నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం అఖండ తాండవం. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అఖండ సినిమాకి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా, ఆది పినిశెట్టి విలన్‌గా నటించిన ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ మీద రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. నిజానికి డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా, పలు కారణాలతో ఆలస్యంగా డిసెంబర్ 12వ తేదీన వస్తోంది. ఒక రోజు ముందుగానే సినిమాకి ప్రీమియర్స్ ప్రదర్శించారు మేకర్స్. మరి ఈ సినిమా ఎలా ఉంది? బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ మీద ఉన్న అంచనాలను అందుకుందా లేదా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం పదండి.
అఖండ 2 తాండవం కథ:
అఖండ మొదటి భాగానికి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందించారు. ఒక రకంగా ఆ జరిగిన కథకు సుమారు 17, 18 సంవత్సరాల తరువాత ఈ కథ జరుగుతుంది. ఊరిలో ఉండే అఖండ సోదరుడి(బాలకృష్ణ 1) కుమార్తె జనని (హర్షాలి మల్హోత్రా) డీఆర్డీఓలో ట్రైనీగా చేరుతుంది. అక్కడ ట్రైనింగ్‌లో ఉండగా, భారతీయులందరూ ఎంతో పవిత్రంగా భావించే కుంభమేళాలో వైరస్ ఎటాక్ అవుతుంది. తాను కనిపెట్టిన ఒక వ్యాక్సిన్ ద్వారా ఆ వైరస్‌ను కట్టడి చేయొచ్చని తెలిసిన జనని, తన మెంటార్ (సంయుక్త మీనన్)తో కలిసి దాన్ని సిద్ధం చేస్తుంది. అయితే ఆ వైరస్ మొత్తాన్ని భారతీయులందరిలో ఎక్కించాలని దురుద్దేశంతో ఉన్న ఠాగూర్ (కబీర్ దుల్హన్ సింగ్) యాంటిడోడ్ కోసం ఎంతో ప్రయత్నం చేస్తాడు. అయితే శివారాధనలో ఉన్న అఖండ శిఖందర్ రుద్ర (బాలకృష్ణ 2), జనని ఆపదలో ఉందని తెలుసుకుని ఆమెకి ఇచ్చిన మాట కోసం తిరిగి వస్తాడు. అసలు కుంభమేళా గంగలో వైరస్ కలిపింది ఎవరు? దీని వెనుక అసలు ఎవరు ఉన్నారు? ఈ విషయం తెలిసిన అఖండ ఏం చేశాడు? ఇందులో నేత్ర (ఆది పినిశెట్టి) పాత్ర ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ
అఖండ మొదటి భాగం రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా మీద పెద్దగా అంచనాలు లేవు, కాబట్టి ఆ సినిమా ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అయిపోయింది. అయితే ఆ సినిమా బరువు అంతా ఇప్పుడు అఖండ సెకండ్ పార్ట్ మీద పడింది. దానికి తోడు బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్ అనగానే వచ్చే అంచనాలు కూడా దీనికి తోడయ్యాయి. ఇక సినిమా మొదలైనప్పటి నుంచి ఇంటర్వెల్ ముందు వరకు పెద్దగా ప్రేక్షకులను ఎంగేజ్ చేసే అంశాలు లేవు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడి వరకు సినిమాని గ్యాప్ ఫిల్లింగ్ కోసమే వాడుకున్నట్లు అనిపించింది. చిన్నారి పాప పెద్దగా అవ్వడం, తర్వాత సెకండ్ హాఫ్‌లో మెయిన్ కాన్సెప్ట్ కోసం కొన్ని పరిణామాలు జరగడం వంటివి చూపిస్తారు. అయితే అవి ఏవీ ప్రేక్షకులకు ఎంగేజింగ్‌గా అనిపించవు.
ఎప్పుడైతే అఖండ ఎంట్రీ ఉంటుందో, అక్కడి నుంచి సినిమా ఒక్కసారిగా పరిగెడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా అఖండ ప్రీ-ఇంటర్వెల్ ఫైట్ అయితే అస్సలు ఒక రేంజ్‌లో వర్కౌట్ అయింది. ప్రేక్షకులందరూ ఫుల్ మీల్స్ తిన్న ఫీలింగ్‌తో బయటకు వస్తారు. ఇక సెకండ్ హాఫ్ మొదలైన తరువాత మళ్లీ కథ నెమ్మదించిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే కథ పెద్దగా లేకపోవడంతో ప్యూర్ బాలకృష్ణ మార్క్ డివోషనల్ ఎలిమెంట్స్‌తో పాటు బోయపాటి మార్క్ ఫైట్స్ నింపేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా మొత్తం మీద కథ సింపుల్‌గా ఉంటుంది, కానీ అఖండగా బాలకృష్ణకు ఇచ్చే ఎలివేషన్స్‌తో పాటు కొన్ని ఫైట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి.
