KCR Bihar Tour : బీహార్ పర్యటనలో సీఎం కేసిఆర్ CBIపై చేసిన కామెంట్స్ దేనికి సంకేతం? తెలంగాణలో కూడా అలాంటి స్ట్రాంగ్ రియాక్షన్ ఉంటుందా? ప్రధాని మోడీతో ఢీ అంటే ఢీ అంటున్న తరుణంలో సంచలన రాజకీయాలకు తెలంగాణ వేదిక అవుతుందా? ఇంతకీ అధికారపార్టీ ఆలోచన ఏంటి? లెట్స్ వాచ్..!
కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై దేశంలో సర్వత్రా చర్చ జరుగుతోంది. బీజేపీ నేతృత్వంలోని NDA సర్కార్ విపక్ష పార్టీలను దర్యాప్తు సంస్థలతో టార్గెట్ చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. బీజేపీని వ్యతిరేకించే పార్టీల అభిప్రాయం కూడా ఇదే. ఈ దుర్వినియోగానికి సంబంధించిన గణాంకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాయి విపక్షాలు. కేంద్ర సర్కార్‌తో ఢీ అంటే ఢీ అంటున్న రాష్ట్రాల్లో CBI విచారణ కోసం ఇచ్చిన జనరల్ కన్సెంట్‌ను విత్ డ్రా చేసుకుంటూ వస్తున్నాయి. ఆ జాబితాలో బీహార్ చేరబోతున్నట్టు సమాచారం. ఆ రాష్ట్రంలో పర్యటించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆ కోణంలోనే CBIపై కామెంట్స్ చేశారన్నది కొందరి వాదన.
2014లో బీజేపీ సారథ్యంలోని NDA అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి CBI, ED తదితర కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరుపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు లొంగేది లేదని చెబుతూ.. CBIకి ఇచ్చే జనరల్ కన్సెంట్‌ను విత్ డ్రా చేసుకున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 9 రాష్ట్ర ప్రభుత్వాలు అదే చేశాయి. పశ్చిమ బెంగాల్, చత్తీస్‌ఘడ్, రాజస్థాన్, పంజాబ్, మేఘాలయ తదితర రాష్ట్రాలు ఉన్నాయి. గతంలో ఏపీ ప్రభుత్వం కూడా జనరల్ కన్సెంట్‌ను విత్ డ్రా చేసుకుంది. ఇప్పుడు బీహార్ పర్యటనలో సీఎం కేసీఆర్ CBIను ప్రస్తావించడంతో సర్వత్రా చర్చ ప్రారంభమైంది.
కొంతకాలంగా ప్రధాని మోడీపైనా.. కేంద్ర ప్రభుత్వ విధానాలపైనా సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ అజెండా కోసం ప్రయత్నిస్తూ.. విపక్ష పార్టీలను ఏకం చేసే పనిలో ఉన్నారు కూడా. ఇప్పటికే వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల అధినేతలతోపాటు.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ చర్చలు జరిపారు కేసీఆర్. EDకి భయపడేది లేదని తేల్చేశారు. ఇప్పుడు ఆయన CBIపై కన్నెర్ర చేశారు. అందుకే తెలంగాణలో జరిగబోయే పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తెలంగాణలోనూ సీబీఐకి జనరల్ కన్సెంట్‌ను సీఎం కేసీఆర్ విత్ డ్రా చేస్తారని ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈ నెల 3న జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చిస్తారనే వాదన ఉంది. జనరల్ కన్సెంట్‌ను ఉపసంహరించుకుంటే కేంద్ర ప్రభుత్వ తీరుపై చేస్తున్న టీఆర్ఎస్ పోరాటం మరో అంకానికి చేరుకున్నట్టే. బీహార్ భేటీలో చర్చకు వచ్చిన అంశాలు.. మీడియాతో కేసీర్ వెల్లడించిన విషయాలపై కేంద్రం కన్నేసినా.. ఇంత వరకు స్పందించలేదు. రానున్న రోజుల్లో ఏం చేస్తుందో అంచనాలకు అందడం లేదు. ఈ తరుణంలో కేసీఆర్ సాగించే రాజకీయ పోరాటం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మరి.. గులాబీ బాస్ ఏం చేస్తారో చూడాలి.
