NTV Telugu Site icon

Enugu Movie Review: ఏనుగు మూవీ రివ్యూ

Enugu Movie

Enugu Movie

తమిళ దర్శకుడు హరికి యాక్షన్ మూవీస్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు ఉంది. సూర్యతో తీసిన ‘సింగం’ సీరిస్ చక్కని విజయాన్ని అందుకోవడంతో అతని నుండి అలాంటి సినిమాలనే ప్రేక్షకులూ ఆశిస్తుంటారు. బహుశా ఆ ఉద్దేశ్యంతోనే కావచ్చు అరుణ్ విజయ్ తో అదే తరహాలో ‘యానీ’ చిత్రాన్ని రూపొందించాడు హరి. అది తెలుగులో ‘ఏనుగు’ పేరుతో డబ్ అయ్యింది. ఈ శుక్రవారం తమిళ, తెలుగు వర్షన్ రెండూ ఒకేసారి విడుదలయ్యాయి.

రవి (అరుణ్ విజయ్) పీవీఆర్ కుటుంబంలో చిన్న కొడుకు. అతని అన్నలు ముగ్గురు (సముతిర కని, బోస్ వెంకట్, సంజీవ్) తన తండ్రి మొదటి భార్యకు పుడితే, రవి రెండో భార్య (రాధికా శరత్ కుమార్) కొడుకు. వారిది ఉమ్మడి కుటుంబం. అన్ని విషయాల్లోనూ దూకుడు ప్రదర్శించే రవి అంటే అన్నయ్యలకు అసలు పడదు. అయిన వారి పట్ల ఉన్న అభిమానంతో మీద కుటుంబ సభ్యుల మీద ఈగ వాలకుండా చూసుకుంటాడు రవి. అనుకోని సంఘటనల కారణంగా ఎంతోకాలంగా కలిసి ఉన్న పీవీఆర్ ఫ్యామిలీకి, సముద్రం (‘ఆడుకాలం జయబాలన్) కుటుంబానికి మధ్య వైరం ఏర్పడుతుంది. తమ్ముడి హత్య సమయంలో పోలీస్ ఆఫీసర్ ను కాల్చేసిన కారణంగా జైలుకు వెళ్ళిన సముద్రం కొడుకు లింగం (కేజీఎఫ్‌ రామచంద్రరాజు) పీవీఆర్ కుటుంబంపై పగపడతాడు. సముద్రం కుటుంబం నుండి తమ ఫ్యామిలీని రవి ఎలా కాపాడుకున్నాడు? తనను అన్నయ్యలు అపార్థం చేసుకున్నా ఎలా తట్టుకున్నాడు? ముస్లింను ప్రేమించి ఇల్లు వదిలి వెళ్ళిపోయిన పెద్దన్న కూతురు ఆచూకీ ఎలా సంపాదించాడు? తాను ప్రేమించిన క్రీస్టియన్ అమ్మాయిని ఎలా మెప్పించి పెళ్ళి చేసుకున్నాడు? అనేది మిగతా కథ.

