రామ్ హీరోగా సరైన హిట్ అందుకుని చాలా కాలమే అయింది. ఈ నేపథ్యంలోనే ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేసి, చివరిగా మహేష్ బాబు దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పుకున్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ‘బయోపిక్ ఆఫ్ ఫ్యాన్’ అంటూ ప్రమోట్ చేసిన ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా నటించారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ప్రమోషన్స్ ఒక రేంజ్‌లో చేశారు మేకర్స్. సినిమా ప్రమోషన్స్‌తో సినిమా మీద అంచనాలు పెరుగుతూ వెళ్లాయి. అంచనాలను మరింత పెంచేలా ప్రమోషనల్ కంటెంట్ కూడా ఉంది. మరి ఎట్టకేలకు ఈ సినిమా ఒక రోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
ఆంధ్ర కింగ్ తాలూకా కథ
‘ఆంధ్ర కింగ్’ అనే బిరుదు ఉన్న సూపర్ స్టార్ సూర్య (ఉపేంద్ర) 100వ సినిమా ఫైనాన్షియల్ కారణాలతో ఆగిపోతుంది. ఎలా అయినా ఆ సినిమా మొదలు పెట్టాలని సూర్య చేస్తున్న ప్రయత్నాలు ఏమీ ఫలించవు. అయితే, ఒక అభిమాని సాగర్ (రామ్ పోతినేని) తన అకౌంట్‌లో మూడు కోట్లు వేశాడనే విషయం తెలుసుకుని, అతను ఎవరో తెలుసుకునేందుకు బయలుదేరి వెళ్తాడు సూర్య. ఈ నేపథ్యంలోనే అసలు సాగర్ ఎవరు? తనకు మూడు కోట్లు వేసేంత డబ్బు అతని దగ్గర ఉందా? సాగర్‌కు, అతని ప్రేయసి మహాలక్ష్మి (భాగ్యశ్రీ) ప్రేమకు ఉన్న అడ్డంకులు ఏమిటి? చివరికి తన అభిమానిని సూర్య కలుసుకున్నాడా లేదా? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ
ఇది ఒక ఫ్యాన్ బయోపిక్ అని సినిమా ప్రారంభించినప్పటి నుంచే సినిమా టీమ్ ప్రమోట్ చేస్తూ వచ్చింది. సినిమా మొదలయ్యాక కూడా దానికి ఏమాత్రం తగ్గకుండా, అసలు సరైన కేర్ ఆఫ్ అడ్రస్ కూడా లేని ఓ అభిమాని తన హీరోని ఇన్స్పిరేషన్‌గా తీసుకుని, ఆ హీరోకే ఆర్థిక సాయం చేసే అంతలా ఎలా ఎదిగాడు అనే ఆసక్తికరమైన లైన్‌లో ఈ సినిమా రాసుకున్నారు. నిజానికి ఈ సినిమా చూస్తున్నప్పుడు ఇది రియాలిటీకి ఏమాత్రం దగ్గరగా అనిపించదు. కానీ, ఒక సినిమాటిక్ లిబర్టీ తీసుకుని, సినిమాటిక్ అప్రోచ్‌తో రాసుకున్న కథ మాత్రం ఆకట్టుకునేలా ఉంది.
నిజానికి, గోదావరి జిల్లాల వాళ్లు సినిమాలకు, సినిమా నటీనటులకు అతిపెద్ద అభిమానులు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే గోదావరి జిల్లాల నేపథ్యాన్ని ఎంచుకుని, ఒక సరికొత్త ఆసక్తికరమైన కథనంతో సినిమా నడిపించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి, ఈ సినిమా లైన్ విన్న తర్వాత రామ్ సినిమా ఒప్పుకోవడమే అతిపెద్ద సాహసం. ఎందుకంటే, వినడానికి చాలా అద్భుతంగా ఉన్న లైన్ తెరమీదకు ఎక్కించేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితుల్లో ఈ సినిమా కథ ఉంటుంది. కానీ, దర్శకుడు కొంత తడబడినప్పటికీ, సినిమాని ఒక మంచి సినిమాటిక్ ఫీల్ తీసుకొచ్చేలా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.
నిజానికి, ఈ సినిమా చూస్తున్నప్పుడు రవితేజ ‘భగీరథ’ ఛాయలు కనిపిస్తాయి. కానీ, కాస్త పోలికలు ఉన్నా మిగతాదంతా దర్శకుడి సృష్టి అని చెప్పొచ్చు. సినిమా చూస్తున్నంత సేపు సినిమాలో లీనం అయ్యేలా దర్శకుడు చేసిన ప్రయత్నం అభినందనీయం. వాస్తవానికి, ప్రతి ప్రేక్షకుడు ఏదో ఒక హీరోకి అభిమానే. ఆ అభిమానిగా సినిమాకి కనెక్ట్ అయితే మాత్రం సినిమా బాగా నచ్చేస్తుంది. లేదంటే ఓ మంచి ప్రయత్నంగా అనిపిస్తుంది. సినిమాకి నిడివి విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ బాగా లాగ్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్ అంతా హీరో పరిచయం, హీరో పాత తీరుతెన్నులు వివరిస్తూ, హీరోయిన్‌తో ప్రేమ వంటివి ఆసక్తికరంగా చూపించారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ బావుంది. తర్వాత సెకండ్ హాఫ్ ప్రేక్షకులందరినీ ఆకట్టుకునేలా రాసుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. సెకండ్ హాఫ్‌లో ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా ఉంది అనడంలో సందేహం లేదు. సినిమా మొత్తానికి ప్రధానమైన ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది సెకండ్ హాఫ్, ముఖ్యంగా క్లైమాక్స్. అయితే, ఎమోషన్స్ పూర్తిస్థాయిలో వర్కౌట్ కాలేదని ఫీలింగ్ కొందరికి కలుగుతుంది. అవి కూడా వారికి వర్కౌట్ అయి ఉంటే సినిమా లెక్క వేరేలా ఉండేది.
నటీనటులు & సాంకేతిక వర్గం
నటీనటుల విషయానికి వస్తే, సినిమా మొత్తాన్ని రామ్ తన భుజాల మీద మోశాడు. అక్కడక్కడ ఉపేంద్ర కనిపించినా, రామ్ వన్ మ్యాన్ షో లా సినిమా అనిపిస్తుంది. భాగ్యశ్రీ బోర్సేకి మరోసారి నటించేందుకు అవకాశం ఉన్న పాత్ర దక్కింది. కాకపోతే, ఆమె పాత్ర చాలా పరిమితం అనిపిస్తుంది. మురళీ శర్మ ఎప్పటిలాగే రెచ్చిపోయి నటించాడు. రావు రమేష్ తన పాత్రకు తగ్గట్టుగా ఆకట్టుకున్నాడు. తులసి, రాహుల్ రామకృష్ణ, కమెడియన్ సత్య వంటివాళ్లు ఇతర పాత్రలలో ఆకట్టుకున్నారు.
సినిమా టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, కథ రాసుకున్న మహేష్ బాబు దాన్ని అంతే ఆసక్తికరంగా కథనంతో నడిపించే ప్రయత్నం చేసి, చాలా వరకు సక్సెస్ అయ్యాడు. డైలాగ్స్ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ముఖ్యంగా హీరోకి, అతని అభిమానికి మధ్య జరిగిన సంభాషణ అయితే దాదాపుగా అందరు హీరోల అభిమానులు కనెక్ట్ అయ్యేలా ఉంది. ఇక సినిమా నిడివి విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ సినిమాకి సరికొత్త ఫీల్ తీసుకువచ్చింది. అలాగే, సంగీత ద్వయం అందించిన పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా కొత్తగా ఉంది, సినిమాకి బాగా ప్లస్ అయింది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పనితీరు చాలా ఫ్రేమ్స్‌లో కనిపించింది.
ఫైనల్‌గా: ఈ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఓ ఫ్యాన్ బయోపిక్. అందరు హీరోల ఫ్యాన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుంది.