ఆహా ఓటీటీలో ఇటీవల విడుదలై, క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్న వెబ్ సిరీస్ ‘ధూల్ పేట్ పోలీస్ స్టేషన్’. తమిళంలో రూపొందిన ఈ ఇన్వెస్టిగేటివ్ డ్రామాను తెలుగు ప్రేక్షకుల కోసం డబ్ చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. జస్విని దర్శకత్వంలో అశ్విన్, గురు లక్ష్మణన్, పదినే కుమార్, శ్రీతు కృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్, ఒకే రాత్రి జరిగిన మూడు హత్యల మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం పదండి.
ధూల్ పేట్ పోలీస్ స్టేషన్ కథ
ధూల్ పేట్ అనే గ్రామంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి, అదే సమయంలో ఆ ప్రాంతానికి కొత్త పోలీస్ ఆఫీసర్‌గా వెట్రి మారన్ (అశ్విన్) బాధ్యతలు చేపడతాడు. నిఖార్సైన అధికారిగా పేరున్న వెట్రి మారన్, అక్కడి రాజకీయాల వెనుక ఉన్న చీకటి కోణాలను గమనిస్తుంటాడు, అదే పోలీస్ స్టేషన్‌లో మాసాని (పదినే కుమార్) కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటుంది. అమ్మవారి భక్తురాలైన ఆమెకు భవిష్యత్తులో జరగబోయే కొన్ని సంఘటనలు ముందుగానే తెలుస్తుంటాయి, గ్రామంలో మూడు హత్యలు జరగబోతున్నాయని ఆమె తోటి పోలీసులకు హెచ్చరిస్తుంది. ఆమె చెప్పినట్టుగానే, ఊరిని ఉలిక్కిపడేలా చేస్తూ మూడు హత్యలు జరుగుతాయి. అందులో స్థానిక ప్రముఖుడు ఉమాపతి కుమార్తె సంధ్య కూడా ఉండటంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది, ఈ కేసును ఛేదించేందుకు వెట్రి మారన్ రంగంలోకి దిగుతాడు. ఆయనకు తోడుగా ఏసీపీ అర్జున్ (గురు లక్ష్మణన్) కూడా చేరుతాడు. వీరిద్దరూ కలిసి ఈ హత్యల వెనుక ఉన్న నిజాన్ని ఎలా కనిపెట్టారు? సంధ్యను చంపింది ఎవరు? అనేదే మిగతా కథ.
విశ్లేషణ
సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్లు గ్రామీణ నేపథ్యం లేదా రౌడీయిజం చుట్టూ తిరుగుతాయి కానీ డైరెక్టర్ జస్విని ఈ కథను పోలీస్ స్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించడం కొత్తగా అనిపిస్తుంది. ఒక సున్నితమైన ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడటం పోలీసులకు ఎంతటి సవాలుతో కూడుకున్న విషయమో ఈ సిరీస్‌లో చక్కగా ఆవిష్కరించారు. మొదటి ఎపిసోడ్‌లోనే మూడు హత్యలను చూపించి ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచారు కానీ ఆరో ఎపిసోడ్ నుండి ఇన్వెస్టిగేషన్ వేగం పుంజుకుంటుంది. రాజకీయం, రౌడీయిజం, పాత పగలు, అలానే ఓ సున్నితమైన ప్రేమకథ..అంటూ ఎలిమెంట్స్ మిక్స్ చేసి కథను నడిపించిన తీరు బాగుంది. అయితే సాధారణ వెబ్ సిరీస్‌లు 8-10 ఎపిసోడ్లతో ముగుస్తాయి. కానీ ఇది ఏకంగా 50 ఎపిసోడ్ల ప్లాన్‌తో ప్రస్తుతం 20 ఎపిసోడ్లతో ‘కేస్ 1’ ముగించారు. కథనం ఎక్కడా బోర్ కొట్టకుండా, ప్రతి ఎపిసోడ్‌లోనూ ఒక ట్విస్ట్ ఉండేలా జాగ్రత్త పడ్డారు.
నటీనటుల విషయానికి వస్తే సీరియస్ పోలీస్ ఆఫీసర్‌గా అశ్విన్ వెట్రి మారన్ పాత్రలో ఒదిగిపోయాడు, ఆయన నటన చాలా సహజంగా ఉంది. ఏసీపీ అర్జున్‌గా గురు లక్ష్మణన్ నటన ఆకట్టుకుంటుంది, ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ మధ్యలో వచ్చే ఫన్నీ సన్నివేశాలు రిలీఫ్ ఇస్తాయి. కానిస్టేబుల్ మాసానిగా పదినే కుమార్ పాత్ర ఈ సిరీస్‌కు ఒక ప్రత్యేక ఆకర్షణ, ఆ పాత్రలోని దైవిక అంశం కథకు బలాన్నిచ్చింది. శ్రీతు కృష్ణన్, ప్రీతి శర్మ తమ పరిధి మేరకు చక్కగా నటించి మెప్పించారు.
సాంకేతిక విభాగం విషయానికి వస్తే సాంకేతికంగా సిరీస్ ఉన్నత స్థాయిలో ఉంది, అశ్వత్ అందించిన నేపథ్య సంగీతం థ్రిల్లర్ మూడ్‌ని బాగా ఎలివేట్ చేసింది. సతీశ్ కుమార్ సినిమాటోగ్రఫీ ధూల్ పేట్ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది, నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గలేదు.
‘ధూల్ పేట్ పోలీస్ స్టేషన్’ ఒక సాలిడ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. పెద్దగా అంచనాలు లేకుండా మొదలై, కథనంతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.