Ant-Man and the Wasp: Quantumania Movie Review: ప్రపంచ వ్యాప్తంగా ఆబాలగోపాలాన్నీ అలరించేలా ‘మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్’ (MCU) అభూతకల్పనలతో చిత్రాలను రూపొందిస్తోంది. ‘మార్వెల్ స్టూడియోస్’ నుండి వచ్చిన ‘యాంట్ మేన్’ సిరీస్ లో మూడో భాగంగా ‘యాంట్ మేన్ అండ్ ద వాస్ప్: క్వాంటమేనియా’ ఫిబ్రవరి 17న జనం ముందు నిలచింది. 2015లో వచ్చిన ‘యాంట్ మేన్’ కంటే తరువాత 2018లో రూపొందిన ‘యాంట్ మేన్ అండ్ ద వాస్ప్’ ప్రేక్షకులను భలేగా మెప్పించింది. ఈ నేపథ్యంలో దాదాపు ఐదేళ్ళ తరువాత ఇప్పుడు ‘యాంట్ మేన్ అండ్ ద వాస్ప్: క్వాంటమేనియా’ ఆసక్తి రేకిస్తూనే వచ్చింది.
కథ విషయానికి వస్తే – స్కాట్ లాంగ్ ఓ రచయిత, తన గర్ల్ ఫ్రెండ్ హోప్ వేన్ డైన్, కూతురు కేసీతో కలసి ఆనందంగా జీవిస్తూంటాడు. కేసీ ఓ యాక్టివిస్ట్ గా సాగుతూ ఉండడంతో అరెస్ట్ అవుతుంది. స్కాట్ బెయిల్ పై కూతుర్ని విడిపించుకు వస్తాడు. తరువాత హోప్ కన్నవారు హ్యాంక్ పిమ్, జానెట్ వేన్ డైన్ కు తాను ఓ డివైస్ ద్వారా ‘క్వాంటమ్ రీమ్’తో కాంటాక్ట్ లో ఉన్నానని చెబుతుంది. అది విని జానెట్ భయపడిపోయి, డివైజ్ ను మూసేస్తుంది. కానీ అప్పటికే ఆలస్యమవుతుంది. కేసీ సందేశం అందిన వెంటనే ఆ ఐదుగురు క్వాంటమ్ రిలెమ్ లోకి వెళతారు. అక్కడ కాంగ్ అనే రాజు పాలన సాగుతూ ఉంటుంది. అక్కడి జనం అతనిపై తిరుగుబాటు చేస్తూంటారు. స్కాట్ లాంగ్ అతనే యాంట్ మేన్. అతను కూతురు కేసీతో కలసి అక్కడ కొందరి ప్రాణాలు కాపాడతాడు. ఇది తెలిసిన కాంగ్ వారిని బంధిస్తాడు. ఆ తరువాత ఏమయింది అన్నదే మిగిలిన కథ. అసలు జానెట్ ‘క్వాంటమ్ రీమ్’ పేరు విని ఎందుకు భయపడింది? ఆమె దానిని ఎందుకు మూసి వేయాలనుకుంది? లాంగ్, అతని కూతురు ఎలా బయటపడ్డారు? అన్న అంశాలతో కథ సాగుతుంది.
ఈ కథకు లాంగ్, కేసీ తండ్రీకూతుళ్ళ బంధం ప్రధానం. స్కాట్ లాంగ్ – యాంట్ మేన్ పాత్రలో పాల్ రడ్, కేసీగా కేథరిన్ న్యూటన్, హోప్ గా ఎవంజిలీన్ లిల్లీ, ఆమె తండ్రిగా మైఖేల్ డగ్లాస్ నటించారు. అయితే జానెట్ వేన్ డేన్ గా నటించిన మిచెల్లీ పిఫర్ అభినయం, అందుకు దీటుగా కాంగ్ ద కాంకరర్ పాత్రలో జోనాథన్ మేజర్స్ నటన ఆకట్టుకుంటాయి. మొత్తానికి లాంగ్, అతని కూతురు చేసే సందడి వినోదం పండిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
– యాంట్ మేన్ సిరీస్ కావడం
– తండ్రీకూతుళ్ళ సెంటిమెంట్
– మిచెల్లీ పిఫర్, జోనాథన్ మేజర్స్ నటన
మైనస్ పాయింట్స్:
– స్లోగా సాగే ప్రథమార్ధం
– రొటీన్ కథనం
– కొన్ని సీన్స్ పాతగా అనిపించడం
రేటింగ్: 2.75/5
ట్యాగ్ లైన్: పట్టుకునే యాంట్ మేన్!