బెజవాడ దుర్గగుడిలో ఏసీబీ దాడులు ఎవరికి షాక్ ఇచ్చాయి? పెద్ద సంఖ్యలో ఉద్యోగులపై వేటు ఎవరికి మింగుడుపడటం లేదు? జరుగుతున్న పరిణామాలపై సన్నిహితుల దగ్గర అసహనం వ్యక్తం చేస్తున్న అమాత్యుల వారు ఎవరు?
ఏసీబీ దాడులు.. మంత్రి శిబిరంలో కలకలం!
దుర్గమ్మ చల్లని చూపు తమ మీద పడితే లైఫ్ హ్యాపీగా సాగిపోతుందని భావిస్తారు బెజవాడ జనం. రాజకీయ నేతలు సైతం అదే ఆశిస్తారు. అలాంటి అమ్మవారి ఆలయాన్ని ఏసీబీ బృందాలు మూడు రోజులు జల్లెడ పట్టడంతో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ టెన్షన్ పడుతున్నారట. ఆయన మంత్రిత్వశాఖ పరిధిలోకే కాదు.. ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గ పరిధిలోకి కూడా దుర్గమ్మ ఆలయం వస్తుంది. ఏసీబీ ఎంట్రీ ఒక సంచలనమైతే.. ఏసీబీ సిఫారసుల మేరకు దుర్గగుడిలో పనిచేస్తున్న ఉద్యోగులపై వేటు వేయడం ఇంకా కలకలం రేపుతోంది. ఈ చర్యలు.. జరుగుతున్న పరిణామాలతో మంత్రిగారి శిబిరంలో నిద్ర కరువైందని సమాచారం.
దుర్గ గుడిలో ఏం జరగాలన్నా మంత్రి అనుచరుల అనుమతి కావాలా?
మొత్తం చర్చంతా మంత్రి వెల్లంపల్లి చుట్టూనే తిరుగుతోందట. ఈ ప్రచారంలో పనిలో పనిగా 2009 నాటి పరిణామాలను ప్రస్తావిస్తున్నారట కొందరు. వెల్లంపల్లి 2009లోనే తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడు కూడా ఆయన అనుచరుల హవా దుర్గగుడిలో కొనసాగిందని చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పుడు వెల్లంపల్లి మంత్రి అయ్యారు. దేవాదాయశాఖను చేపట్టారు. దీంతో ఆయన వర్గం ఇంద్రకీలాద్రిపై స్పీడ్ పెంచిందని టాక్. మంత్రిగారి అనుచరుల అనుమతి లేనిదే కొండపై ఏ పనీ జరగబోదని కథలు కథలుగా చెప్పుకొంటారట.
రాజకీయ కారణాలతో విమర్శలు చేస్తున్నారని మంత్రి కౌంటర్!
అమ్మవారి వెండి రథంపై సింహం ప్రతిమలు చోరీ అయినప్పుడు అన్ని పక్షాలకు మంత్రి వెల్లంపల్లి టార్గెట్ అయ్యారు. అంతకుముందు ఈవో సురేష్ నియామకం సమయంలోనూ విమర్శలు రేగాయి. కోర్టులో పిటిషన్లు పడ్డాయి. ఇటీవల కొండరాళ్లు జారిపడటం, సెక్యూరిటీ టెండర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు, శానిటేషన్ టెండర్లు, దసరా ఉత్సవాల నిర్వహణ సహా వివిధ అంశాలు వివాదాస్పదం అయ్యాయి. దుర్గగుడిలో అంతర్గత బదిలీలలోనూ పెద్ద ఎత్తున సొమ్ములు చేతులు మారాయని ఆరోపణలు వచ్చాయి. ఇలా ఆలయానికి సంబంధించిన ఎలాంటి విమర్శలు.. ఆరోపణలు వచ్చినా.. వాటిని రాజకీయ ప్రేరేపితమైనవిగా కొట్టిపారేసేవారు మంత్రి.
ఇరకాటంలో పెడుతున్నారా? గిట్టని వారు చేస్తున్న పనా?
ఇప్పుడు ఏసీబీ ఎంట్రీ ఇవ్వడంతో వైరిపక్షాలు సైతం యాక్టివ్ అయ్యాయి. జనసేన నేత పోతిన మహేష్ తన దగ్గరున్న వివరాలను ఆయన ఏసీబీకి అందజేయడంతో ఇదేం గొడవ అని మంత్రిగారి శిబిరం చికాకు పడుతోందట. రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి నుంచి ఏసీబీ వివరాలు సేకరించడాన్ని తనను ఇరకాటంలో నెట్టడంగా భావిస్తున్నారట వెల్లంపల్లి. వైసీపీలో తానంటే గట్టినవారు ఎవరైనా వీటిని ప్రోత్సహిస్తున్నారా అని ఆరా తీస్తున్నారట.
ఏసీబీ సోదాల వెనక వేరే కారణాలున్నాయా?
ఏసీబీ సిఫారసుతో ఉద్యోగులపై వేటు పడిన ఈ వ్యవహారం ఇక్కడితో ముగుస్తుందా లేక మూలాల వరకు వెళ్తుందా అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏసీబీ అధికారులు సోదాలు జరిపిన జమ్మిదొడ్డి కార్యాలయంలోనే మంత్రి క్యాంప్ ఆఫీస్ కూడా ఉంది. అందుకే దుర్గగుడిలో అక్రమాలు టార్గెట్‌గా ఏసీబీ సోదాలు జరిగాయా లేక వేరే కారణాలు ఉన్నాయా అన్నది మంత్రి శిబిరానికి అర్థం కావడం లేదట. మరి.. ఈ ఎపిసోడ్ ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.