ఏపీలో బీజేపీ స్వరం పెంచిందా.. సవరించిందా? కమలనాథులు గేర్ మార్చడానికి కారణం ఏంటి? నిరసనల పేరుతో ప్రభుత్వంపై ఘాటైన విమర్శల వెనక ఏదైనా వ్యూహం ఉందా? లెట్స్ వాచ్!
నిరసనలతో ప్రజల అటెన్షన్ కోసం బీజేపీ యత్నం
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ దూకుడు తగ్గింది. ప్రజా సమస్యలపై నాయకులు ప్రకటనలు ఇస్తున్నారు తప్ప పోరాటాలు చేయడం లేదు. కరోనా కారణమో ఏమో మునుపటి స్పీడ్ లేదు. దీనికితోడు పార్టీలోనూ పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయట. అందుకే పోరాటాలలో నామమాత్రంగా ఉండిపోయామన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో ఉందట. దీంతో ఫ్రేమ్‌లోకి రావడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. నిరసనల చేపట్టే బాధ్యత తీసుకుంది. ఉన్నంతలో కాస్తో కూస్తో రోడ్డెక్కుతున్నారు బీజేపీ నాయకులు.
ఏపీ ప్రభుత్వంపై జీవీఎల్, వీర్రాజు విమర్శలు
ఏపీలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో మొదట నిరసనలకు దిగింది బీజేపీ. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆందోళన చేశారు పార్టీ నాయకులు. బీజేపీ కార్యాలయాలు.. నివాసాల్లోనే బైఠాయించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ నిరసనల తర్వాత ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆపై రాష్ట్రంలో నూతన ఆస్తిపన్నుపైనా పోరాటం చేసింది బీజేపీ. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో నాయకులు వినతిపత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ జీవీఎల్, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజులు ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు కూడా. రాష్ట్రంలో గిల్లుడు, బాదుడు అని కొత్త పథకాలు పెట్టారని విరుచుకుపడ్డారు.
ప్రజా సమస్యలపై పోరాటాలకు బీజేపీ నిర్ణయం
ధాన్యం, ఆస్తి పన్నుల అంశాల్లో టీడీపీ నుంచి నిరసనలు లేవు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండటం.. కోవిడ్ కారణంగా పార్టీలోని ముఖ్య నాయకులు బయటకు రావడానికి ఇష్ట పడకపోవడంతో.. ఆ లోటును భర్తీ చేసి… ప్రజల అటెన్షన్ తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. సీరియస్ సమస్యలపై వెంటనే స్పందించేలా ప్లాన్ చేస్తున్నారు కమలనాథులు. కొద్దిరోజుల క్రితం విజయవాడలో జరిగిన ముఖ్యనేతల సమావేశంలో ప్రజా సమస్యలపై పోరాటాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారట. ఆ భేటీలోని నిర్ణయాల ప్రకారం పాలనా అంశాలు.. ప్రజా సమస్యలపై గేర్ మార్చింది బీజేపీ.
ప్రజాపక్షం అనే ట్యాగ్‌లైన్ తగిలించుకున్నారా?
గతంలో ప్రభుత్వంపై విమర్శలు చెయ్యాలంటే బీజేపీ నేతలు ఆచితూచి వ్యవహరించేవారు. ఒకవేళ ఏదైనా తిట్టిపోసినా.. ముందు చంద్రబాబును నాలుగు మాటలు అన్న తర్వాతనే సీఎం జగన్ పేరు ఎత్తేవారు. ఈ మధ్యకాలంలో నేతల తీరులోనూ తేడా కనిపిస్తోంది. ముఖ్యంగా సీఎం జగన్ ఢిల్లీ తర్వాత ముఖ్యమంత్రికి కేంద్ర పెద్దల అండ ఉందనే వాదన విస్తృతమైంది. ఆ ప్రచారం బీజేపీ ఎదుగుదలకు డ్యామేజీగా భావించారట పార్టీ నేతలు. అందుకే నిరసనల హోరు.. జోరు పెంచారనే వారు లేకపోలేదు. ఎన్నడూ లేని విధంగా ఎంపీ జీవీఎల్ కూడా ప్రభుత్వాన్ని గట్టిగానే టార్గెట్ చేశారని అనుకుంటున్నారట. ధాన్యం విషయంలో మంత్రుల వాటాలు ఎంత అని సోము వీర్రాజు ప్రశ్నించారు. మొత్తానికి మేం ప్రజాపక్షం అనే ట్యాగ్‌లైన్ తగిలించుకుని కథ నడుపుతున్నారు కమలనాథులు. మరి.. ఈ వ్యూహం ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.