NTV Telugu Site icon

Devil Movie Review: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ మూవీ రివ్యూ!

Kalyan Ram Devil Review

Kalyan Ram Devil Review

Kalyan Ram, Samyuktha Menon’s Devil Movie Review: కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ డెవిల్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా నిర్మిస్తూనే దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే సినిమా మీద అంచానాలు ఏర్పడ్డాయి. అయితే ముందు ప్రకటించిన దర్శకుడు నవీన్ మేడారంను తప్పించడం వంటి కారణాలతో ఎక్కువగా మీడియాలో హైలైట్ అయిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఒకసారిగా ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడేలా చేసింది. సంయుక్త మీనన్, మాళవిక నాయర్ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ శుక్రవారం నాడు ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం పదండి.

డెవిల్ మూవీ కథ:
1945లో ఆజాద్ హింద్ ఫౌజ్ ఫౌండర్ సుభాష్ చంద్రబోస్ సుమారు నాలుగేళ్ల పాటు విదేశాల్లో ఉండి ఇండియా వచ్చేందుకు సిద్ధం అవుతాడు. ఆయనను ట్రేస్ చేయడం కోసం బ్రిటీష్ సీక్రెట్ సర్వీస్ తమ బెస్ట్ ఏజెంట్ అయిన డెవిల్(కళ్యాణ్ రామ్)ను రంగంలోకి దించుతుంది. ఆ విషయం బయట పడకుండా రాసపాడు అనే ఊరిలో జరిగిన జమీందార్ కుతూరు విజయ(అమ్ము అభిరామి) హత్య కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం పంపుతారు. అలా వెళ్లిన డెవిల్ జమీందార్ మేనకోడలు నైషధ(సంయుక్త మీనన్)తో ప్రేమలో పడతాడు. ఎలా అయినా బోస్ ను అంతమొందించాలని బ్రిటిష్ అధికారులు ప్రయత్నాలు చేస్తుంటే దాన్ని ఆపాలని ఆజాద్ హింద్ ఫౌజ్ ఏజెంట్లు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో డెవిల్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా ఎంత వరకు సఫలం అయ్యాడు? బోసును బ్రిటిష్ అధికారుల నుంచి కాపాడాలని ప్రయత్నించిన త్రివర్ణ ఎవరు? ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ నాయకురాలు మణి మేఖల (మాళవిక నాయర్) పాత్ర ఏమిటి? చివరికి అసలు ఏం జరిగింది? విజయను ఎవరు హత్య చేశారు? అనే వివరాలు తెలియాలి అంటే డెవిల్ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
1945లో బ్రిటీష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ అంటూ ఈ డెవిల్ సినిమా గురించి ముందు నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చింది సినిమా యూనిట్. అదే కొంతవరకు సినిమా మీద అంచనాలు ఏర్పడేలా చేయండి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే సినిమా పూర్తిగా పీరియాడిక్ కావడం కూడా ఇంట్రెస్ట్ పెంచింది. సినిమా మొదలు కావడమే ఒక హత్య కేసుతో మొదలవుతుంది. జమిందార్ కూతురు విజయ అనూహ్యంగా హత్యకు గురి కావడం వెంటనే ఇంట్లో పని చేసే ఒక పాలేరు మిస్ కావడంతో విజయ హత్యకు జమిందార్ కారణం అని అరెస్ట్ చేస్తారు. అయితే ఈ హత్య కేసును బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అయిన డెవిల్ కి అప్పగించడంతో ఒకసారి అందరిలో ఆసక్తి పెరుగుతుంది. ఆ హత్య కేసు డీల్ చేయడం కోసం రంగంలోకి దిగిన డెవిల్ ఆ తర్వాత ఒక్కొక్క విషయాన్ని రివీల్ చేస్తూ వెళ్లడం సినిమా మీద ఆసక్తి పెంచేలా చేసింది. ఒకపక్క హత్య చేసింది ఎవరు అని ప్రేక్షకులలో ఆసక్తి కలిగిస్తూనే, దానికి సమాంతరంగా ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రబోస్ కోసం అక్కడ ఎవరు పని చేస్తున్నారు? అనే విషయం మీద కూడా ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. నిజానికి ఇదేమీ జరిగిన కథ కాదు కేవలం సుభాష్ చంద్రబోస్ అనే ఒక క్యారెక్టర్ లో ఇన్స్పిరేషన్ గా తీసుకొని దాని చుట్టూ అల్లుకున్న ఒక కల్పిత కథ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే దాదాపుగా ప్రతి భారతీయుడికి ఎనలేని గౌరవం ఉంటుంది.. ఆయన మర్డర్ మిస్టరీ ఇప్పటికీ తేలలేదు. ఆయన స్వాత్రాంత పోరాట కాలంలో కార్యకలాపాలు కూడా వేరే దేశం ఎక్కడి నుంచో జరుపుతూ ఉండేవారు. వాటిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ కథ మొత్తం రాసుకున్నట్టు అనిపించింది. చరిత్రలో ఆయన జరిపినవన్నీ సీక్రెట్ మిషన్లు, ఆపరేషన్లు కావడంతో నిజంగా ఆయన ఇలాంటి విషయాలు చేశారు అని చెప్పలేం. అలా అని చేయలేదు అని కూడా చెప్పలేం. అలా జరిగి ఉంటే ఎలా ఉంటుంది అనే ఊహతో రాసుకున్న కథ వినడానికి బాగానే ఉన్నా ఎగ్జిక్యూషన్లో పూర్తిస్థాయి న్యాయం చేయలేక పోయినట్టు అనిపించింది. స్క్రీన్ ప్లే మీద ఇంకా వర్కౌట్ చేసి ఉంటే బాగుండేది. ఒక్కమాటలో చెప్పాలంటే డబుల్ ఏజెంట్ సినిమాలు గతంలో మనం చాలా చూసే ఉంటాం, దాదాపుగా ఇది కూడా అలాంటి సినిమానే. అయితే సినిమా మొత్తం పీరియాడిక్ కావడం, భారత స్వతంత్ర పోరాటంతో లింక్ ఉండడం మాత్రమే వాటితో కొంచెం వేరు అనిపించేలా చేసింది. అయితే పూర్తిస్థాయిలో మేము ఎగ్జిక్యూషన్ మీద మరింత ఫోకస్ పెట్టి ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది అనిపిస్తుంది.

