నిజానికి ఇప్పుడు ఏ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు, ఏ సినిమాలను ఆదరించడం లేదు అనే విషయాన్ని ఊహించడం చాలా కష్టమవుతుంది. ఎన్నో అంచనాలు పెట్టుకుని చేసిన సినిమాలు బోల్తా పడుతుంటే, ఏమాత్రం అంచనా లేకుండా వస్తున్న సినిమాలు మాత్రం ఆకట్టుకుంటున్నాయి. అలా ఆసక్తి రేకెత్తించిన సినిమా బన్ బట్టర్ జామ్. హీరో మనకు తెలిసిన ముఖం కాదు. హీరోయిన్స్‌లో ఒకరు గతంలో జో సినిమాలో పరిచయమైన వారు, మరో హీరోయిన్ ఎవరో తెలియదు. అయినా ఈ సినిమాను తమిళ ప్రేక్షకులు ఆదరించారు. అలా ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమాను నెల గ్యాప్‌లో, తమిళం తర్వాత, తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. మరి సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
*బన్ బట్టర్ జామ్ కథ*
అప్పుడే ఇంటర్ పూర్తి చేసుకున్న చంద్రు(జయ మోహన్), మధుమిత(ఆద్య ప్రసాద్) ఇద్దరికీ ప్రేమ కలిగేలా చేసి, వారిద్దరికీ పెళ్లి చేయాలని వారి తల్లులు ఇద్దరూ ఇరుగు పొరుగు అయి ఉండాలని భావించి, పక్కపక్కనే ఇళ్లలో చేరి, వారి మధ్య ప్రేమ కలిగించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విషయం తెలియక చంద్రు కాలేజీలో నందిని(భవ్య)తో ప్రేమలో పడతాడు. మధుమిత ఆకాశ్ అనే కుర్రాడితో ప్రేమలో పడుతుంది. అయితే ఈ రెండు ప్రేమ జంటలు తమ ప్రేమను సక్సెస్ చేసుకోలేకపోతాయి. అయినా ప్రేమ లేకపోతే జీవితం లేదనుకోకుండా, కష్టపడి చదివి చంద్రు మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. ఆకాశ్‌తో ప్రేమ విఫలమవడంతో మధుమిత కూడా కొంత డిప్రెషన్‌లో ఉంటూ, తన భవిష్యత్తు మీద ఫోకస్ చేయాలని భావిస్తుంది. అయితే చివరికి ఆ తల్లుల కృషి ఫలించిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
*విశ్లేషణ:*
సినిమా టైటిల్ చూసి ఇదేదో ఫుడ్ సంబంధిత సినిమా అనుకుంటే, మీరు పప్పులో కాలేసినట్టే. ఇది పూర్తిస్థాయి కామిక్ లవ్ జానర్ సినిమా. ఈ రోజుల్లో జెన్ జీ కిడ్స్ కనెక్ట్ అయ్యేలా, ఇన్స్టంట్ లవ్, ఇన్స్టంట్ బ్రేకప్ లాంటి అంశాలను ముడిపెట్టి కథ రాసుకున్నాడు దర్శకుడు. ఈ రోజుల్లో ప్రేమించి, పెళ్లి చేసుకున్న పెద్దలు, దూరంగా వెళ్లి చివరికి విడాకుల వరకు వెళ్లడం కామన్ అయిపోయింది. కానీ ఈ సినిమాలో ఏదో కొత్తగా చెప్పాలనే ప్రయత్నం చేయకుండా, బన్ బట్టర్ జామ్ అంటూ ప్రేమకు నిర్వచనం చెప్పే ప్రయత్నం చేశారు. పేరెంట్స్, అరెంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ గురించి ఎలా ఆలోచిస్తారనే పాయింట్ ఈ కథలో కొత్తగా అనిపించేలా చూపించారు. పాయింట్ బాగానే ఉంది, కానీ కథగా మలుచుకున్న తీరు బాగాలేదు. సినిమా సీన్స్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్‌గా ఉండాల్సిందనిపిస్తుంది. కామెడీ సీన్స్ చూస్తే, ప్రస్తుతం ఉండే స్పీడ్ లేకపోవడం వల్ల, జనరేషన్ గ్యాప్ ఎక్కువగా ఉందనిపిస్తుంది. దాంతో ఫన్ పెద్దగా వర్కవుట్ కాలేదనే ఫీలింగ్ కలగవచ్చు. ఫ్రెండ్‌షిప్, బ్రేకప్స్, రిలేషన్‌షిప్ అంశాల విషయంలో మరింత కసరత్తు చేసి ఉంటే బాగుండేదనిపిస్తుంది. దర్శకుడు రాఘవ్ మిర్దాజ్ ఈ చిత్రాన్ని ఒక వినోదాత్మక కామెడీ చిత్రంగా రూపొందించే విషయంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.
ఇక నటీనటుల విషయానికి వస్తే, రాజు జయమోహన్, శివకార్తికేయన్ నటించిన డాన్ సినిమాలో నెగెటివ్ రోల్‌లో మెప్పించిన ఆయన, హీరోగా కొత్త అవతారంలో కనిపించారు. బిగ్‌బాస్ విజేతగా తనకు ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకొనే ప్రయత్నం చేస్తూనే, తన పాత్ర వరకు పూర్తిగా న్యాయం చేశాడు. ముఖ్యంగా యాక్టింగ్ పరంగా మంచి మార్కులే సంపాదించుకొన్నాడు. ఆద్య, భవ్య త్రిఖా ఇద్దరూ తమ పాత్రలలో అదరకొట్టారు. మిగతా పాత్రధారులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, నివాస్ కె. ప్రసన్న అందించిన నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్ బాబు కుమార్ యువతను ఆకట్టుకునేలా సినిమాను చూపించారు. రెయిన్ ఆఫ్ ఆరోస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సురేష్ సుబ్రమణ్యం నిర్మాణ విలువలు బాగున్నాయి.
*ఫైనల్లీ:* బన్ బట్టర్ జామ్ కామెడీ ఎంటర్‌టైనర్ విత్ మెసేజ్.