ఆ జిల్లాలో టీడీపీకి మరోసారి ఇబ్బందులు తప్పలేదు. పేరుకు ఎన్నికలు బహిష్కరణ అని చెప్పినా.. బ్యాలెట్ పేపరుపై పార్టీ సింబల్ ఉంది. అభ్యర్థులు ప్రచారం చేశారు. కానీ.. ఓట్లు రాలేదు. సెంటిమెంట్ పండలేదు. పార్టీ వర్గాల్లో ఇదే చర్చ. ఇంతకీ ఏంటా జిల్లా?
అధికారం కోల్పోయాక అసలు సంగతి గుర్తించారా?
టీడీపీ కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాలో కొన్నేళ్లుగా పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. 2014 ఎన్నికల వరకు పార్టీ పరిస్థితి బాగానే ఉన్నా.. అధికారంలోకి వచ్చాక డౌన్‌ఫాల్ మొదలైందన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. అప్పట్లో అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ సంగతి గమనించలేదు. 2019 అధికారం కోల్పోయాక కానీ అసలు సంగతి గుర్తించలేదు టీడీపీ నేతలు. అది మొదలు.. మొన్న జరిగిన పంచాయతీ, ఆ తర్వాత మున్సిపాలిటీ.. తాజాగా పరిషత్ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఓటమి చవిచూసింది తెలుగుదేశం.
26 మండలాల్లో టీడీపీకి ఒక్క ఎంపీటీసీ రాలేదు!
పెనుకొండ, ధర్మవరంలలో టీడీపీ వైట్‌వాష్..!
జిల్లాలో మొత్తం 841 ఎంపీటీసీ స్థానాల్లో 50 ఏకగ్రీవం అయ్యాయి. 49 వైసీపీ, ఒకటి టీడీపీకి దక్కాయి. ఎన్నికలు జరిగినచోట వైసీపీ 762 చోట్ల గెలిచింది. టీడీపీ 50, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ఒక్కోచోట గెలిచాయి. స్వతంత్రులు, రెబల్ అభ్యర్థుల ఖాతాలో మరో 15 పడ్డాయి. ఇక 62 జడ్పీటీసీలలో 60 చోట్ల వైసీపీదే విజయం. 26 మండలాల్లో కనీసం ఒక్కటంటే ఒక్క ఎంపీటీసీ కూడా టీడీపీ గెలవలేదు. 13 మండలాల్లో ఒక్కటి చొప్పున టీడీపీకి దక్కాయి. మిగిలిన మండలాల్లో రెండు నుంచి మొదలుకొని కాస్తో కూస్తో తెలుగుదేశం గెల్చుకుంది. పార్టీ బలంగా ఉన్న పెనుకొండ, ధర్మవరంలలో వైట్‌వాష్ అయింది టీడీపీ.
2009లో టీడీపీకి 29 జడ్పీటీసీలు, 387 ఎంపీటీసీలు
2014లో టీడీపీకి 45 జడ్పీటీసీ, 525 ఎంపీటీసీలు
గతంలో అధికారంలో లేని సమయంలో జిల్లాలో పరిషత్ ఎన్నికల్లో గట్టిపోరాటమే చేసింది టీడీపీ. 2009లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జిల్లాలో టీడీపీ 29 జడ్పీటీసీ, 387 ఎంపీటీసీలను కైవశం చేసుకుంది. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ పైచెయ్యి సాధించింది. 45 జడ్పీటీసీ, 525 ఎంపీటీసీలను దక్కించుకుంది. ఇక 2004 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ 6, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. 2004లో రెండు ఎంపీ సీట్లు కాంగ్రెస్ ఖాతాలో పడితే.. 2009లో ఒక ఎంపీ సీటును టీడీపీ గెల్చుకుంది. 2014లో రెండు ఎంపీ సీట్లు టీడీపీవే.12 అసెంబ్లీ సీట్లలో తెలుగుదేశం అభ్యర్థులు గెలిచారు. 2019 ఎన్నికల్లో పరిస్థితి తిరగబడింది. జిల్లాలో రెండు అసెంబ్లీ సీట్లకే టీడీపీ పరిమితమైంది. ఇప్పుడు పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో చప్పుడే లేదు.
మండలాల్లో గ్రూపు తగాదాలు శాపంగా మారాయా?
రాష్ట్రస్థాయిలో పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు టీడీపీ ప్రకటించింది. అయితే అప్పటికే నామినేషన్ల ఘట్టం ముగిసింది. దీంతో టీడీపీ అభ్యర్థులు అధికారికంగా పోటీలో ఉన్నట్టు అయింది. సైకిల్ గుర్తు చూస్తే ఓట్లు వేసే జిల్లాలో ఈ సారి ఆ సెంటిమెంట్ పండలేదు. పార్టీ బలంగా లేదా.. లేక కార్యకర్తలు బలంగా లేరా అంటే.. టీడీపీ కోసం ప్రాణాలు పెట్టి పనిచేసే వారు ఉన్నారు. అధిష్ఠానం ఎన్నికలను బహిష్కరించినా.. నేతలు మాత్రం ప్రచారం చేసుకున్నారు. అయితే చాలాచోట్ల మండలాల్లో గ్రూపు తగదాలు పార్టీకి శాపంగా మారాయి.
వరస ఓటములతో కేడర్‌లోనూ బెంగ!
నాయకులు కూడా కేడర్‌కు మద్దతుగా లేరట. దీంతో విషయం బోధపడిన కేడర్ సైలెంట్ అయిందనేది పార్టీ విశ్లేషణ. ఇలా వరసగా ఓటములు మూటకట్టుకుంటున్న టీడీపీ ఎప్పటికి కోలుకుంటుందోననే బెంగ కార్యకర్తల్లో కనిపిస్తోంది. నేతలు మాత్రం సార్వత్రిక ఎన్నికల్లో తఢాఖా చూపిస్తాం అన్నట్టు ఉన్నారు. కానీ గ్రామస్థాయిలోనే పార్టీ బలహీన పడితే భవిష్యత్ ఉంటుందా అని అనుమానాలు ఉన్నాయి.