రంగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు జీవా. ఆ తర్వాత యాత్ర 2 లాంటి సినిమా కూడా చేశాడు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో అగత్యా అనే ఒక సినిమా తెరకెక్కింది. తమిళ గేయ రచయిత పా విజయ్ దర్శకుడిగా ఈ సినిమాని వేల్స్ బ్యానర్ మీద ఇషారి కే గణేష్, అర్జున్ దేవ్ నిర్మించారు. ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులకు ఆసక్తికరంగా అనిపించడంతో సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా తమిళ భాషతో పాటు తెలుగు, హిందీ భాషలలో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది?ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది రివ్యూలో చూద్దాం.
అగత్యా కథ :
తమిళ సినీ పరిశ్రమలో ఒక మంచి ఆర్ట్ డైరెక్టర్ గా స్థిరపడాలని భావించే అగత్య (జీవా) మొదటి సినిమాకి 30 లక్షలు ఎదురు పెట్టుబడి పెట్టి రంగంలోకి దిగుతాడు. అయితే మరుసటి రోజు షూటింగ్ ఉందనగా దర్శకుడు హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడంతో సినిమా క్యాన్సిల్ అవుతుంది. ఎలాగో 30 లక్షల పెట్టుబడి పెట్టాను కదా అని షూట్ కోసం అద్దెకు తీసుకున్న బంగ్లాను హాంటెడ్ హౌస్ గా మారుస్తాడు. హాంటెడ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే టికెట్ కొనుక్కునీ లోపలికి రావాలని చెప్పి హాంటెడ్ థీమ్ పార్క్ గా మార్చేస్తాడు. అలా ఆదాయం బానే వస్తుందనుకుంటున్న సమయంలో ఒక పియానో లోపల మహిళ అస్తిపంజరం బయటపడుతుంది. అక్కడి నుంచి అగత్య అండ్ కో ఆత్మల వల్ల ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఆ అస్తిపంజరం ఎవరిది? ఎందుకు దాన్ని పియానో లోపల దాచారు? అసలు అగత్య తీసుకున్న భవంతి ఎవరిది? బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న అగత్య తల్లి (రోహిణి) కోసం అగత్య ఏం చేశాడు? అసలు ఆ భవంతిలో ఉన్న ఆత్మలు ఎవరివి? చివరికి ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
కథగా చూసుకుంటే ఇది కొత్త కథ అని చెప్పలేం. ఎందుకంటే పాడుబడ్డ బవంతుల్లోకి ఏదో ఒక కారణంగా వెళ్లే హీరో, హీరోయిన్ అండ్ టీం అక్కడ ఆత్మలను నిద్రలేపి వాటి సమస్యను తీర్చి బయటకు రావడం అనే కాన్సెప్ట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. దాదాపుగా ఇది కూడా అలాంటి కథతోనే వచ్చింది. కానీ దర్శకుడు అనేక లేయర్స్ ను టచ్ చేయాలనే ఉద్దేశంతో అసలు ఏం చెప్పాలనుకున్నాడో క్లారిటీ కొందరికి మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది. సిద్ధ వైద్యం గొప్పతనాన్ని చెబుతూ దాన్ని అంతం అందిమొందించడానికి అప్పటి పాశ్చాత్య దేశాల ప్రతినిధులు ఎన్ని పన్నాగాలు పన్నారు? ఎన్ని ఇబ్బందులు పెట్టారు లాంటి విషయాలను కళ్ళకు కట్టినట్లు చూపించడంలో సక్సెస్ అయ్యారు. అలాగే ఆ సిద్ద వైద్య ఫలాన్ని ఈరోజుల్లో ఒక తల్లి కోసం కొడుకు ఎలా సాధించాడు? అనేది కనెక్ట్ చేసిన తీరు అభినందనీయం. సినిమా ప్రారంభం నుంచి దాదాపు ఇంటర్వెల్ దాకా ఆత్మలతో హీరో అండ్ టీం పడే ఇబ్బందులను చూపిస్తూ నవ్విస్తూ కాకుండా