NTV Telugu Site icon

YCP : పాలకొల్లులో వైసీపీ అభ్యర్థి ఎవరో ఇప్పుడే చెప్పేయాలట..!

Ysr

Ysr

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వైసీపీ రాజకీయం రసవత్తరంగా ఉంది. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ అభ్యర్థి ఎవరన్నదానిపై అప్పుడే చర్చ మొదలైంది. ఇక్కడ గత రెండు ఎన్నికల్లోనూ టీడీపీ గెలిచింది. దీంతో పాలకొల్లులో వైసీపీ వ్యూహం మారిపోయింది. గత మూడేళ్లుగా ఆ వ్యూహ రచనలో భాగంగా అనేక ఎత్తుగడలు వేసింది అధికారపార్టీ. అయితే పార్టీ కేడర్‌ ఆలోచన మరోలా ఉందట. వ్యూహాలు చాలు.. అభ్యర్థి ఎవరో ఇప్పుడే చెప్పేస్తే ఆ మేరకు పని మొదలుపెడతామని చెబుతున్నారట. ఇప్పటి నుంచి కసరత్తు చేస్తే కానీ.. ఫలితం సానుకూలంగా రాదని లోకల్‌ పార్టీ నేతలూ అభిప్రాయపడుతున్నారట.

పాలకొల్లు వైసీపీ ఇంఛార్జ్‌గా జడ్పీ ఛైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ ఉన్నారు. అలాగే అధికారపార్టీలో గ్రూపులూ ఎక్కువే. కలిసి సాగే పరిస్థితి లేదు. ఎవరి కుంపటి వారిదే. కవురు సారథ్యాన్ని వ్యతిరేకించేవాళ్లూ బలంగానే వాయిస్‌ వినిపిస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా కవురు ఇంటింటికీ వెళ్తున్నా.. పార్టీ నేతల నుంచి ఆయనకు సహకారం శూన్యం. దీంతో వైసీపీలో మరో చర్చ తెరపైకి తెస్తున్నారట.

పాలకొల్లులో పట్టు సాధించాలంటే జనంలోకి దూసుకెళ్లే నాయకుడు కావాలని.. బలమైన అభ్యర్థిని తెరపైకి తీసుకురావాలని చెబుతున్నారట. దీంతో ఇంఛార్జ్‌గా ఉన్న కవురు శ్రీనివాస్‌ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోరా అనే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. గతంలో కవురు ఆచంట అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. చివరి నిమిషంలో ఆ సీటును చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు ఇచ్చారు. ఇప్పుడు పాలకొల్లు విషయంలోనూ కవురుకు అదే రిపీట్‌ అవుతుందని చెవులు కొరుక్కుంటున్నారట.

నియోజకవర్గంలో టిడ్కో గృహాలకు సంబంధించి 7వేల కుటుంబాలు సందిగ్ధంలో ఉన్నాయి. ఈ సమస్య అధికారపార్టీ నేతలకు పాలకొల్లులో తలనొప్పిగా మారింది. గడపగడపలో వీటిపైనే స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అలాగే క్షత్రియ సామాజికవర్గానికి ఇంఛార్జ్‌ కవురు శ్రీనివాస్‌కు మధ్య గ్యాప్‌ వచ్చిందట. ఆ విషయం తెలిసినప్పటి నుంచి టికెట్‌ ఆశించేవాళ్లు పెరిగిపోయారు. ఇతర పార్టీల నుంచి వైసీపీ కండువా కప్పుకొన్న కొందరు తమదే టికెట్‌ అని అనుచరులకు చెబుతున్నారట. దీంతో పాలకొల్లు వైసీపీలో అభ్యర్థిపై కేడర్‌లో బీపీ పెరిగిపోతోందట. ఇప్పటికిప్పుడు పార్టీ అధిష్ఠానం క్యాండిడేట్‌ ఎవరన్నది క్లారిటీ ఇచ్చే పరిస్థితి లేకున్నా.. వైసీపీ శ్రేణుల ఆలోచనలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. మరి.. కవురు శ్రీనివాస్‌కే కాలం కలిసి వస్తుందో లేక మరో నాయకుడు తెరపైకి వస్తారో చూడాలి.