సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నారి. మహిళా దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని మార్చి ఏడవ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఒక రోజు ముందుగానే ముందు నుంచి ఈ సినిమాలో ఒక సీరియస్ సబ్జెక్టును టచ్ చేశామని ప్రమోషన్స్ లో టీం చెబుతూ వచ్చింది. దానికి తోడు రమణ గోగుల, ఆర్పీ పట్నాయక్ వంటి వాళ్లు పాడిన పాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం
నారి కథ:
భారతి(ఆమని) తెలియని వయసులో చేసిన ఒక తప్పు వల్ల ఒంటరి మహిళగా జీవితం గడపాల్సి వస్తుంది. తన కొడుకు(కార్తికేయ దేవ్)ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ అతనే లోకంగా బ్రతుకుతూ ఒక స్కూల్ లో టీచర్ గా పని చేస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో తాను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన కొడుకే ఒక మైనర్ బాలికపై రేపు అటెంప్ట్ చేశాడని తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఆమని తన కొడుక్కి వేసిన శిక్ష ఊహించని షాక్ కలిగిస్తుంది. అసలు ఆమని తన కొడుక్కి ఎలాంటి శిక్ష వేసింది? ఆ శిక్షతో తన కొడుకు మారాడా? అసలు ఆమని ఒంటరి జీవితం గడపాల్సిన అవసరమేమిటి? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ: మనం ప్రతిరోజు కచ్చితంగా మూడు నాలుగు రేప్ కేసులకు సంబంధించిన వార్తలు వార్తా పత్రికలలోనూ, లేదా న్యూస్ చానల్స్ లోనో చూస్తూనే ఉంటాం. ఇక్కడ రేప్ చేసిన మృగాళ్లది తప్పా లేక రేప్ కాబడిన ఆ నిర్భాగ్యులది తప్పా అనే డిబేట్ కూడా మన దౌర్భాగ్యం కొద్దీ కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. అర్ధరాత్రి ఆడపిల్ల పై రేప్ జరిగిందంటే అసలు రేప్ చేసిన వాళ్లని వదిలేసి ఆ టైంలో అర్ధరాత్రి ఎందుకు అక్కడికి వెళ్ళింది? అంటూ జడ్జ్ చేసే వాళ్ళు కొంత మంది ఉన్నారు. అలాగే రేప్ చేసిన వాళ్ళని వెనకేసుకు వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఈ సినిమాను అలాంటి వాళ్ళందరికీ చంపపెట్టుగా తీశారేమో అనిపిస్తుంది. ఒక దుర్మార్గుడి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరి జీవితాన్ని గడపాల్సి వచ్చిన ఓ మహిళ స్త్రీ శక్తిగా వారి ఎంతోమంది స్కూల్ పిల్లలకు ధైర్యం కలిపిస్తూ వారు సన్మార్గంలో ముందుకు వెళ్లేలా ప్రోత్సహిస్తూ జీవనం గడుపుతూ ఉంటుంది. అలాంటి ఓ మంచి టీచర్ కడుపున ఒక రేపిస్టు పుడితే? ఆ రేపిస్ట్ ఆ తల్లి దగ్గరికి చదువుకోవడానికి వచ్చిన ఓ బాలిక మీద కన్నేసి అత్యాచారం చేస్తే, ఆ తల్లి రియాక్షన్ ఒక ఊహించని షాక్ లా తగులుతుంది. నిజానికి సినిమా ప్రారంభమైన తర్వాత ఫస్ట్ ఆఫ్ అంతా రొటీన్ సినిమాలాగే ఆలోచింప చేసే ప్రయత్నాన్ని తట్టి లేపుతూ సాగే సినిమాలాగే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మొదలైన కొద్దిసేపటి వరకు అదే ఫీలింగ్ ఉంటుంది కానీ క్లైమాక్స్ వచ్చేసరికి మాత్రం ఎవరూ ఊహించని విధంగా హార్డ్ హిట్టింగ్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సినిమాని ముగించిన తీరు ఆలోచింపచేసేలా ఉంది. నిజానికి రేప్ కేసులలో అరెస్ట్ అయిన కొడుకులను కూడా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించే తల్లిదండ్రులు ఉన్న ఈ రోజుల్లో ఈ సినిమాలో చూపించిన క్లైమాక్స్ మాత్రం నిజంగా హార్డ్ హిట్టింగ్. దర్శకుడు రాసుకున్న కథలో బలమైన సందేశం ఉంది క్లైమాక్స్లో దాన్ని ప్రేక్షకుల మెదడులలో రిజిస్టర్ అయిపోయేలా తీసిన విధానం అభినందనీయం. అయితే దర్శకుడు క్లైమాక్స్ ట్విస్ట్ లేదా షాక్ ఎలిమెంట్ మీద పెట్టిన దృష్టిని ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే విషయంలో కూడా పెట్టి ఉంటే నారి ఇంకా మంచి అవుట్ ఫుట్ తో ప్రేక్షకులను అలరించి ఉండేది.
ఇప్పటివరకు ఫ్యామిలీ పాత్రలలో మెరిసిన ఆమని ఈ సినిమాలో ఒక సరికొత్త పాత్రలో ఇమిడిపోయింది. ఆమె కెరియర్ లో ఇది గుర్తించుకునే పాత్రగా నిలిచిపోతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ లో ఆమె నటన అనితర సాధ్యం. కంచరపాలెం నిత్యశ్రీ పాత్ర చిన్నదే అయినా ఆకట్టుకుంది. సలార్ కార్తికేయ దేవ్ స్క్రీన్ ప్రెజన్స్ తో పాటు నటన కూడా బాగుంది. వికాస్ వశిష్టకి చాలా రోజుల తరువాత మంచి పాత్ర, నటనకు స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. మౌనిక రెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్, సునయన, ప్రమోదిని వంటి వారు తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే కనుక వినోద్ కుమార్ అందించిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా ఆర్పీ పట్నాయక్, సునీత, రమణ గోగుల పాడిన పాటలు ఉన్నాయ్. నేపథ్య సంగీతంతో ఎమోషన్స్ ను ఎలివేట్ చేయడంలో మాత్రం సంగీత దర్శకుడు తడబడ్డాడు. ఇక సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది కానీ బడ్జెట్ లిమిటేషన్లు కనిపించాయి.
ఫైనల్లీ ఈ నారి -ఆలోచింపచేసే హార్డ్ హిట్టింగ్ స్టోరీ