LGM Telugu Review: టీమిండియా క్రికెటర్ గా ముఖ్యంగా కెప్టెన్‌గా ఎన్నో అద్భుతాలు చేసిన మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ వరల్డ్ లో తనకంటూ ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్నాడు. పలు వ్యాపారాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ధోనీ నిర్మాతగా మారి తమిళంలో ఫస్ట్ మూవీ తీశాడు. అదే సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేశారు. లవ్ టుడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఇవానా హీరోయిన్ గా హరీష్ కళ్యాణ్ హీరోగా ఎల్.జి.ఎమ్ అంటే లెట్స్ గెట్ మ్యారీడ్ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకి స్వయంగా ధోనీ భార్య సాక్షి ధోని కూడా ప్రమోట్ చేయడంతో సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా ఎలా ఉంది? టాక్ ఏంటి? హిట్టా ఫట్టా? అనే వివరాలు రివ్యూలో చూసేద్దాం పదండి.
ఎల్.జి.ఎమ్ కథ:
ఒకే ఆఫీసులో పని చేసే గౌతమ్(హరీశ్ కల్యాణ్), మీరా(ఇవానా) రెండేళ్లుగా ప్రేమలో ఉంటారు. పెళ్లికి రెడీ అయిన క్రమంలో గౌతమ్ తల్లి(నదియా)తో కలిసి ఉండడం కష్టం అని మీరా నో చెబుతుంది. ఆమెను వదిలి నేను ఉండలేను అది కుదరని పని అని తేల్చేసి గౌతమ్ పెళ్లి వద్దని వెళ్ళిపోతాడు.. అయితే గౌతమ్ ను దూరం చేసుకోలేక మీరా అత్త లీలను అర్థం చేసుకోవడం కోసం తన పెళ్లికి ముందు ఆమెతో కలిసి ట్రిప్ కి వెళ్దాం అంటుంది. అయితే ట్రిప్‌కి వెళ్లిన మీరా, లీల మధ్య పెద్ద గొడవ అవుతుంది. రెండు కుటుంబాలు కలిసి కూర్గ్ వెళ్లగా మీరా, లీల మధ్యలో గౌతమ్ ఎలా నలిగిపోయాడు? కూర్గ్ నుంచి లీలా, మీరా గోవా ఎందుకు వెళ్లారు? గోవా నుంచి తిరిగి వచ్చే క్రమంలో వారికి ఏమైంది? గౌతమ్, మీరాల పెళ్లికి లీల ఒప్పుకుందా? కలిసి ఉండేందుకు మీరా ఒప్పుకున్నదా అన్నదే ఈ ఎల్.జి.ఎమ్ సినిమా(LGM Story) కథ.
విశ్లేషణ:
పెళ్ళికి ముందు డేటింగ్ పేరుతో కాలం గడిపేస్తున్న ఈ రోజుల్లో అత్తతో తనకు పొసుగుతుందో లేదో తెలుసుకోవడానికి రెడీ అయిన నేటి తరం అమ్మాయి కథే ఈ ఎల్.జి.ఎమ్. నిజానికి ఇది కొంచెం కొత్త పాయింట్ అనిపిస్తున్నా అత్తారింట వారం గడిపేందుకు వచ్చిన బొమ్మరిల్లు హాసిని మనకు ఎప్పుడో తెలుసు. కానీ ఇలా ట్రిప్ కు వెళ్లి పరిచయం పెంచుకోవాలి అనే కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించారు ఎల్.జి.ఎమ్ మేకర్స్. నిజానికి ఈ అత్తా కోడళ్ల మధ్య గొడవ పేరుతో పదుల సంఖ్యలో సీరియళ్లు సైతం వచ్చాయి, వస్తున్నాయి వస్తూనే ఉంటాయి. మరి ఎందుకో కానీ అలాంటి కధనే సిల్వర్‌స్క్రీన్‌పై ప్రజెంట్ చేసి హిట్ కొట్టాలని ట్రై చేశాడు దర్శకుడు రమేష్ తమిళమణి. అత్తాకోడళ్ల కాన్సెప్ట్‌కు కామెడీని మిక్స్ చేసి ప్రేక్షకులను కొంతవరకు అలరిచినా ఒకానొక దశలో మాత్రం బోర్ అనిపిస్తుంది. పెళ్లికి ముందే అత్తను అర్ధం చేసుకోవడం కోసం ఆమెతో కలిసి కోడలు ట్రిప్‌కు వెళ్లడం అనే ఐడియా కొత్తగా ఉంది కానీ పూర్తి స్థాయిలో ఎగ్జిక్యూట్ చేయలేక తడబడినట్టు అనిపించింది. కామెడీకి ఎమోషన్స్ కూడా జోడించడంతో కొంతవరకు ఎంగేజింగ్ అనిపిస్తుంది. అయితే స్లో స్క్రీన్ ప్లే సినిమాకి కొంత ఇబ్బందికర అంశం. అయితే ఓవరాల్ గా చూస్తే మాత్రం సినిమాలో ఏమాత్రం అసభ్యతకు తావు లేకుండా అప్పుడప్పుడు నవ్విస్తూ వెంటనే ఆలోచింపచేస్తూ సాగిపోతుంది. ఈ రోజుల్లో పెళ్ళికి సిద్ధం అవుతున్న జంటలు, వారి తల్లిదండ్రులు చూడాల్సిన సినిమాగా ఉందని అనడంలో సందేహం లేదు. అయితే డైరెక్టర్ తమిళమణి డైరెక్ట్ చేస్తూనే మ్యూజిక్ అందిస్తూ వీఎఫ్ఎక్స్ మీద కూడా పని చేయడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినట్టు అనిపిస్తుంది. సినిమా స్క్రీన్ ప్లే మీద కొంత ఫోకస్ చేసి నిడివి విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా వేరే లెవల్ లో ఉంటుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఎవరెలా చేశారంటే?
హరీష్ కళ్యాణ్ సినిమాకి హీరో అయినా ఇవానా, నదియా అతన్ని డామినేట్ చేసేశారు. ఫస్టాఫ్ లో కొంతవరకు ఆయన కనిపించినా సెకండ్ హాఫ్ లో మాత్రం ఆయన సినిమాకి హీరోనా అతిధి పాత్రనా అనిపిస్తుంది. అయితే ఉన్నంతలో హరీష్ కళ్యాణ్ ఆకట్టుకున్నాడు. “లవ్ టుడే”లో తన అభినయంతో, అందంతో అదరగొట్టిన ఇవానా ఈ సినిమాలో కూడా అదరగొట్టింది. ఇక నదియా అనుభవం అంతా స్క్రీన్ మీద కనిపించింది. హీరోకి తల్లి పాత్రలో, గడసరి అత్తలా ఆమె సినిమాను నడిపింది. యోగి బాబు కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇక మిగతా నటీనటులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక టెక్నీకల్ అంశాలు విషయానికి వస్తే దర్శకుడు తమిళమణి స్వరపరిచిన ఈ సినిమాలో పాటలు కొన్ని బాగున్నా మరికొన్ని పర్లేదనిపించాయి. సినిమాటోగ్రఫీ బాగుంది, ఫారెస్ట్, కూర్గ్ లొకేషన్స్ ను బాగా చూపించారు. ఇక వీఎఫ్ఎక్స్ ను కూడా హ్యాండిల్ చేసిన తమిళ మణి అందులో కొంత వరకు మంచి మార్కులు కొట్టేశారు.
ఫైనల్‌గా
ఎల్.జి.ఎమ్ అసభ్యతకు తావు లేని ఒక పర్ఫెక్ట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్