NTV Telugu Site icon

Dahanam Movie Review: దహనం

Dahanam

Dahanam

Dahanam Movie Review: దాదాపు రెండు దశాబ్దాల క్రితం ‘లాహిరి లాహిరి లాహిరిలో’ మూవీతో తెలుగువారి ముందుకొచ్చిన ఆదిత్య ఓం ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించాడు. కానీ ఆ స్థాయి విజయం అతనికి దక్కలేదు. ఆ తర్వాత హిందీలో కొన్ని సినిమాలలో యాక్ట్ చేసి, డైరెక్షన్ చేశాడు. తాజాగా అతను నటించిన తెలుగు సినిమా ‘దహనం’ ఇప్పటికే కొన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అవార్డులను అందుకుంది. ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో డాక్టర్ పెతకంశెట్టి సతీశ్ కుమార్ దీన్ని ప్రొడ్యూస్ చేశారు. దీనికి ఆయనే పాటలు రాసి, సంగీతాన్ని సమకూర్చడం విశేషం. మరి అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ ‘దహనం’ ఎలా ఉందో చూద్దాం.

నలభై యేళ్ళ క్రితం ఉత్తర కోస్తాంధ్రలో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా ‘దహనం’ మూవీ తెరకెక్కింది. తన తాతముత్తాలు దేవుడికి మాన్యంగా ఇచ్చిన రెండు వందల ఎకరాల భూమిని, శివాలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలనుకుంటాడు భూపతి (శాంతి చంద్ర). ఆ శివాలయాన్నే నమ్ముకున్న భరద్వాజ శాస్త్రి (ఆదిత్య ఓం) అందుకు ససేమిరా అంటాడు. కేసు కోర్టుకు వెళుతుంది. ఆ శివాలయం పక్కనే ఉండే శ్మశానంలో కాటికాపరి బైరాగి (ఎఫ్.ఎం. బాబాయ్). అతనికి ఒక్కసారైనా గర్భగుడిలోని శివలింగాన్ని తాకాలనే కోరిక ఉంటుంది. ఈ ముగ్గురి జీవితాలకు సంబంధించిన కథే ‘దహనం’.

దేవాలయమే దేహంగా భావించే పూజారి ఒక వైపు. దైవం కంటే మానవత్వం గొప్పదనుకునే కాటికాపరి మరోవైపు. ఈ ఇద్దరినీ పావులుగా వాడుకోవాలని చూసే కామాంధుడైన ఊరి పెద్ద ఇంకో వైపు. ఈ మూడు పాత్రలతో దర్శకుడు ఆడారి మూర్తి సాయి చక్కని కథనే తయారు చేసుకున్నారు. బట్… క్యారెక్టరైజేషన్స్ విషయంలో తడబడ్డారు. మరీ ముఖ్యంగా ఆదిత్య ఓమ్ పాత్రను ఒకానొక సమయంలో ఉదారవాదిగా చూపించిన దర్శకుడు, ప్రీ క్లయిమాక్స్ లో ఛాందసుడిగా చిత్రీకరించారు. అతనిలో పరివర్తన రావడమనేది ప్రధానం కాబట్టి అలా చూపించి ఉండొచ్చు. ఇక స్త్రీ లోలుడైన భూపతి తన తప్పును తెలుసుకునే సన్నివేశాలను మరింత బలంగా చూపించి ఉండాల్సింది. ఈ రెండు పాత్రలకంటే దర్శకుడు కాటికాపరి పాత్ర మీదనే ఎక్కువ శ్రద్ధపెట్టినట్టు అర్థమౌతోంది. ఈ మూడు పాత్రలతో పాటు తాను చెప్పదల్చుకున్న కోర్ పాయింట్ ను దర్శకుడు పూజారి కూతురు పాత్ర ద్వారా చెప్పించాడు. కట్టుకున్న భర్తకు విడాకులైనా ఇస్తాను కానీ మతం మారనని ఆ పాత్ర చెప్పడం గొప్పగా ఉంది. స్వధర్మంలోని లోటు పాటులను సవరించుకుని, ముందుకు సాగాలి తప్పితే, పరమతం పాము పడగ నీడ లాంటిదనేది విషయాన్ని ఆ సన్నివేశం ద్వారా చెప్పించారు. నిజానికి సినిమాలోని ప్రధానాంశం కూడా ఇదే. గంగలో మునిగిన పూజారి స్థానంలో కాటికాపరి కొడుకు పైకి రావడం అనేది అద్భుతమైన షాట్!

ఇది నలభై యేళ్ళ నాటి కథ కాబట్టి, అప్పటి వాతావరణాన్నే చూపించారు. ఆనాటి ఆచార వ్యవహరాలు, గ్రామ కట్టుబాట్లు, కులవివక్ష ఇవన్నీ ఇందులో ఉన్నాయి. నటీనటుల విషయానికి వస్తే… ఆదిత్య ఓం గత పాత్రలకు ఇది పూర్తి భిన్నమైంది. నిస్సహాయుడైన పూజారిగా బాగానే నటించాడు. కానీ ఈ మరింత బాగా చేయుచ్చు. కాటికాపరి పాత్రకు ఎఫ్.ఎమ్. బాబాయ్ పూర్తి న్యాయం చేకూర్చాడు. కొన్ని సీన్స్ చూస్తుంటే ‘సొంత వూరు’లో ఎల్బీ శ్రీరామ్ నటన గుర్తొచ్చింది. పూజారి కూతురుగా సోనీ రెడ్డి చక్కగా ఉంది. ఇతర మహిళలు కూడా తన పాత్రలను మంచిగా పోషించారు. సతీశ్ కుమార్ రాసిన పాటలు అర్థవంతంగా ఉన్నాయి.

‘దహనం’ కమర్షియల్ మూవీ కాదు, ఓ చక్కని సందేశం కోసమే దీన్ని దర్శక నిర్మాతలు తీసినట్టు అర్థమైపోతోంది. వాళ్ళకున్న పరిమిత వనరులలో ఈ సినిమా ద్వారా సమాజానికి చెప్పాలనుకున్నది చెప్పారు. అంతే! వాస్తవం మాట్లాడుకోవాలంటే థియేటర్లలో ఇలాంటి సినిమాలకు ఇవాళ ఆదరణ లభించడం కష్టం. ఓటీటీలో స్ట్రీమింగ్ సమయంలో అయినా… కొంత నిడివిని తగ్గిస్తే బెటర్!

రేటింగ్: 2.25/5

ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న కథాంశం
నటీనటుల సహజ నటన
పతాక సన్నివేశం

మైనెస్ పాయింట్స్
స్లో నెరేషన్
ఆకట్టుకోని కథనం
ప్రొడక్షన్ వాల్యూస్ లేకపోవడం

ట్యాగ్ లైన్: సహనం అవసరం!