావడం
నటీనటులు అందించే వినోదం
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్
కథలో దమ్ము లేకపోవడం
‘జబర్దస్త్’ కామెడీ తరహా సన్నివేశాలు
భారీ అంచనాలు కలిగించడం

ట్యాగ్ లైన్: ఫన్‌తో ఫ్రస్టేషన్

రేటింగ్: 2.5 / 5