NTV Telugu Site icon

Aay Movie Review Telugu : ఆయ్ మూవీ రివ్యూ

Aay

Aay

ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా ఇప్పటికే మాడ్ అనే సినిమా చేశాడు. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఆయన రెండవ సినిమాగా ఆయ్ అనే సినిమా చేశాడు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద ఈ సినిమాని అంజి అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేశాడు. నయన్ సారిక హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మైమ్ గోపి వంటి ఇతర కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా ముందుగా ఆగస్టు 15వ తేదీ రిలీజ్ చేయాలనుకున్నారు కానీ పలు కారణాలతో ఆగస్టు 16వ తేదీకి షిఫ్ట్ చేశారు. అయితే ప్రీమియర్స్ పేరుతో ఆగస్టు 15వ తేదీ సాయంత్రం నాలుగు గంటల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున షోస్ పడ్డాయి. టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులలో ఈ సినిమా మీద కాస్త ఆసక్తి ఏర్పడింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంది? ఎంతవరకు మెప్పించింది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూసి తెలుసుకుందాం.

ఆయ్ కథ: కార్తీక్ (నార్నె నితిన్) అమలాపురం పక్కన ఒక చిన్న పల్లెటూరుకు చెందిన కుర్రాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ వర్క్ ఫ్రం హోం చేసేందుకు సొంత ఊరికి వస్తాడు. అనుకోకుండా పక్క ఊరికి చెందిన పల్లవి (నయన్ సారిక)ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. స్నేహితులు హరి(అంకిత్ కొయ్య), సుబ్బు(రాజ్ కుమార్ కసిరెడ్డి) సహాయంతో ఆమె వెంట పడుతూ ఆమెను ప్రేమలో పడేస్తాడు. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో పల్లవికి పెళ్లిచూపులు ఏర్పాటు చేశారని తెలుస్తుంది. తెగించి ఇంటికి వెళితే పల్లవి మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన విషయం కార్తీక్ అండ్ బ్యాచ్ కి తెలుస్తుంది. అయితే ప్రేమించిన కార్తీక్ ను కాదని పల్లవి మరో పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సిద్ధమైంది? చివరికి పల్లవి, కార్తీక్ కలిశారా? వేరే కులం అంటే అసలు ఏమాత్రం పడని పల్లవి తండ్రి దుర్గ(మైమ్ గోపి) కార్తీక్ పల్లవిల ప్రేమ గురించి తెలిసి ఏం చేశాడు? చివరికి ఏం జరిగింది? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:   ఈ సినిమాని యూనిట్ ముందు నుంచి ఒక ఫన్ బాత్ అన్నట్టుగానే ప్రమోట్ చేస్తూ వచ్చింది. అందుకు తగ్గట్టుగానే సినిమా మొత్తాన్ని ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలానే రాసుకున్నాడు డైరెక్టర్. సినిమా ప్రారంభం నుంచి అదే జానర్ లో నడిపించే ప్రయత్నం చేశారు. ముందుగా కార్తిక్ అతని స్నేహితుల పరిచయం. వారి క్యారెక్టర్ లను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఆ తర్వాత పల్లవి ఎంట్రీ తర్వాత కథ కాస్త ముందుకు కదిలిన ఫీలింగ్ కలుగుతుంది. పల్లవితో ప్రేమలో పడటం, ఆమెతో కలిసి సరదా సరదా పనులు చేస్తూ ఉండడం లాంటి సన్నివేశాలు ఆసక్తికరంగానే అనిపిస్తాయి. కానీ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ భలే ఆసక్తికరంగా రాసుకున్నాడు డైరెక్టర్. అక్కడి నుంచి కథ మీద ప్రేక్షకులలో ఆసక్తి పెరుగుతుంది. ఇక సెకండాఫ్ మొదలైన తర్వాత పల్లవి ప్రేమించినా కూడా వేరే వ్యక్తి ఎందుకు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది అనే విషయాన్ని ఆసక్తికరంగా కన్వే చేశాడు. ఆ తర్వాత పల్లవి ప్రేమ తగ్గించుకోవడానికి కార్తీక్ చేసే పనులు, కార్తీక్ పల్లవి ప్రేమను నిలబెట్టాలని స్నేహితులె చేసే పనులు నవ్వు తెప్పిస్తాయి. అయితే క్లైమాక్స్ మాత్రం కాస్త ఊహకు దగ్గరగానే ఉన్నా భలే హై ఇచ్చేలా రాసుకున్నాడు.కొత్త కథేం కాదు కానీ ఉన్నంతలో అక్కడక్కడా కామెడీ పేలిన సినిమా ఇది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ హిలేరియస్‌గా వర్కవుట్ అయ్యాయి అని చెప్పక తప్పదు. కథ ఉన్నా.. కామెడీ ముందు కనిపించదు. సెకండాఫ్‌లోనూ అక్కడక్కడా బాగానే నవ్వించారు. కథ కంటే కామెడీ ఎపిసోడ్స్‌పై ఫోకస్ చేసిన దర్శకుడు అంజి కామెడీతోనే అండర్ కరెంట్‌గా కులం టాపిక్ తీసుకొచ్చాడు. కులం కన్నా స్నేహం గొప్పది అనే లైన్ తో ఈ సినిమా ఆకట్టుకునేలా ఉంది.

నటీనటుల విషయానికి వస్తే మొదటి సినిమాతో పోలిస్తే నార్నె నితిన్ పర్ఫార్మ్ చేసే అవకాశం దక్కింది. అమ్మాయి ప్రేమ కోసం పరితపించే ప్రేమికుడిగా ఆకట్టుకున్నాడు. ఇక స్నేహితులుగా నటించిన రాజ్ కుమార్, అంకిత్ తమదైన శైలిలో నవ్వించే ప్రయత్నం చేశారు. హీరోయిన్ పరవాలేదు కానీ హీరో పక్కన తేలిపోయేలా అనిపించింది. వినోద్ కుమార్, మైమ్ గోపి, సురభి ప్రభావతి, శ్రీవాణి త్రిపురనేని సహా మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేలా ఉంది. మ్యూజిక్ కూడా చాలా క్యూట్ అనిపించేలా ఉంది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోరు కూడా సినిమా కథకు తగ్గట్టుగా స్కోర్ చేశారు. నిర్మాణం విలువలు గీత ఆర్ట్స్ స్థాయికి తగ్గట్టే ఉన్నాయి.

ఫైనల్లీ : ఆయ్ ఫన్ ఫిల్డ్ ఎంటర్ టైనర్.. నవ్విస్తూనే ఆలోచింపచేసి హాయిగా థియేటర్ల నుంచి బయటకు పంపిస్తుంది.

Show comments