Site icon NTV Telugu

YCP : వైసీపీ మంత్రుల బస్సుయాత్ర..అనంత టీడీపీలో గలాటా

Bus

Bus

ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మధ్య ఉప్పు నిప్పులా ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య వార్‌ ఓ రేంజ్‌లో సాగుతోంది. ఓపెన్‌గానే విమర్శలు చేసుకుంటున్నారు నాయకులు. ఇప్పుడు మంత్రుల బస్సుయాత్ర సైతం జేసీ, పల్లెల మధ్య మాటల మంటలు రాజేస్తున్నాయి. వాటి చుట్టూనే ప్రస్తుతం రాజకీయ చర్చలు జరుగుతున్నాయి.

బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు జిల్లాకు వచ్చారు. ఆ సమయంలో వేదికపై జేసీ దివాకర్‌రెడ్డి, పల్లె రఘునాథరెడ్డి ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆ దృశ్యం చూసిన పార్టీ శ్రేణులు ఆశ్చర్యపోయాయి. ఇకపై ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు ఉండబోవని అనుకున్నారట. కానీ.. సీన్‌ కట్‌ చేస్తే వారం తిరగకుండానే మళ్లీ పాత పగలు కొత్తగా బుస కొడుతున్నాయి. అనంతపురం జిల్లాకు మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర వచ్చింది. అట్టహాసంగా యాత్ర ముగింపు సభ నిర్వహించారు వైసీపీ నేతలు. ఈ సభే జేసీ, పల్లె మధ్య మళ్లీ చిచ్చు రాజేసింది. ఇందుకు కారణాలు లేకపోలేదు. వైసీపీ సభకు జనాల్ని తరలించేందుకు పల్లె రఘునాథరెడ్డికి సంబంధించిన కాలేజీ బస్సులు ఇచ్చారట. ఆ అంశంపైనే ప్రశ్నలు సంధిస్తోంది జేసీ శిబిరం.

వైసీపీ నేతలతో మాజీ మంత్రి పల్లెకు సంబంధాలు ఉన్నాయని కొంతకాలంగా జేసీ వర్గం ఆరోపిస్తోంది. ఇప్పుడు వైసీపీ సభకు పల్లె కాలేజీకి చెందిన బస్సులు ఎలా పెడతారని.. జేసీ వర్గీయులు సోషల్‌ మీడియాలో ఏకిపారేస్తున్నారు. రాజకీయ కక్షతో దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులపై వైసీపీ ప్రభుత్వం కేసులు పెడుతోందని.. అదే సమయంలో టీడీపీ మాజీ మంత్రి కాలేజీ బస్సులు వైసీపీ సభలకు జనాల్ని తరలిస్తున్నాయని జేసీ వర్గం మాటల తూటాలు పేలుస్తోంది. అయితే పార్టీ సభలకు బస్సులు ఇవ్వకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తాయని బెదిరించడం వల్లే వాటిని సమకూర్చామని వివరణ ఇస్తున్నారు పల్లె వర్గీయులు.

ఈ సమస్య చినికి చినికి గాలి వానగా మారుతుండటంతో పల్లె విద్యా సంస్థల వెహికల్స్‌ ఇంఛార్జ్‌ తమ ప్రమేయం లేకుండానే బస్సులను తీసుకెళ్లారని వివరణ ఇచ్చారు. కానీ.. జేసీ వర్గం శాంతించడం లేదు. పల్లెపై అంతెత్తున లేస్తూనే ఉంది. మొత్తానికి పార్టీ కేడర్‌లోనూ కొత్త చర్చ మొదలైందట. వైసీపీ మంత్రులు బస్సు యాత్రలు చేయడం ఏంటో.. ఆ యాత్రకు టీడీపీ నేత కాలేజీ బస్సులు పంపడం ఏంటో అని చెవులు కొరుక్కునేవారు ఎక్కువయ్యారట. మరి.. ఈ ఎపిసోడ్‌ రానున్న రోజుల్లో అనంత టీడీపీలో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

 

Exit mobile version