నటీనటులు:
ఈ సినిమాలో బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ డెవిల్ అనే టైటిల్ రోల్ లో కళ్యాణ్ రామ్ అదరగొట్టాడు. ఎప్పుడూ సెటిల్డ్ గా నటించే ఆయన ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ తో దుమ్ము రేపాడు. ఇక సంయుక్త మీనన్ కి మంచి రోల్ పడింది, అందంగా కనిపిస్తూనే నటన విషయంలో మంచి మార్కులు వేసుకునేలా నటించింది. మాళవిక పాత్ర చిన్నదే అయినా ఉన్నంతలో అదరగొట్టింది. అజయ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య, వశిష్ట సింహ, జబర్దస్త్ మహేష్, షఫీ వంటి వారు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే అందరికంటే ఎక్కువగా కష్టపడింది ఆర్ట్ టీం అనిపించింది. ఎందుకంటే అప్పటి ప్రపంచాన్ని క్రియేట్ చేయడం అంత ఈజీ ఏమీ కాదు. కానీ సినిమా చూస్తున్నంత సేపు ఆ రోజుల్లోకి తీసుకు వెళ్ళారు. ఇక ఒకటి రెండు పాటలు వినడానికి బాగున్నా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో టాప్ లేపాడు హర్ష వర్ధన్. కాస్ట్యూమ్స్ విషయం లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ కంప్యూటర్ గ్రాఫిక్స్ అంత మెప్పించేలా లేవు. మిగతా విషయాలలో నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్లీ: డెవిల్ ఒక ఊహాజనిత కథతో రాసుకున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. కానీ అందరినీ థ్రిల్ చేస్తుందా? అంటే అనుమానమే.