భయపెట్టే ప్రయత్నం చేశారు. అసలు ఎవరు, ఎందుకు? ఆత్మల రూపంలో వచ్చి భయపెడుతున్నారో అర్థం కాక హీరో అండ్ టీం భయపడుతుంటే ప్రేక్షకులు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో భయానికి గురి అయ్యేలా స్క్రీన్ మీదకు తీసుకొచ్చే విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇక సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత ఉన్న ఎన్నో లేయర్స్ ను ఒక్కొక్క దాన్ని రివీల్ చేస్తూ వెళ్లిన విధానం ఆకట్టుకుంటుంది. నిజానికి ఒకే సినిమాలో ఇన్ని లేయర్స్ చూపించాలనే తపన సినిమా మీద కాస్త ఆసక్తి సడలించే ప్రయత్నం చేసిందని చెప్పొచ్చు. నిజానికి సెకండ్ హాఫ్ లో అసలు ఆత్మల కథలు చెబుతున్నప్పుడు రొటీన్ అనే ఫీలింగ్ కలిగినా సరే క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ మాత్రం యానిమేషన్లో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ప్రేక్షకులు ముందుకు తీసుకు వచ్చిన విధానం ఆకట్టుకునేలా ఉంది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను భయపెట్టే విషయంలో కొంతవరకు సక్సెస్ అయినా ఫాంటసీ ఎలిమెంట్స్ విషయంలో మాత్రం పూర్తిగా సాటిస్ఫై చేసేలా ఉంది.
నటీనటుల విషయానికి వస్తే జీవా నటన గురించి మనకి ముందే తెలుసు. ఈ సినిమాలో అగత్యా అనే పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఆత్మలతో ఇబ్బందుల పడే వ్యక్తిగా ఎలా అయినా తల్లికి వ్యాధి నయం చేసుకోవాలని పరితపించే కొడుకుగా ఆకట్టుకున్నాడు.. రాశిఖన్నా ఉన్నంతలో అందాలు ఆరబోస్తూనే నటించే ప్రయత్నం చేసింది. యాక్షన్ కింగ్ అర్జున్ ఉన్నది కొంతసేపైనా తనదైన స్క్రీన్ ప్రజన్స్ తో ఆకట్టుకున్నాడు. డూప్లెక్స్ పాత్రలో నటించిన ఫ్రెంచ్ నటుడు రాక్షసత్వాన్ని తనశైలిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో సఫలమయ్యాడు. రాధా రవి, యోగి బాబు, కింగ్స్లే వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రధానమైన పాత్ర ఆర్ట్ డిపార్ట్మెంట్ పోషించింది..అప్పటి ఒక బూత్ బంగ్లా ను రీ క్రియేట్ చేసిన విధానం ప్రేక్షకులలో కొంత ఆసక్తి రేకెత్తించడంలో సక్సెస్ అయ్యారు. ఇక సినిమాటోగ్రాఫర్ కూడా ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నంలో చాలావరకు సఫలమయ్యాడు. అయితే కంప్యూటర్ గ్రాఫిక్స్ విషయంలో ఇంకా కొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. సమయాభావం వల్ల చేయలేకపోయామని టీం చెబుతున్నా సరే యానిమేషన్ విషయంలో కూడా ఇంకా బెస్ట్ ఔట్పుట్ ఇవ్వవచ్చు. ఇక యువన్ శంకర్ రాజా సంగీతం బాగుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి కలిసొచ్చేలా ఉంది. తెలుగు డబ్బింగ్ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. అగత్య- అగస్త్య అంటూ తెలుగు డబ్బింగ్ విషయంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయకుండా ఉంటే బాగుండేది. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే క్రిస్పీగా కట్ చేసి ఉంటే అవుట్ ఫుట్ మరింత బాగుండేదేమో.
ఫైనల్లీ ఆగత్యా థ్రిల్లర్ లవర్స్ కి నచ్చొచ్చు