ముఖ్యంగా చెప్పాలంటే ఇది ప్యూర్ బాలకృష్ణ-బోయపాటి మాస్ కాంబినేషన్ సంభవం. దర్శకుడిగా వేరే దర్శకుడిని కానీ, బాలకృష్ణ పాత్రలో వేరే హీరోని కానీ అసలు ఊహించుకోలేం అన్నట్లుగా ఈ సినిమాలో చాలా సీన్స్ అనిపిస్తాయి. కథ లేకపోయినా కేవలం ఎలివేషన్ ఫైట్స్ తో ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా నడిపించడంలో బోయపాటి సక్సెస్ అయ్యాడు. అయితే రెగ్యులర్ సినిమా లవర్స్‌కి ఈ సినిమా కాస్త లాగ్ అనిపించవచ్చు, కానీ మాస్ ఆడియన్స్‌తో పాటు బాలకృష్ణ ఫ్యాన్స్ విపరీతంగా ఎంజాయ్ చేసే సినిమా ఇది. మరో అంశం ఏమిటంటే, మన కన్నా నార్త్ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఏమాత్రం కనెక్ట్ అయినా ఈ సినిమా బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టే సినిమాగా నిలుస్తుంది. అలాగే మొట్టమొదటి బ్లాక్‌బస్టర్ పాన్ ఇండియా సినిమాగా కూడా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు
నటన విషయానికి వస్తే, ఈ సినిమాలో బాలకృష్ణ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించాడు. ఒక పాత్ర చాలా తక్కువ సమయం ఉంటుంది, కానీ ఉన్నంతసేపు ఆకట్టుకునేలా ఉంటుంది. కానీ అఖండ పాత్ర మాత్రం చూస్తున్న ప్రతిసారి గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. బాలకృష్ణ కెరీర్‌లోనే ఇది హైలైట్ పాత్రగా చెప్పుకోవచ్చు. కనిపిస్తున్న ప్రతిసారి తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మిగతా పాత్రధారులు ఎవరిని చూడకుండా చేయడంలో బాలయ్య సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఆయన లుక్, గడ్డం సహా వస్త్రధారణ ఇలా ప్రతి విషయంలో తీసుకున్న జాగ్రత్తలు బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక మిగతా పాత్రలలో నటించిన వారందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. శివుడి పాత్రలో నటించిన వ్యక్తి ఎవరో కానీ చాలా బాగా చేశారు. అయితే అక్కడ ఏఐలో సీనియర్ ఎన్టీఆర్ ను తీసుకొస్తారని ప్రచారం జరిగింది, అదే కనుక చేయగలిగి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళేది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక ఈ సినిమా టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, సినిమా మొత్తానికి బాలయ్య హీరో అయితే, టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే తమన్ హీరో. తనదైన సంగీతంతో పాటు నేపథ్య సంగీతంతో సినిమాని నడిపించాడు. నిజానికి కొన్నిచోట్ల అవసరం లేని లౌడ్ మ్యూజిక్ పెట్టాడేమో అనిపిస్తుంది, కానీ మొత్తం సినిమాని ఎలివేట్ చేయడంలో తమ వంతు పాత్ర పోషించాడు. తరువాత సినిమా డైలాగ్స్ ఎవరు రాశారో కానీ అద్భుతంగా కుదిరాయి. రచన, దర్శకత్వం బోయపాటి శ్రీను అనే ఉంది, కాబట్టి బహుశా ఆయనే రాసి ఉండొచ్చేమో. హిందుత్వం గురించి, సనాతన ధర్మం గురించి, నేటి సమాజంలోని రాజకీయాల గురించి పలు అంశాల గురించి పలికించిన డైలాగ్స్ చప్పట్లు కొట్టించేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమాని ఒక ప్రెజెంట్ అట్మాస్ఫియర్‌తో నడిపించడానికి బాగా ఉపయోగపడింది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పనితీరు చాలా ఫ్రేమ్స్‌లో కనిపించింది. ఇక లొకేషన్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి. ఎక్కడెక్కడికి వెళ్లి షూట్ చేసుకుని వచ్చారో తెలియదు కానీ, అసలు ఏ మాత్రం మనం చూడలేము అనుకున్న చాలా లొకేషన్స్‌ని చూపించారు. నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి.
ఫైనల్లీ: ఈ అఖండ తాండవం… బాలయ్య-బోయపాటి డివోషనల్ సంభవం!