‘ఏనుగు’ అనే టైటిల్ ను సింబాలిక్ గా పెట్టారు తప్పితే మరొకటి కాదు! ఉమ్మడి కుటుంబంలో ఉండే పొరపొచ్చలు, మరీ ముఖ్యంగా సవతి కొడుకును అన్నయ్యలు దూరం పెట్టడం, అయినా అతను వారి కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడటం వంటి సంఘటనలు మనం చాలా సినిమాలలో చూసినవే. కానీ అరుణ్ ఈ తరహా పాత్రను పోషించడం మొదటిసారి. దర్శకుడు హరి తీసిన సినిమాల్లోనూ ఈ తరహా ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ కు కొదవలేదు. బాలకృష్ణ ‘నరసింహనాయుడు’, ఆ మధ్య వచ్చిన కార్తీ ‘చినబాబు’ అదే లైన్ లో రూపుదిద్దుకున్న సినిమాలే. రెగ్యులర్ హరి మూవీస్ లో ఉన్నట్టుగానే ఇందులోనూ భారీ యాక్షన్ సీక్వెన్స్ లున్నాయి. ఛేజింగ్స్ కు కొదవలేదు. అందువల్ల ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని చెప్పలేం. చాలా సన్నివేశాలలో అరుణ్ ను చూస్తుంటే సూర్య లేదా కార్తిని చూసినట్టే అనిపిస్తుంది. ఈ తరహా సినిమాలను వాళ్ళు గతంలో చేసి ఉండటమే దానికి కారణం. పీవీఆర్ ఫ్యామిలీకి, సముద్రం కుటుంబానికి మధ్య ఏర్పడిన వివాద సన్నివేశాలు ఆసక్తికరంగానే ఉన్నా, ద్వితీయార్థంలో అన్నకూతురును వెతుక్కుంటూ రవి తిరిగే సీన్స్ కారణంగా కథ దారితప్పింది. దానికి తోడు హీరోయిన్ ను హీరో అపార్థం చేసుకోవడం, క్షణికావేశానికి లోనుకావడం ఆ తర్వాత తప్పు తెలుసుకోవడం… ఇవన్నీ కథను మరింతగా సాగదీశాయి. ఇక రవి తండ్రి మరణం, ఆ తర్వాత వచ్చే సెంటిమెంట్ సీన్స్ లో తమిళ అతి బాగా కనిపిస్తుంది. బహుశా ఈ స్థాయి సెంటిమెంట్ లేకపోతే వాళ్ళ మనసుకు ఎక్కదనేది దర్శకుడి అనుమానం కావచ్చు. ఆ రకంగా చూస్తే తమిళులు ఈ సినిమాను ఓన్ చేసుకున్నట్టు తెలుగువారు చేసుకోవడం కష్టమే.

చిన్న కొడుకుగా, కుటుంబ భారాన్ని మోసేవాడిగా అరుణ్‌ విజయ్ బాగానే నటించాడు. గ్లామర్ కు పెద్ద పీటవేయకుండా అభినయానికే ప్రియ భవానీ శంకర్ పాత్రను పరిమితం చేశారు. ఈ సినిమాలో మరో కీలక పాత్రను అమ్ము అభిరామి పోషించింది. ఆమె తండ్రిగా సముతిర కని, బాబాయిలుగా బోస్ వెంకట్, సంజీవ్ నటించారు. ప్రతినాయకుడు లింగం పాత్రను కేజీఎఫ్‌ రామచంద్రరాజు, రవి తల్లిదండ్రులుగా రాధిక, రాజేశ్‌, పిన్నిగా ఐశ్వర్య తదితరులు నటించారు. యోగిబాబుతో పాటు పుగళ్ తో వినోదాన్ని అందించే ప్రయత్నం దర్శకుడు చేశాడు. యోగిబాబు చెప్పిన డైలాగ్స్ బాగానే పేలాయి. కానీ కొన్ని కామెడీ సీన్స్ మాత్రం పేలవంగా ఉన్నాయి. కుక్క పేరును తాను ఎందుకు పెట్టుకన్నాడో యోగిబాబు చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక ఒకరి చెంప ఒకరు పగలకొడ్డటం అనే అతిని భరించడం కొంచెం కష్టమే. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరపరిచిన స్వరాలు, నేపథ్య సంగీతం మాస్ ను దృష్టిలో పెట్టుకునే చేశారు. ఎస్. గోపీనాథ్ కెమెరాపనితనం బాగానే ఉంది. సినిమా మొత్తం మీద చెప్పుకోదగ్గ కొత్తదనం లేకపోయినా, ఫ్యామిలీ సెంటిమెంట్, యాక్షన్ చిత్రాలను ఇష్టపడే వారికి ఓ మోస్తరుగా నచ్చొచ్చు! ఈ సినిమాకు సంబంధించిన మరో విశేషం ఏమంటే… దర్శకుడు హరి హీరో అరుణ్ విజయ్ హాఫ్ సిస్టర్ ప్రీతికి భర్త! విజయ్ కుమార్ మొదటి భార్య కొడుకు అరుణ్ కాగా, రెండో భార్య మంజుల కూతురు ప్రీతి. సో దర్శకుడు హరి, కథానాయకుడు అరుణ్‌ విజయ్ బావ-బావమరుదులన్న మాట!!

Show comments