Mammootty’s Bramayugam Movie Review: మలయాళ మెగాస్టార్ హీరోగా భ్రమ యుగం అనే ఒక ఆసక్తికరమైన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ గత వారం మలయాళ వెర్షన్ రిలీజ్ అయింది. ఒక వారం తర్వాత ఈరోజు తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో సినిమా రిలీజ్ చేస్తున్నారు. పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ అలాగే 2:1 ఫార్మాట్లు రిలీజ్ చేసిన ఈ సినిమా మలయాళ నాట మంచి రివ్యూస్ తెచ్చుకుంది. సినిమాలో మమ్ముట్టి నటనకు అద్భుతమైన ప్రశంసలు కూడా దక్కాయి. మరి తెలుగు సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
భ్రమ యుగం కథ:
ఈ సినిమా కథ మొత్తం తెల్లవాళ్లు ఇంకా భారతదేశంలోకి అడుగుపెట్టకముందు జరుగుతూ ఉంటుంది. తేవన్ (అర్జున్ అశోకన్) ఒక మంచి గాయకుడు. తక్కువ కులానికి చెందిన తేవన్ ను బానిసల అమ్మేస్తుంటే తప్పించుకుని అడవిలో తప్పిపోతాడు. తనతో పాటు వచ్చిన ఒక వ్యక్తి యక్షిణికి బలైపోగా ఆకలితో తిరిగి తిరిగి చివరకు ఓ పాడుబడ్డ ఇంటికి వెళ్తాడు. ఇంట్లో ఎవరూ లేరు అనుకుని కనీసం కొబ్బరికాయలైన కొట్టుకుని తిందామని ప్రయత్నిస్తున్న సమయంలో ఆ ఇంట్లో ఇద్దరు మాత్రమే ఉంటారని తెలుసుకుంటాడు. ఒకరు వంటవాడు (సిద్ధార్థ్ భరతన్) కాగా మరొకరు యజమాని కుడుమోన్ పొట్టి (మమ్ముట్టి). బయటకు వెళితే బానిసల మార్కెట్లో అమ్ముడు పోవాల్సి వస్తుంది కానీ ఇక్కడ తనను తక్కువ కులానికి చెందిన వాడని తక్కువ చేయకుండా, ఇంటికి వచ్చిన అతిథి అంటూ తేవన్‌ను తనతో పాటు సమానంగా ఇంటి యజమాని ట్రీట్ చేస్తూ వస్తాడు. అయితే తనను అలా ట్రీట్ చేయడానికి గల కారణం ఏమిటనే విషయం చాలా త్వరగానే దేవన్ కి అర్థమవుతుంది. ఆ ఇంటి నుంచి పారిపోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించవు. కుడుమోన్ పొట్టి నేపథ్యం ఏమిటి? అలాంటి అడవిలో పాడుబడ్డ భవంతిలో అతను ఏం చేస్తున్నాడు? అతని గురించి అన్ని నిజాలు కూడా తెలిసిన వంటవాడు ఆ ఇంటిలో ఇంకా ఎందుకు ఉన్నాడు? చివరకు ఆ ఇంటి నుంచి తేవన్ తప్పించుకున్నాడా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
ఈ మధ్య మలయాళ సినిమాలు బాగున్నాయని చెబుతూ తెలుగు సినిమాలను తక్కువ చేసే వాళ్ళు ఎక్కువయ్యారు. మలయాళ సినిమాలో ఉన్న కంటెంట్ ని తెలుగు మేకర్స్ ఎందుకు పట్టుకోలేకపోతున్నారని వారి బాధ. కానీ తెలుగు సినిమా ప్రేమికులైనా మలయాళ సినిమా ప్రేమికులైనా కంటెంట్ ఉంటే చాలు కచ్చితంగా ఆదరిస్తారు అని ఎన్నో సినిమాలు నిరూపించాయి. ఇప్పుడు మమ్ముట్టి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ భ్రమ యుగం అనే సినిమా కూడా అదే కోవలో సాగుతుంది. మూడు ప్రధాన పాత్రలు, రెండు అతిథి పాత్రలు. వాటితో రెండున్నర గంటలకు దగ్గరగా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం మామూలు విషయం కాదు. అయితే ఆ విషయంలో భ్రమ యుగం పాస్ అయిపోయింది. పూర్తిస్థాయి బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్లో 2:1 రేషియోలో తెరకెక్కించిన ఈ సినిమా నిజంగా ఒక సాహసమే. మార్కెట్ మీద లేక బడ్జెట్ మీదనే ఫోకస్ పెట్టి చేసే నిర్మాతలు ఇలాంటి సినిమా చేయలేరు. నిజానికి మలయాళంలో మెగాస్టార్ అనిపించుకునే మమ్ముట్టి ఇలాంటి పాత్రలు గతంలో కూడా కొన్ని చేశారు. కానీ ఇలా ఒకే కాస్ట్యూమ్ కి పరిమితమై ఒకే లొకేషన్ లో నటించి అందరి మన్ననలు అందుకోవడం చాలా కష్టమైన విషయం. కానీ దాన్ని చాలా ఈజీగా చేసేసారు మమ్ముట్టి. అసలు మనకు ఏమాత్రం సంబంధంలేని ఒక ప్రపంచంలోకి తీసుకు వెళ్లడానికి కాస్త ఎక్కువగానే సమయం తీసుకున్నాడు దర్శకుడు. ముందుగా పాత్రల పరిచయం మొదలై ఆ తర్వాత కథ నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ దాన్ని సరైన రీతిలో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో ఎందుకో దర్శకుడు తడబడినట్లు అనిపించింది. ఇంటర్వెల్ ముందు వరకు ఒక్క సర్ప్రైజ్ ఎలిమెంట్ కానీ షాక్ కానీ అనిపించదు. నెమ్మదిగా ఆ ప్రపంచంలోకి తీసుకువెళ్లి ఒక్కసారిగా అక్కడ ఉన్న పరిస్థితిని వివరించడంతో ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అవుతుంది. నిజానికి టెక్నికల్ విషయాలు పక్కన పెట్టి కథగా చూస్తే చాలా చిన్న విషయం. తాంత్రిక విద్యలు నేర్చుకుని ఒక పాడుబడ్డ భవంతిలో ఉండే ఒక తంత్రగాడు చేతి నుంచి అందులోకి వెళ్లిన ఒక యువకుడు ఎలా బయటపడ్డాడు అనేది కథ. అందులో రకరకాల లేయర్స్ లో కులవివక్ష, అధికారం కోసం మనిషి ఎలా మారిపోతాడు అనే విషయాలు ఆసక్తికరంగా ప్రేక్షకులకు వివరించే ప్రయత్నం చేశారు. నిజానికి దీన్ని హారర్ థ్రిల్లర్ అని ముందు నుంచి చెబుతూ వచ్చారు గాని ఎందుకో హారర్ ఎలిమెంట్స్ కంటే ఎక్కువగా థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనిపించింది. సినిమా సాగ తీసిన ఫీలింగ్ కలుగుతుంది కానీ టెక్నికల్ బ్రిలియన్స్ కోసం అయినా థియేటర్లో ఒక్కసారి చూడాల్సిన సినిమా ఇది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్, మేకప్ ఇలా ఒక్కటేమిటి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ది బెస్ట్ ఔట్పుట్ ఇచ్చినట్లు అనిపించింది.
నటీనటుల విషయానికి వస్తే:
ఈ సినిమాలో మమ్ముట్టి పొట్టి అనే పాత్రలో జీవించాడు. మలయాళ మెగాస్టార్ అనగానే కొన్ని అంచనాలు ఉంటాయి. ఆ ఆంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ ఈ సినిమాలో మమ్ముట్టి కనిపిస్తాడు. ఆయన ఎక్స్ప్రెషన్స్ అయితే అనితర సాధ్యం అనే అంతలా ఆయన పాత్రలో ఒదిగిపోయాడు. అర్జున్ అశోకన్ కూడా మమ్ముట్టికి ధీటుగా నటించే ప్రయత్నం చేసి కొంత వరకు సక్సెస్ అయ్యాడు. కొన్ని సీన్స్ లో అర్జున్ నటన అద్భుతం అనిపిస్తుంది. సిద్ధార్థ భరతన్ కు నటించే స్కోప్ తక్కువే కానీ ఉన్న సీన్స్ లో మాత్రం ఆకట్టుకున్నాడు. టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ భ్రమయుగం అనే సినిమా టెక్నికల్ బిలియన్స్ కి కేరాఫ్ అడ్రస్ అనిపిస్తుంది. బ్లాక్ అండ్ వైట్ విజువల్స్ ని సినిమాటోగ్రాఫర్ భలే ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చూపించారు. ఒకానొక సందర్భంలో మమ్ముట్టితో అర్జున్ తన ఊరి గురించి వివరిస్తూ అక్కడ మట్టి ఏ రంగులో ఉంటుంది? పూలు ఏ రంగులో ఉంటాయి అంటూ ఒక వివరణ ఇస్తాడు. ఆ సమయంలో బ్లాక్ అండ్ వైట్ సినిమా చూస్తున్న మనకు నిజంగా ఆ రంగుల్ని చూస్తే బాగుంటుంది అనేంతలా మాయ చేయడంలో యూనిట్ సఫలమైంది. సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అయింది. నిడివి విషయంలో జాగ్రత్తలు చెప్పలేం కానీ కొంతమంది తగ్గించుకునే అవకాశం ఉంది.
ఫైనల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే టెక్నికల్ బిలియన్స్ కోసమైనా ఒక్కసారి థియేటర్లలో చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇది.