Ambajipeta Marriage Band Movie Review:
నటీనటులు: సుహస్, శరణ్య ప్రదీఫ్, శివానీ నాగారం, నితిన్ ప్రసన్న, జగదీష్ తదితరులు
కథ, దర్శకత్వం: దుశ్యంత్ కటికనేని
నిర్మాత: ధీరజ్ మొగిలినేని, వెంకట్ రెడ్డి
మ్యూజిక్: శేఖర్ చంద్ర
డిజిటల్ స్పేస్ నుంచి వెండితెరకు వచ్చి హీరోగా సెటిల్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు సుహాస్. అచ్చ తెలుగబ్బాయిగా ఇప్పటికే కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ అనే సినిమాలలో హీరోగా నటించగా హిట్ సెకండ్ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఇప్పటికే తెలుగులో అనేక సినిమాల్లో కమెడియన్ గా కనిపించిన ఆయన మొట్టమొదటిసారిగా అవుట్ అండ్ అవుట్ రా అండ్ రస్టిక్ సినిమా చేశాడు. అంబాజీపేట మ్యారేజి బ్యాండు పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో శివాని హీరోయిన్ గా నటించింది. శరణ్య ప్రదీప్, నితిన్ ప్రసన్న వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఒకరోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ అవ్వడంతో పాటు గుమ్మా లాంటి కొన్ని పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను సినిమా ఎంతవరకు అందుకుంది? అనేది ఇప్పుడు రివ్యూ లో చూద్దాం.
మల్లిగాడు మ్యారేజి బ్యాండు కథ:
తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట గ్రామంలో సెలూన్ నడిపే కనక(కృష్ణ సుక్కు)కి ఇద్దరు కవల పిల్లలు. వారిలో ఒకరు మల్లి(సుహాస్), మరొకరు పద్మ(శరణ్య ప్రదీప్). మల్లి తన కులవృత్తి కటింగ్, షేవింగ్ నేర్చుకుని మరొక పక్క మ్యారేజి బ్యాండ్ లో కూడా ముఖ్యమైన వ్యక్తిగా ఉంటాడు. పద్మ చక్కగా చదువుకుని ఆ ఊరిలోనే టీచరుగా ఉద్యోగం చేస్తూ ఉంటుంది. మరొక పక్క అనేక వ్యాపారాలు చేస్తూ వడ్డీ వ్యాపారం కూడా చేసే వెంకట బాబు(నితిన్ ప్రసన్న) పద్మకు ఉద్యోగం పెర్మనెంట్ చేయించడంతో ఆ కృతజ్ఞతతో ప్రతి ఆదివారం వెళ్లి అతని వ్యాపారాలకు సంబంధించిన పద్దులు రాయడానికి పద్మ సిద్దమవుతుంది. ఈ దెబ్బతో వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందనే విషయం మీద ఊరిలో పెద్ద ఎత్తున పుకార్లు రేగుతాయి. పద్మ టీచర్ గా వ్యవహరిస్తున్న స్కూల్లో సిమెంట్ బస్తాలు వేసే క్రమంలో వెంకట్ తమ్ముడికి, పద్మకు గొడవవుతుంది. ఇదే సమయంలో మళ్లీ వెంకట్ చెల్లి లక్ష్మి(శివాని)తో ప్రేమలో పడతాడు. ఈ విషయం తెలియడంతో అటు పద్మకి ఇటు మల్లికి కలిసి ఎలాగైనా బుద్ధి చెప్పాలని వెంకట్ భావిస్తూ ఉంటాడు. ఒకానొక సమయంలో పద్మను ఒంటరిగా స్కూల్ కి పిలిపించి ఎవరు ఊహించనీ విధంగా దారుణమైన అవమానానికి గురి చేస్తాడు వెంకట్. ఈ విషయం తెలిసిన వెంటనే మల్లి ఏం చేశాడు? ఊరి నడిబొడ్డున మల్లికి ఎందుకు వెంకట్ గుండు కొట్టించాడు? ఇంత జరుగుతుంటే ఊరి వారందరూ ఏం చేశారు ? చివరికి మల్లి లక్ష్మి ఒకటయ్యారా? వెంకట్ కి సరైన బుద్ధి చెప్పారా అనేది ఈ సినిమా కథ.
విశ్లేషణ:
కథగా చూసుకుంటే ఇది కొత్త కథ అని ఏమీ చెప్పలేం. పేదింటి, తక్కువ కులానికి చెందిన వ్యక్తి బాగా డబ్బున్న, ఎక్కువ కులానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడటం. ఆ విషయం తెలిసిన అమ్మాయి కుటుంబానికి చెందిన వారు అబ్బాయి కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించడం, చివరికి హీరో కాబట్టి తక్కువ కులానికి చెందిన వ్యక్తి అమ్మాయి కుటుంబానికి బుద్ధి చెప్పి ఆమెను వివాహం చేసుకున్న సినిమాలే మనం ఎక్కువగా చూస్తూ వచ్చాం. కానీ ఆ విషయంలో మ్యారేజి బ్యాండు కాస్త భిన్నం. సినిమా మొదలైన కొద్దిసేపటికి ఆ విషయం అర్థం అయ్యేలాగా చెప్పేసాడు దర్శకుడు. అన్ని ప్రేమ కథలు పెళ్లిళ్ల వరకు వెళ్లాల్సిన అవసరం లేదు అని హీరో చేత హీరోయిన్ కి చెప్పించి ప్రేమంటే ఇంత స్వచ్ఛంగా ఉంటుందా? ఎలాంటి స్వార్థం లేకుండా ప్రేమించిన వారు బాగుంటే చాలు అనుకునే వారు కూడా ఉన్నారా అనిపించే విధంగా సినిమాని నడిపించాడు దర్శకుడు. నిజానికి తక్కువ కులానికి చెందిన వారందరూ ఎన్నో అవమానాలకు గురై చివరికి వారందరూ ఏకమై ఎక్కువ కులానికి చెందిన వారిని టార్గెట్ చేసినట్లుగా తమిళంలో ఎక్కువగా సినిమాలు వస్తూ ఉంటాయి. తెలుగులో కూడా ఒకటి అరా సినిమాలు అలాంటివి వచ్చాయి. దాదాపు అదే కోవలో ఈ సినిమా కూడా వచ్చింది. ముందు నుంచి టీజర్ చూసి తర్వాత ఇదేదో మంచి లవ్ స్టోరీ అని అందరూ అనుకున్నారు కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత తక్కువ కులం, ఎక్కువ కులం నేపద్యంలో సాగుతున్న సినిమా అనే విషయం కొంత క్లారిటీ వచ్చింది. తమిళ ఫ్లేవర్ తో తెలుగు కమర్షియల్ అంశాలతో ఈ అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమా తెరకెక్కింది. ఫస్ట్ ఆఫ్ లో వచ్చే ప్రేమ కథ పెద్దగా కొత్తగా అనిపించదు కానీ ఉన్నంతలో కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఇక సెకండ్ హాఫ్ నుంచి పూర్తిగా ఎమోషన్స్ తోటి కథ నడిపించే ప్రయత్నం చేశారు. క్లైమాక్స్ వరకు ఊహించని విధంగా కథ నడిపి ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇక్కడ కులాల పేర్లు ఎక్కడ వాడలేదు కానీ వారు చేసే వృత్తుల ద్వారా స్పష్టం చేస్తూనే ఎలాంటి కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా స్మూత్ గా చెప్పాలనుకున్న పాయింట్ చెప్పే విషయంలో దర్శకుడు సఫలమయ్యాడు. సినిమాని ఊహకు తగ్గట్టుగానే తీసిన కొన్ని విషయాలు మాత్రం కొత్తగా అనిపిస్తాయి. కానీ క్లైమాక్స్ మాత్రం తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లు లేదనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే సుహాస్ ఎప్పటిలాగానే మల్లి అనే పాత్రలో ఒక రేంజ్ లో ఆడేసుకున్నాడు. ముందుగా పెద్దగా బాధ్యతలు లేక ప్రేమ -దోమ అంటూ ఒక అమ్మాయి వెంట తిరిగే కుర్రాడిగా నటించి ఆకట్టుకున్న సుహాస్ తర్వాత అక్కకు జరిగిన అవమానంతో ఆమె కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా తీయడానికైనా వెనుకాడని వ్యక్తిగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక సినిమా మొత్తం మీద శరణ్య ప్రదీప్ నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. సినిమాకి సుహాస్ హీరో అని ముందు నుంచి ప్రచారం చేశారు గాని చూసిన తర్వాత మాత్రం శరణ్య అసలైన హీరో అని భావించే వాళ్లే ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటి అమ్మాయి ఒక్కరు మన ఇంట్లోనో, బంధువుల ఇంట్లోనో లేక కనీసం పక్కింట్లో అయినా ఉండాలి అనేలా ఆమె పాత్రను డిజైన్ చేశారు. ఇక విలన్ పాత్రలో నితిన్ ప్రసన్న నటన సరిగ్గా సూట్ అయింది. ఈ వెంకట్ పాత్రలో వేరే నటుడిని ఊహించుకోలేని విధంగా నితిన్ ప్రసన్న ఒదిగిపోయాడు. తెలుగు అమ్మాయి శివాని కూడా తనకిచ్చిన పాత్రని పూర్తిస్థాయిలో వాడుకుంది. తన క్యూట్ నెస్ తో స్క్రీన్ మొత్తాన్ని ఆక్రమించింది. ముఖ్యంగా సుహాస్ తో చేసిన కొన్ని కాంబినేషన్ సీన్స్ అయితే ప్రేమికులు అందరికీ కనెక్ట్ అవుతాయి. పుష్ప ఫేం జగదీష్ ప్రతాప్ బండారికి పుష్ప తర్వాత అంత నిడివి ఉన్న పాత్ర, నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దొరికింది. గోపరాజు రమణ, కృష్ణ సుక్కు, సురభి ప్రభావతి సహా బహుశా అంబాజీపేట వాస్తవ్యులు ఏమో తెలియదు కానీ కొత్తగా అనిపించిన నటీనటులు కూడా తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే తాను చెప్పాలనుకున్న కథను ఎక్కడా పక్కకు వెళ్లకుండా సూటిగా సుత్తి లేకుండా చెప్పే విషయంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఇక సినిమాటోగ్రాఫర్ అంబాజీపేటను మరింత అందంగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. పాటలు చాలా బాగున్నాయి ఆన్ స్క్రీన్ కూడా ఆకట్టుకున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాని ఎలివేట్ చేసే విధంగా ఉంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. స్క్రీన్ మీద ప్రతి ఫ్రేమ్ రుచిగానే కనిపించింది.
ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలంటే తప్పు చేస్తే ఎంతటి బలవంతుడైనా శిక్ష అనుభవిస్తాడు అనే సందేశం ఇస్తూ సాగిన ఒక హార్డ్ హిట్టింగ్ స్టోరీ.