కళ్యాణ్ రామ్ హీరోగా, విజయశాంతి కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం వైజయంతి. ఈ సినిమాను గతంలో ఒక సినిమా డైరెక్ట్ చేసిన ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేయగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో పాటు సునీల్ బలుసు, అశోక్ వర్ధన్ ముప్ప సంయుక్తంగా నిర్మించారు. సాయి మంజరేకర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ప్రమోషన్స్‌తో ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు, విజయశాంతి, కళ్యాణ్ రామ్ ఎమోషనల్ బాండింగ్ ఆన్-స్క్రీన్‌తో పాటు ఆఫ్-స్క్రీన్ కూడా హైలైట్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి కథ:
అర్జున్ (కళ్యాణ్ రామ్) విశాఖపట్నంలో ఒక గ్యాంగ్‌స్టర్. మాజీ ఐపీఎస్ అధికారిణి వైజయంతి (విజయశాంతి) కుమారుడైన అర్జున్, విశాఖపట్నంలో అందరినీ శాసించే గ్యాంగ్‌స్టర్‌గా చక్రం తిప్పుతూ ఉంటాడు. తల్లిపై ఎంతో ప్రేమ ఉన్న అర్జున్, ఆమెను కలిసేందుకు తహతహలాడుతూ ఉంటాడు. కానీ, ఆమె అతనిపై ఒక రకమైన అసహ్యంతో దూరంగా ఉంటుంది. అయితే, అసలు ఐపీఎస్ అవ్వాల్సిన అర్జున్ ఎందుకు గ్యాంగ్‌స్టర్‌గా మారాడు? ఎందుకు ఒకరు లేక ఒకరు ఉండలేని అర్జున్, వైజయంతి దూరమయ్యారు? అసలు అర్జున్ చివరికి తన తల్లిని కలిశాడా? చివరికి ఏమైంది? అనే విషయాలు తెలియాలంటే, సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.
విశ్లేషణ:
ముందు నుంచి ప్రచారం జరుగుతున్న విధంగానే, ఇది ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్. కళ్యాణ్ రామ్ మాస్ ఇమేజ్‌ను పెంచే ప్రయత్నంగా దీన్ని చెప్పుకోవచ్చు. నిజానికి, ఇలాంటి కథలు మనం గతంలో చూశాం. నిజాయితీగల పోలీస్ అధికారి లేదా ప్రభుత్వ అధికారుల కుమారులు గ్యాంగ్‌స్టర్స్‌గా మారి, వారికి ఎదురు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముందు నుంచి చివరి వరకు వారిని ద్వేషించే తల్లిదండ్రులు, చివరిలో తమ కొడుకు గొప్పతనం తెలుసుకుని సపోర్ట్ చేస్తారు. ఇలాంటి లైన్‌తో గతంలో చాలా సినిమాలు చూశాం. అదే లైన్‌లో ఈ సినిమాను కూడా మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే, కళ్యాణ్ రామ్ మాస్ ఇమేజ్‌ను మరింత పటిష్ఠం చేసేలా ఈ సినిమా కథను రాసుకున్నారు దర్శకుడు. వైజయంతి లాంటి ఒక పవర్‌ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ కుమారుడు, జనం కోసం డాన్‌గా మారాల్సిన పరిస్థితిలో తన సొంత తల్లికి ఎదురు వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్లిన క్రమంలో ఎలాంటి పరిస్థితులకు లోనయ్యాడు? అనే అంశాన్ని ఆసక్తికరంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్‌లో క్యారెక్టర్‌లను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ అంత ఎంగేజింగ్‌గానే ఉంటుంది. వైజయంతి కోణంలో తన కుమారుడి గురించి, ఎదురైన పరిస్థితుల గురించి ఒక్కొక్క విషయాన్ని చెబుతూ వెళతారు. అయితే, సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత, కథను అక్కడక్కడే తిప్పుతూ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే, క్లైమాక్స్ మాత్రం ఎవరూ ఊహించని ఒక షాక్ ఫ్యాక్టర్‌తో రాసుకున్నాడు దర్శకుడు. ముందు నుంచి ఈ క్లైమాక్స్ గురించి జూనియర్ ఎన్టీఆర్ సహా సినిమా చూసిన వారంతా చెబుతూ వచ్చారు. ఈ సినిమాలో అదే క్లైమాక్స్ బాగా వర్కౌట్ అయింది. ఎమోషనల్‌గా తల్లి-కొడుకుల మధ్య బంధాన్ని మరింత చాటేలా ఈ క్లైమాక్స్ రాసుకున్న తీరు ఆసక్తికరంగా ఉంది. అలా అని సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనరా అంటే, అవునని అనలేము. ఎందుకంటే, ఫస్ట్ హాఫ్ అంత ఎంగేజింగ్‌గా ఉన్నా, సెకండ్ హాఫ్ అంతగా అనిపించదు. కానీ, చివరి 20 నిమిషాలు మాత్రం ఆసక్తికరంగా మలిచారు. నిజానికి, చాలా లాజిక్స్ కూడా మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ టెంప్లేట్‌లో కథను నడిపించడం సినిమాకు కొంత ప్లస్, మరికొంత మైనస్ కూడా అయ్యే అవకాశాలు లేకపోలేదు. కాకపోతే, షాక్ ఫ్యాక్టర్‌ను దృష్టిలో పెట్టుకుని కథ రాస్తున్నారేమో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది.
నటన విషయానికి వస్తే:
ఈ సినిమాలో హీరోగా కళ్యాణ్ రామ్ నట విశ్వరూపాన్ని చూపించాడు. ముఖ్యంగా, యాక్షన్ సీక్వెన్స్‌లో అయితే కళ్లు చెదిరేలా పర్ఫార్మ్ చేశాడు. ఇక డైలాగ్ డెలివరీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిందే. అతని తర్వాత అంతటి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించింది విజయశాంతి. ఆమె కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కొన్ని ఫైట్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి. ఇక పృథ్వీ, బబ్లు, శ్రీకాంత్ వంటి వారు తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. శ్రీకాంత్ మళ్లీ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నాడు.
టెక్నికల్ టీం విషయానికి వస్తే:
సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు పెద్దగా గుర్తుంచుకునేలా లేకపోయినా, అజనీష్ లోక్‌నాథ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా చోట్ల వర్కౌట్ అయింది. ముఖ్యంగా, ఫైట్ సీక్వెన్స్‌లు వచ్చినప్పుడల్లా అజనీష్ మంచిగానే డ్యూటీ చేశాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సెకండ్ హాఫ్ ఎడిటింగ్ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.
ఫైనల్‌గా: అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఒక రొటీన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ విత్ షాకింగ్ క్లైమాక్స్.