NTV Telugu Site icon

Balagam Movie Review: బలగం రివ్యూ

Balagam

Balagam

రివ్యూ: బలగం
నటీనటులు: ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, వేణు, రచ్చ రవి తదితరులు
సంగీతం: భీమ్స్ సెసిరోలియో
సినిమాటోగ్రఫి: ఆచార్య వేణు
సమర్పణ: శిరీష్
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత
దర్శకత్వం: వేణు యెల్దండి

ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూతురు హన్షిత, ఆయన సోదరుని కుమారుడు హర్షిత్ రెడ్డి కలసి నిర్మించిన చిత్రం ‘బలగం’. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై శిరీష్ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కింది. హాస్యనటుడు వేణు యెల్దండి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అయ్యారు. పలు చిత్రాల ద్వారా నటునిగా మంచి గుర్తింపు సంపాదించిన ప్రియదర్శి ఇంతకు ముందు ‘మల్లేశం’ అనే బయోపిక్ లో హీరోగా నటించారు. దాని తరువాత ప్రియదర్శి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ఈ ‘బలగం’.

కథ ఏమిటంటే- కొమురయ్య అనే ముసలాయన ఊరిలో అందరితోనూ అన్యోన్యంగా ఉంటాడు. ఆయన మనవడు సాయిలు అప్పుచేసి ఊళ్లో పలు వ్యాపారాలు చేసి ఉంటాడు. ఏదీ అచ్చిరాదు. దాంతో కట్నంపైనే అతని ఆశలు. త్వరలో అతని పెళ్ళి అనగా అప్పుఇచ్చినవారు పెళ్ళికి ముందు రోజే అప్పులో పదిలక్షలు కట్టకపోతే, మా సంగతి తెలుసుకదా అని బెదిరిస్తారు. ‘వరపూజ’లో వచ్చే డబ్బుతో ఆ మొత్తం చెల్లించవచ్చని ఆశిస్తాడు సాయిలు. కానీ, ఆ ముందు రోజే కొమురయ్య కన్నుమూస్తాడు. ఆయన మరణంతో ఊరిలోని బంధుమిత్రాదులందరూ ఆయన శవంపై పడి ఆయనతో తమ అనుబంధాన్ని మననం చేసుకుంటారు. ఆయన కుటుంబంలోని ఇద్దరు కొడుకులు, వారి భార్యలు, ఎన్నో ఏళ్ళ నుంచీ ఇంటి ముఖం చూడని కూతురు, అల్లుడు, మనవరాలు అందరూ వస్తారు. ఆయన పిండాకూడును కాకి ముట్టదు. మూడో రోజు అలాగయితే, ఐదో రోజు అల్లుడు చేసిన దివసంలోనూ అదే తంతు. ఆ రెండు భోజనాలలో మితిమీరి తిన్న ఒక పెద్దాయన, అందరితో పాటు కొమురయ్య దివసంలో నుంచోని కాళ్ళు పట్టేసిన ఓ ఆవిడ, కొమురయ్య చావాలని తిట్టుకున్న ఓ దర్జీ కారణంగా వారిమీద ఆ ముసలాయన పట్టినాడని ఊరి జనం భావిస్తారు. అలా అనిపించడానికీ సాయిలు పథకరచన చేసి ఉంటాడు. పదకొండో రోజు పిండాకూడు పిట్ట ముట్టకుంటే ఊరి నుంచి వారిని వెలివేస్తామని పెద్దలు చెబుతారు. ముసలోడు చచ్చి తనకు ఇన్ని ఇబ్బందులు కలిగించాడని సాయిలు భావిస్తూ ఉంటాడు. అతని పెళ్ళి సంబంధం కూడా చెడిపోతుంది. దాంతో మేనత్త కూతురును లైన్ లో పెడితే, వారికి ఉన్న కోట్ల ఆస్తి ద్వారా తన అప్పు తీరుతుందని భావిస్తాడు. ఓ నాటి ముచ్చట గుర్తు చేసి, అతనికి, మరదలుకు మనువు ఖాయం చేసుకుంటాడు. తన స్వార్థం కోసం తాత చావును ఉపయోగించుకున్నానని పశ్చాత్తాపం చెందుతాడు. ఆ తరువాత ఏమయింది అన్నదే మిగిలిన కథ.

సెల్ ఫోన్స్ వాడుతున్న ఈ కాలంలోనూ తెలంగాణ మారుమూల పల్లెల్లోని మూఢనమ్మకాలను కళ్ళకు కట్టినట్టు చూపించడంలో దర్శకుడు వేణు సఫలీకృతులయ్యారు. సినిమాలో పతాకసన్నివేశం అందరినీ ఆకట్టుకుంటుంది. సెన్సిటివ్ గా ఉండేవారికి తప్పకుండా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అసలు ఈ కథను సినిమాగా తీయడానికి పూనుకున్న నిర్మాతలు హన్సిత, హర్షిత్ ను అభినందించాలి. ఎన్నో కమర్షియల్ సక్సెస్ లు చూసిన దిల్ రాజు తమ పిల్లలు, ఫార్ములాకు దూరంగా జరిగి, ఈ సినిమాను నిర్మించడం, వారికి దన్నుగా నిలచిన ఆయననూ అభినందించకుండా ఉండలేం. చిత్రం చూస్తోంటే, 2015లో కన్నడలో రూపొంది, పలు అవార్డులు సంపాదించిన ‘తిథి’ చిత్రం పలు మార్లు గుర్తుకు వస్తుంది. కాసర్ల శ్యామ్ సందర్భోచితంగా పాటలు పలికించారు. ఇందులోని నటీనటుల్లో చాలామంది అంతగా పరిచయం లేనివారే, అయితే దాదాపుగా అందరూ తమపాత్రల్లో జీవించారనే చెప్పాలి. కమర్షియల్ గా ఈ సినిమా ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.

ప్లస్ పాయింట్స్:
– దిల్ రాజు ప్రొడక్షన్ కావడం
– నిర్మాతలు ఈ కథను ఎంచుకోవడం
– పతాక సన్నివేశాలు
– బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్:
– కథలో కొత్తదనం లేకపోవడం
– సీన్స్ సాగదీసినట్టుగా ఉండడం

రేటింగ్: 2.75/5

ట్యాగ్ లైన్: ‘బల’మైన సెంటిమెంట్ ‘గమ్’!

Show comments