MLA రాజాసింగ్‌పై స్పీకర్ చర్యలు తీసుకుంటారా? వేటు వేస్తారా? MIM ఇచ్చిన ఫిర్యాదుపై సభాపతి ఏం చేస్తారు? గతంలో శాసనసభ్యులపై కఠిన చర్యలు తీసుకున్న ఉదంతాలు ఉన్నాయా? స్పీకర్ దగ్గర ఉన్న ప్రత్యామ్నాయాలు ఏంటి? లెట్స్ వాచ్..!
వివాదాస్పద వ్యాఖ్యలతో ఇరుకునపడ్డ MLA రాజాసింగ్ ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. ఆయనపై PD యాక్ట్ కింద చర్యలు తీసుకున్నారు పోలీసులు. అయితే రాజాసింగ్‌పై మరిన్ని చర్యలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. దానికి కారణం లేకపోలేదు. రాజాసింగ్‌పై MIM స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. అందుకే అందరి దృష్టీ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిపై ఉంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలనేది MIM డిమాండ్. స్పీకర్‌కు అందజేసిన లేఖలో కొన్ని అంశాలను ప్రస్తావించారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఇద్దరు ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ మధుసుదనా చారి బహిష్కరణ వేటు వేశారు. అసెంబ్లీ జాయింట్ సెషన్‌లో గవర్నర్ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లు అనుచితంగా ప్రవర్తించారని వారిపై చర్యలు తీసుకున్నారు సభాపతి. ఆ తర్వాత ఆ ఇద్దరూ స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. అయితే ఇంతలోనే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ఆ రెండు నియోజకవర్గాలకు ఉపఎన్నిక రాలేదు.
తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ పై బహిష్కరణ వేటుకు ఎంఐఎం డిమాండ్ చేస్తోంది. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని స్పీకర్ పోచారం ఏం చేస్తారన్నది చర్చగా మారుతోంది. సభాపతి ఏం చేస్తారు? వేటు వేయడానికే సిద్ధపడితే తర్వాత ఏం జరుగుతుంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాజాసింగ్ పై వేటు వేస్తే గోషామహల్‌కు ఉపఎన్నిక వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మునుగోడు ఉపఎన్నిక వేడి ఉండటంతో.. గోషామహల్‌లోనూ బైఎలక్షన్‌కు అధికారపార్టీ సిద్ధ పడుతుందా అనేది ఒక వాదన.
మొత్తంగా ఎంఐఎం లేఖ ఇప్పుడు తెలంగాణ రాజకీయల్లో చర్చగా మారింది. ఆ లేఖపై సభాపతి న్యాయనిపుణల సలహా తీసుకుని.. ఒక నిర్ణయానికి వస్తారని అనుకుంటున్నారు. అయితే పీడీ యాక్ట్‌పై అరెస్ట్ చేయడాన్ని న్యాయపరంగా సవాల్ చేసే పనిలో రాజాసింగ్ ఉన్నారు. దానిపై కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగుతారా? లేక ముందుగానే ప్రక్రియ ప్రారంభించి నిర్ణయం ప్రకటిస్తారా అనేది కూడా చర్చే. మరి.. ఏం జరుగుతుందో కాలమే చెప్పాలి.