టీఆర్ఎస్ చీఫ్.. ఏపీలో పార్టీ పెడతారో లేదో కానీ.. ప్లీనరీలో ఆయన చేసిన ప్రకటన ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. అధికార వైసీపీ కౌంటర్లపై కౌంటర్లు వేస్తోంది. రాజకీయ లబ్ధికోసం నేతలు చేస్తున్న ప్రయత్నాలు.. ఈ రగడను అనేక మలుపులు తిప్పుతోంది. మాటల దాడి ఇక్కడితో ఆగుతుందా? మరింత ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో పార్టీలు ఉన్నాయా?
రెండు రాష్ట్రాలను కలిపేస్తే సమస్యే ఉండబోదన్న పేర్ని నాని..!
టీఆర్‌ఎస్ ప్లీనరీలో గులాబీ బాస్.. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ, తెలంగాణలో మాటల మంటలు రాజేస్తున్నాయి. ఏపీలోనూ పార్టీ పెట్టాలని కోరుతున్నారని కేసీఆర్ చేసిన ప్రకటన.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ నేతలు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందించారు. కేసీఆర్ వస్తానంటే ఎవరైనా వద్దన్నారా అని బదులిచ్చారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మంత్రి పేర్ని నాని మాత్రం మరో అడుగు ముందుకేసి.. సమైక్యాంధ్ర పల్లవి అందుకున్నారు. రెండు రాష్ట్రాలను కలిపేస్తే.. ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీలో కేసీఆర్ పార్టీ పెట్టడం కంటే.. రెండు రాష్ట్రాలను కలిపేస్తే అసలు సమస్యే ఉండదని వాదించారు పేర్నినాని. ఇప్పుడీ కామెంట్సే రెండు రాష్ట్రాల్లో చర్చగా మారాయి.
తెలంగాణాను బలిచ్చే కుట్ర జరుగుతోందన్న రేవంత్..!
రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికారపార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సమయంలోనే తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఈ ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజ్య విస్తరణకాంక్షకు తెలంగాణాను బలిచ్చే కుట్ర జరుగుతోందని తన ట్వీట్‌లో బలమైన పదాలను ప్రయోగించారు రేవంత్‌రెడ్డి. టీఆర్ఎస్ ప్లీనరీలో తెలుగుతల్లి విగ్రహం ప్రత్యక్షం.. ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌ల ఉమ్మడి కుట్రగా ఆయన ఆరోపించారు. మంత్రి పేర్ని నాని సమైక్యాంధ్ర ప్రతిపాదన ఆ కుట్రలో భాగంగా విమర్శించారు రేవంత్‌రెడ్డి.
టీఆర్ఎస్ రియాక్షన్‌పై ఆసక్తి..!
ఏపీలో పోటీ.. పార్టీ పెట్టడం అనే మాటలు టీఆర్ఎస్ నుంచి కొత్తగా వచ్చినవేమీ కావు. గతంలోనూ పలు సందర్భాలలో అన్నవే. అప్పట్లో ఏపీ నుంచి పెద్దగా రియాక్షన్ లేదు. ఇప్పుడు ఏపీలోని అధికారపార్టీ వేసిన కౌంటర్లే పొలిటికల్ సర్కిళ్లలో చర్చగా మారాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హుజురాబాద్, బద్వేల్‌లోఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు వాటిపై ఫోకస్ పెట్టినవాళ్లకు.. కొత్త ఎపిసోడ్ ఆకట్టుకుంది. కీలక బాణం వదిలిన టీఆర్ఎస్ నుంచి రియాక్షన్స్ లేవు. కానీ.. ప్లీనరీలో విడిచిపెట్టిన అస్త్రం మాత్రం ఇతర పార్టీలను కుదురుగా ఉండనివ్వడం లేదు. ఈ రగడ ఉభయ రాష్ట్రాల్లోని పార్టీలకు రాజకీయంగా ఏ మేరకు కలిసి వస్తుందో.. వారి ఆలోచనలేంటో కాలమే చెప్పాలి. అందుకే ఈ మాటల యుద్ధం ఇక్కడితో ఆగుతుందో.. మరింత ముందుకెళ్తుందో అన్న ఆసక్తి అయితే రెండు రాష్ట్రాల్లోనూ నెలకొంది.
