NTV Telugu Site icon

తెరాసలో పెద్దల సభకు వెళ్ళేది ఎవరు..?

Pedda

Pedda

తెలంగాణలో అధికారపార్టీ టీఆర్ఎస్‌లో ఒక్కసారిగా వేడి పుట్టింది. దీనికి కారణం రాజ్యసభ ఉపఎన్నిక షెడ్యూల్‌ రావడమే. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్‌ను రాజీనామా చేయించి.. ఎమ్మెల్సీని చేశారు. దీంతో ఆ రాజ్యసభ స్థానానికి 2024 ఏప్రిల్‌ వరకు పదవీకాలం ఉండిపోయింది. ఆ భర్తీ ప్రక్రియలో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. దాంతో టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థి ఎవరు అనే అంశం చుట్టూ చర్చ ఊపందుకుంటోంది.

రెండేళ్లే పదవీకాలం ఉన్నప్పటికీ చాలామంది టీఆర్‌ఎస్‌ నేతలు ఈ రాజ్యసభ సీటును ఆశిస్తున్నారు. ఈ మధ్య కాలంలో టీఆర్‌ఎస్‌లో చేరిన వారితోపాటు.. పార్టీలో ముందు నుంచి ఉంటున్న నాయకులు.. పార్టీ అధినేత నుంచి హామీలు పొందినవాళ్లూ చాలామంది ప్రగతిభవన్‌ నుంచి వచ్చే పిలుపు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే గులాబీ శిబిరంలో రకరకాల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. బీసీ సామాజికవర్గానికి చెందిన బండ ప్రకాష్‌ రాజీనామా చేయడంతో.. ఆ సామాజికవర్గానికి చెందిన వారికే ఛాన్స్‌ ఇస్తారని కొందరి వాదన. కాదూ.. కొత్త సమీకరణాలు తెరపైకి వస్తాయనేది మరికొందరి అభిప్రాయం. అయితే మారే సమీకరణాలు ఎలా ఉంటాయన్నది ఉత్కంఠగా మారింది.

ప్రస్తుతం టీఆర్ఎస్‌ వర్గాల్లో చర్చల్లో ఉన్నవారిలో ఒక ఫార్మా కంపెనీ అధినేత పేరు నలుగుతోందట. అలాగే సీఎం కేసీఆర్‌కు మద్దతుగా ఉన్న ఒక సినీ నటుడి పేరు కూడా టాక్స్‌లో ఉంది. బీసీ, దళిత సామాజికవర్గాలకు చెందిన కీలక నాయకులు… తమకున్న ప్లస్సులు.. మైనస్సులతో లెక్కలేస్తున్నారు. పనిలో పనిగా పార్టీ పరిశీలనలో ఉన్న అంశాలపై ఆరా తీస్తున్నారట కొందరు నాయకులు. అయితే చివరి క్షణంలో తెరపైకి కొత్త పేర్లు రావొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్‌ జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ పెట్టింది. పలు ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నారు గులాబీ బాస్‌. ఇదే సమయంలో ఢిల్లీలో ఆయా పార్టీలతో మాట్లాడే నాయకుడికి ఈ ఉపఎన్నికలో ఛాన్స్‌ ఇవ్వొచ్చని అనుకుంటున్నారు. ఈ కోణంలోనూ కొందరు సీనియర్‌ టీఆర్ఎస్‌ నేతల పేర్లు చర్చల్లో ఉన్నాయి.

ఇప్పటికే పార్టీ అధినాయకత్వం అభ్యర్థి ఎంపికపై కొంత కసరత్తు పూర్తి చేసిందని.. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థి ప్రకటన ఉంటుందని సమాచారం. వచ్చే నెలలో తెలంగాణలో మరో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అక్కడ ఎంపిక చేసే అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుని.. ఉపఎన్నికలో క్యాండిడేట్‌ను ప్రకటిస్తారని తెలుస్తోంది. మరి.. గులాబీ శిబిరం నుంచి పెద్దల సభలకు వెళ్లే నాయకుడు ఎవరో వేచి చూడాల్సిందే.