వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో *కానిస్టేబుల్ కనకం* అనే సిరీస్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సిరీస్ మీద కాస్త ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు, ఈ సిరీస్‌ను కాపీ కొట్టి మరో సంస్థ మరో సిరీస్ చేసిందంటూ, సిరీస్ దర్శకుడు ఆరోపించడంతో, ఈ సిరీస్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే, ఈ సిరీస్ ఆగస్టు 14వ తేదీన ఈటీవీ విన్‌లో విడుదలైంది. ఆరు ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
*కానిస్టేబుల్ కనకం కథ*
శ్రీకాకుళం జిల్లాలోని రేపల్లె అనే గ్రామంలోని పెద్దగా కేసులు లేని ఓ పోలీస్ స్టేషన్లో, ఏకైక కానిస్టేబుల్‌గా డ్యూటీలో జాయిన్ అవుతుంది కనుక మహాలక్ష్మి అలియాస్ కనకం (వర్ష బొల్లమ్మ). అయితే ఆ ఊరిని ఆనుకుని ఉన్న అడవిలో, ప్రతి పౌర్ణమి రోజూ ఒక్కొక్క అమ్మాయి కనిపించకుండా మాయం అవుతూ ఉంటుంది. అయితే కనకం స్నేహితురాలు అయిన చంద్రిక (మేఘలేఖ) కూడా అలాగే మిస్ అవ్వడంతో, ఆమెను వెతికే పనిలో పడుతుంది కనకం. అలా ఆమెను వెతికే క్రమంలో, కనకానికి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అసలు రేపల్లెలో ఆడపిల్లలు ఎందుకు మిస్ అవుతున్నారు? వారిని మాయం చేసేది ఎవరు? అసలు వారిని కనకం ఎలా పట్టుకుంది? అందుకు ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? అనేవి తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
*విశ్లేషణ*
ఈ మధ్యకాలంలో వెబ్ కంటెంట్ వినియోగం బాగా పెరిగిపోయింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, సహా లోకల్ ఓటీటీ సంస్థలు సైతం ఇలాంటి థ్రిల్లర్ సిరీస్‌లను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వస్తున్నాయి. అయితే ఈ సిరీస్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయిందనే చెప్పాలి. ఎందుకంటే, కాపీరైట్ వ్యవహారం మీద అంత పోరాడిన తర్వాత, అందరూ బాగా ఉంటుందని భావించారు. కానీ అంచనాలను సిరీస్ అందుకోలేకపోయింది. దర్శకుడు ప్రశాంత్ రాసుకున్న కథ బాగున్నప్పటికీ, కథనంలో మాత్రం ఆసక్తి రేపడంలో తడబడ్డాడు.
సిరీస్ మొదలైన తొలి మూడు ఎపిసోడ్ల వరకు, చాలాసా…… గ తీసిన ఫీలింగ్ కలుగుతుంది. చాలా ఎక్కువ క్యారెక్టర్లు ఉండడంతో, అవి కొంత ఆసక్తి కలిగించినా, పతాక సన్నివేశాల వరకు వచ్చాక, ఇన్ని క్యారెక్టర్లు అవసరమా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆరు ఎపిసోడ్‌లలో, చివరి మూడు ఎపిసోడ్లు మాత్రం ఆసక్తికరంగా సాగాయి. దానికి తోడు, సెకండ్ సీజన్‌కు ఇచ్చిన లీడ్ కూడా బాగుంది. కాబట్టి, ఫస్ట్ సీజన్‌లో జరిగిన పొరపాట్లను, సెకండ్ సీజన్‌లో సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారేమో చూడాలి.
*నటీనటులు*
వర్ష బొల్లమ్మ ఈ పాత్రలో కరెక్ట్‌గా సెట్ అయింది. ఆమె ఈ పాత్రలో ఎమోషన్స్ అన్నీ చాలా నేచురల్‌గా పండించింది. అయితే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ విషయంలో మాత్రం కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఆమె కాకుండా, మేఘలేక, రాజీవ్ కనకాల, రమణ, భార్గవ్ శ్రీనివాస్, అవసరాల వంటి వారు తమదైన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు.
*టెక్నికల్ టీం*
ఈ సిరీస్‌లో ప్రధానమైన ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే, అది నేపథ్య సంగీతమే. సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కేవలం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తోనే ఎలివేట్ చేశాడంటే, అర్థం చేసుకోవచ్చు. శ్రీరామ్ సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్‌గా ఉంది, కానీ కొంచెం కేర్ తీసుకుని ఉండాల్సింది. ప్రొడక్షన్ మాత్రం బాగుంది. చాలా మంచి వాల్యూస్‌తో సిరీస్ చేశారు.
*ఫైనల్లీ — కానిస్టేబుల్ కనకం*: కొంచెం ఇష్టం, కొంచెం కష్టం.