బాహుబలి 1, బాహుబలి 2 పేరుతో రాజమౌళి రిలీజ్ చేసిన సిరీస్ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో మొదటి భాగం రిలీజ్ అయి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో, సినిమాని రీ-రిలీజ్ చేయాలని అనుకున్నారు. సాధారణంగా రీ-రిలీజ్ చేస్తే ఏముంటుంది కిక్ అనుకున్నారో ఏమో తెలియదు కానీ, అప్పట్లో వాడని కొన్ని సీన్స్‌ను యాడ్ చేసి, సిరీస్‌లోని రెండు భాగాలను ఒకే భాగంగా మార్చి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ చేసేందుకు సిద్ధం చేశారు రాజమౌళి. సాధారణంగానే రీ-రిలీజ్ సినిమాలు అంటే ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. అందులోనూ సూపర్ హిట్ అయిన రెండు సినిమాలను ఒకే సినిమాగా మార్చి రిలీజ్ చేయడంతో, సినిమా ఎలా ఉంటుందో అని అందరూ ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆ రీ-రిలీజ్‌లో మరో ట్రెండ్ సృష్టిస్తూ ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ: ఈ కథ గురించి ప్రత్యేకంగా మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ స్థూలంగా చెప్పుకోవాలంటే, మహేంద్ర బాహుబలి (ప్రభాస్) నానమ్మ శివగామి (రమ్యకృష్ణ) ప్రాణ త్యాగం కారణంగా గూడెం పెద్ద కొడుకుగా పెరిగి, అవంతిక (తమన్నా) మాస్క్ కారణంగా నీటికొండ ఎక్కి, మాహిష్మతి సామ్రాజ్యానికి చేరుకుంటాడు. అవంతికతో ప్రేమలో పడి, ఆమె లక్ష్యాన్ని తన లక్ష్యంగా చేసుకుని, వారు పోరాడేది తన తల్లి దేవసేన (అనుష్క) కోసమేనని అర్థం చేసుకుంటాడు. ఈ క్రమంలో అసలు తన తండ్రి అమరేంద్ర బాహుబలికి ఏమైంది? తన పెదనాన్న భల్లాలదేవుడు (రానా) తో ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది? అసలు కట్టప్ప(సత్యరాజ్) తన తండ్రి బాహుబలిని ఎందుకు చంపాడు? అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నమే ఈ బాహుబలి.
విశ్లేషణ:
నిజానికి ఈ మధ్యకాలంలో సినిమాలను రీ-రిలీజ్ చేయడం చాలా కామన్ అయిపోయింది. అయితే అందుకు భిన్నంగా ప్రయత్నించాడు రాజమౌళి. సినిమాకి బాహుబలిని మరోసారి చూద్దామని ఉద్దేశంతోనే వెళ్లిన ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే విషయంలో రాజమౌళి ఫుల్‌గా సంతృప్తి పర్చాడు. నిజానికి నిడివి ఒక్క విషయంలోనే కంప్లైంట్. మిగతాదంతా ప్రేక్షకులు పెట్టిన టికెట్ డబ్బులకు ఫుల్ పైసా వసూల్.
నిజానికి ‘రీ-రిలీజ్ అయిన సినిమాలను మళ్లీ థియేటర్లలోకి వెళ్లి ఏం చూస్తారు అబ్బా’ అనే ఫీలింగ్ మొత్తాన్ని చెరిపేసేలా ఈ బాహుబలి: ఎపిక్ సినిమాను కట్ చేశాడు రాజమౌళి. రెండు సినిమాలను కలిపి ఒక సినిమాగా తీసుకువచ్చి అందులో సక్సెస్ అయ్యాడు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా రిలీజ్ అయిన బాహుబలి 1 సినిమాని చూపించే ప్రయత్నం చేశారు. సెకండ్ హాఫ్‌లో రెండో భాగాన్ని చూపించే ప్రయత్నం చేశారు.
నిజానికి సీన్స్ కట్ చేసి, అప్పట్లో వాడని కొన్ని సీన్స్‌ను కలిపి ఎలా చూపిస్తారా అని ఎదురుచూసిన వాళ్లందరికీ మంచి సర్ప్రైజ్ ఇచ్చేలా సరికొత్త రీ-రికార్డింగ్, కొన్ని సరికొత్త విజువల్స్‌తో ఆకట్టుకున్నాడు రాజమౌళి. ఈ సినిమా కథ ఇప్పటికే అందరికీ తెలుసు. యూట్యూబ్, ఓటీటీ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో సినిమా అందుబాటులో ఉంది. అయినా సరే, థియేటర్‌లో కచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనిపించేలా ఈ సినిమాని తీర్చిదిద్దడంలో రాజమౌళి నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యాడు.
ఈ సినిమా మొత్తం మీద ఒకటే కంప్లైంట్, అదే నిడివి. ఆ విషయంలో ఏమీ చేయలేరు, ఎందుకంటే ఇప్పటికే చాలా కట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇంకా కట్ చేస్తే అసలు కథ అర్థం కాకుండా పోయే ప్రమాదం ఉంది. అయినా సరే, నిడివి కంప్లైంట్ పక్కనపెడితే మిగతా సినిమా అంతా ఆకట్టుకునేలా సాగింది అని చెప్పొచ్చు. ఎప్పుడో చూసిన బాహుబలి మళ్లీ చూస్తున్నాం అనే ఫీలింగ్ కాకుండా, ఏదో సరికొత్త సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ కలిగించడంలో రాజమౌళి అండ్ టీమ్ సక్సెస్ అయ్యింది.
నటీనటులు: ఇప్పటికే హీరోగా ప్రభాస్, విలన్‌గా రానా పెర్ఫార్మెన్స్ గురించి మనందరికీ తెలుసు. అప్పట్లో వాడని కొన్ని సీన్స్‌ను వాడి వారి పెర్ఫార్మెన్స్‌ను నెక్స్ట్ లెవెల్ అని చూపించే ప్రయత్నం చేసిన రాజమౌళి దాదాపుగా సక్సెస్ అయినట్లే. అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, రోహిణి, సుబ్బరాజు, సత్యరాజు వంటి వాళ్లు ఆకట్టుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే, ఎప్పుడో చూసిన వారి నటనను మళ్లీ గుర్తుచేస్తూ రంజింపజేశారు అని చెప్పొచ్చు.
టెక్నికల్ టీమ్: ఈ రీ-రిలీజ్ సినిమా విషయంలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది వీఎఫ్ఎక్స్ గురించే. ఎందుకంటే గతంలో లేని కొన్ని ఎఫెక్ట్స్‌ను తెరమీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన ఈ టీమ్ చాలా వరకు సక్సెస్ అయిందని చెప్పాలి. అలాగే కీరవాణి కూడా అప్పటి సంగీతాన్ని మరోసారి ప్రేక్షకుల మీదకు వదలకుండా, కొన్నిచోట్ల రీ-రికార్డింగ్ సైతం మార్చి సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఫైనల్లీ: బాహుబలి: ది ఎపిక్ – మస్ట్ వాచ్. ముఖ్యంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇది.