Site icon NTV Telugu

Off The Record: వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయా? హైకమాండ్ ఏం చెప్తుంది?

Bjp

Bjp

Off The Record: తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య అవగాహన ఉందా? వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా? ఆ విషయంలో బీజేపీ హైకమాండ్‌ ఏం చెబుతోంది? రాష్ట్ర నాయకులు ఏం నమ్ముతున్నారు? రెండు పార్టీలు ఒక్కటేనన్న ప్రచారం రెండుసార్లు ముంచినా రాష్ట్ర నాయకులకు జ్ఞానోదయం అవలేదా? ఎటూకాని ఈ టైంలో ఆ చర్చ ఎందుకు వచ్చింది? ఢిల్లీ నాయకత్వం ఏమని క్లారిటీ ఇచ్చింది?

Read Also: Off The Record: లోకేష్ రాజమండ్రి టూర్ రద్దు వెనక బలమైన కారణాలే ఉన్నాయా?

తెలంగాణలో పొత్తులకు సంబంధించి బీజేపీ హై కమాండ్‌ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉంది. మనం సోలో…. సింహం సింగిల్‌గానే వస్తుందంటూ పదే పదే చెబుతున్నారు ఢిల్లీ పెద్దలు. ఎన్నిక ఏదైనాసరే… మనది ఒంటరి పోరేనని సూటిగా సుత్తిలేకుండానే పార్టీ మీటింగ్స్‌లో చెప్పేస్తున్నారు. ఏళ్ళ తరబడి ఈ మాట చెబుతున్నా.. పార్టీ రాష్ట్ర నాయకులకు మాత్రం నమ్మకం కుదరడం లేదట. ఏవో అనుమానాలు, పైకి కనిపించని ఇంకేవో భయాలు వాళ్ళని వెంటాడుతూనే ఉన్నట్టు చెప్పుకుంటోంది కేడర్‌. మరీ ముఖ్యంగా బీఆర్‌ఎస్‌తో పొత్తు ఫోబియా ఎప్పటికప్పుడు వాళ్ల మెదళ్లను తొలుస్తోందట. అలాంటిదేం ఉండబోదని ఢిల్లీ నాయకత్వం చెప్పినా సరే.. ఏమో.. గుర్రం ఎగరావచ్చు అంటూ పదే పదే అదే విషయాన్ని ప్రస్తావిస్తుండటం హైకమాండ్‌కు కూడా చిరాకు తెప్పిస్తోందని అంటున్నారు.

Read Also: Naari Naari Naduma Murari: పెద్ద సినిమాల నడుమ మురారి

ఇలాంటి అనుమానాలతోనే.. పొత్తు కథల్ని తిప్పికొట్టడంలో విఫలం కావడంతో 2018 , 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి చావు దెబ్బ తగిలిందన్న విశ్లేషణలున్నాయి. 2018 ఎన్నికలకి ముందు అప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా నెత్తీనోరూ బాదుకుని ఆ విషయం చెప్పినా తెలంగాణ నేతలు విశ్వసించలేదు. పార్టీ అధ్యక్షుడిగా చెబుతున్నా… ఆ విషయంలో మరో ఆలోచన లేదని షా చెప్పినా.. రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతల్లో అనుమానం పోలేద. దాని ప్రభావం అప్పటి ఎన్నికల్లో గట్టిగానే పడిందన్న విశ్లేషణలున్నాయి. ఇక 2023 ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనన్న ప్రచారం అప్పట్లో జోరుగా జరిగింది. దాన్ని తిప్పికొట్టడంలో కాషాయ దళం విఫలమైందని, ఆ ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణం అదేనన్న అభిప్రాయం ఉంది. అదే చర్చ ఇప్పటికీ పార్టీ వర్గాల్లో జరుగుతూనే ఉంది. పొత్తు ఉండబోదన్న సంగతిని సొంత పార్టీ వర్గాలే నమ్మకపోతే.. ఇక బయట సామాన్య జనం సంగతి సరేసరి.

Read Also: Off The Record: నాడు కాలు పెట్టనివ్వబోనన్న రేవంత్ రెడ్డికి నేడు రెడ్ కార్పెట్

మా మధ్య అలాంటి బంధాలేవీ లేవని చెప్పడంలో పార్టీ లీడర్స్‌ కేడర్‌ విఫలం అవుతున్నారు, జనం కూడా దాన్నే నమ్ముతున్నారన్నది రాజకీయవర్గాల అభిప్రాయం. వచ్చే ఎన్నికల నాటికి నియోజక వర్గాల పునర్విభజన జరుగుతుంది, బీఆర్‌ఎస్‌తో బీజేపీ పొత్తు ఉంటుంది, వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఇప్పటికీ బీజేపీలోని కొందరు నాయకులు నమ్ముతున్నారట. ఇటీవల హైదరాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి సంతోష్ ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అక్కడ కూడా ఈ పొత్తు ప్రస్తావన వచ్చినట్టు తెలిసింది. పొత్తు విషయంలో నాయకులు అడిగిన ప్రశ్నకు అలాంటివేం ఉండబోవని ఒకింత సీరియస్‌గానే సంతోష్‌ స్పష్టంగా చెప్పినట్టు తెలిసింది. ఎలాంటి అపోహలు వద్దని కూడా చెప్పేశారు బీఎల్‌. ఆ విషయం తెలిశాక పార్టీ కేడర్‌లో కొత్త చర్చ మొదలైంది. మనోళ్లు ఇప్పటికైనా నమ్ముతారా? లేక పార్టీ పెద్దలు హైదరాబాద్‌ వచ్చి అగ్నిప్రవేశం చేయాల్నా అంటూ సెటైర్స్‌ వేస్తున్నారు.

Exit mobile version