Anweshippin Kandethum Movie Review: ఒక రకంగా ఇప్పుడు ఇండియన్ మూవీ లవర్స్ అందరూ మలయాళ సినిమా మీద ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టే అక్కడి మేకర్స్ కూడా ఎప్పటికప్పుడు ఆసక్తిరమైన కంటెంట్ ఇవ్వడానికి తమ వంతు ప్రయత్నం తాము చేస్తున్నారు. ఇక అలా కొత్త దర్శకుడు డార్విన్ కురియకోస్ దర్శకత్వంలో అన్వేషిప్పిన్ కండేతుమ్ అనే ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మిన్నల్ మురళితో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన టోవినో థామస్ హీరోగా నటించిన ఈ సినిమా మలయాళంలో మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ:
1990 కేరళలోని కొట్టాయం జిల్లాలో ఆనంద్ నారాయణ్ (టోవినో థామస్) సబ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తుంటాడు. అయితే అతడు పని చేసే స్టేషన్ పరిధిలో లవ్లీ అనే ఒక యువతి మిస్సింగ్ కేసు నమోదవగా ఆనంద్, అతడి టీం నేరస్తుడిని ఋజువులతో సహా పట్టుకుంటుంది. ఒక చిన్నపొరపాటు వలన అంత కష్టపడ్డాక కూడా టీం అంతా సస్పెండ్ అవుతారు. సస్పెన్షన్ లో ఉన్న టీంను పిలిచిన ఎస్పీ ఈ టీమ్‌కు ఆరేళ్ళ క్రితం జరిగిన శ్రీదేవి మర్డర్ కేసును అప్పగిస్తారు. దీంతో ఊరంతా పోలీసులకు అసలు సహకరించకూడదు అని ఫిక్స్ అయిన క్రమంలో ఆనంద్ టీమ్ ఈ కేసును పరిష్కరించిందా? పరిష్కరించే సమయంలో వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనేదే అన్వేషిప్పన్ కండతుమ్ కథ. అది మొత్తం మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ: పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అంటే ప్రతి సినీ ప్రేక్షకుడూ ఆనందిస్తూ చూసే జానర్. మలయాళంలో ఇప్పటికే చాలా సినిమాలు ఈ జానర్ లో విడుదలయ్యాయి. కానీ టొవినో థామస్ అన్వేషిప్పిన్ కండేతుమ్ సినిమా ‘అవ్నాశిపిల్’ వాటికి భిన్నంగా సాగే క్రైమ్ థ్రిల్లర్. చివరి వరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూ సినిమా సాగడం సినిమాకి పెద్ద విజయం అని చెప్పొచ్చు. ఇందులో ఒకే సినిమాలో రెండు కేసులు ఉన్నాయి, ఒకే టికెట్ మీద రెండు సినిమాలు చూస్తున్నట్టు రెండు హత్యలను ట్రేస్ చేయడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. అన్వేషిప్పిన్ కండేతుమ్ లో ఎలాంటి సంబంధం లేని రెండు నేరాలను పోలీసులు ఎలా ఛేదించారు? అనేది గ్రిప్పింగ్ అనిపిస్తుంది. విచారణ 1990ల ప్రారంభంలో జరిగినందున, నేరాలను పరిష్కరించడంలో సహాయాలు ఫోరెన్సిక్స్ అలాగే కొన్ని కస్టోడియల్ ఇంటరాగేషన్ తప్ప వేరే ఆధారాలు ఉండవు. అంతేకాదు ఈ సినిమా పోలీసు డిపార్ట్మెంట్లోని రాజకీయాలు అలాగే ఇతర సంబంధిత సమస్యలతో పాటు చట్ట అమలు – సాధారణ ప్రజలలో పోలీసుల మీద ఉన్న భావన వంటి విషయాలను తేటతెల్లం చేస్తుంది. ఇక ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ విజయవంతం కావాలంటే, బలమైన స్క్రిప్ట్ చాలా ముఖ్యమైనది, ఈ సినిమా విషయంలో జిను అబ్రహం అందించాడు. అంతేకాకుండా, ఈ చిత్రం మాస్ అప్పీల్ లేదా అనవసరమైన బిల్డప్స్ మీద ఆధారపడటం మానేసి, దాని దృష్టిని పూర్తిగా దర్యాప్తుపైనే పెట్టడం ఒక ప్లస్ పాయింట్. సాధారణంగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లలో కనిపించే హీరో వ్యక్తిగత జీవితంలోని విషాదం ఈ సినిమాలో ఉద్దేశపూర్వకంగా తప్పించారు. అదే సమయంలో, చిత్రం సినిమా టైటిల్ సూచించినట్లుగా, అన్వేషిపిన్ అనేది దర్యాప్తు గురించి మాత్రమే కాదు, దర్యాప్తు అధికారుల గురించి కూడా అని అనిపిస్తుంది. కళ్ళు చెదిరే జిమ్మిక్కులు, చెవిని చీల్చే సంగీతం లేదా షాకింగ్ ట్విస్ట్‌లు లేకుండా డార్విన్ చెప్పిన పాయింట్ అందరికీ నచ్చుతుంది. క్రైమ్ మరియు క్రిమినల్‌పై మాత్రమే దృష్టి సారించే థ్రిల్లర్ల యుగంలో ఇది మంచి ప్రయత్నం.
నటీనటుల విషయానికి వస్తే నిజాన్ని వెలికి తీసేందుకు అంకితభావంతో ఉన్న యువ పోలీసు అధికారి ఆనంద్ నారాయణన్‌గా టోవినో అద్భుతమైన నటనను కనబరిచాడు. రెండు కథలలో, బాధితులతో మనం మానసికంగా కనెక్ట్ కాకపోవచ్చు కానీ ఒక బయటి వ్యక్తి కోణం నుండి పరిశోధనలు జరగడం ఆసక్తికరం. ఇక ఈ సినిమాలో వినీత్ తట్టిల్ డేవిడ్, ఇంద్రన్స్, సిద్ధిక్, హరిశ్రీ అశోక్, షమ్మి తిలకన్ అలాగే అనేక ఇతర నటీనటులు ముఖ్యమైన పాత్రలలో నటించారు. వీరంతా ప్రశంసనీయమైన నటనను ప్రదర్శించారు.ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ కి మొదటి మలయాళ చిత్రం అన్వేషిపిన్. సంతోష్ నారాయణన్ తన మేధాశక్తిని చూపించడానికి ప్రయత్నించకుండా, సినిమా ఏది డిమాండ్ చేస్తే అది ఇచ్చారు. సంతోష్ సంగీతం రెగ్యులర్ ప్యాటర్న్లకు భిన్నంగా రిఫ్రెష్‌గా ఉంది. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమా ఆత్మను అర్థం చేసుకుని గిరీష్ తన పని పూర్తి చేశాడు. 1980-90 నాటి కాలాన్ని పునర్నిర్మించేందుకు సినిమా ఆర్ట్ టీం, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ తీసుకున్న కృషి అభినందనీయం.
ఫైనల్‌గా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ల సినిమాలు ఇష్టపడే వారు తప్పక చూడవలసిన సినిమా ఇది. ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటుంది.