NTV Telugu Site icon

పీజేఆర్ తనయుడు ఏం చేస్తున్నారు ? పాలిటిక్స్ కు దూరమా ?

Out

Out

కాంగ్రెస్‌లో పి. జనార్దన్‌రెడ్డి వారసుడిగా విష్ణువర్దన్‌రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. పీజేఆర్‌ మరణంతో జరిగిన ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు విష్ణు. తర్వాత నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో జూబ్లీహిల్స్‌ నుంచి పోటీ చేసి మరోసారి అసెంబ్లీకిలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికలు విష్ణుకు కలిసిరాలేదనే చెప్పాలి. 2014 మూడోస్థానంలో నిలిచిన ఈ యువనేత.. 2018లో మళ్లీ పుంజుకున్నా.. రెండోస్థానానికే పరిమితం అయ్యారు. రెండు వరస ఓటములు కుంగదీశాయో ఏమో.. తర్వాత కాంగ్రెస్‌ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించింది లేదు ఈ మాజీ ఎమ్మెల్యే.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పీజేఆర్‌కి ఫాలోయింగ్ ఉంది. విష్ణు దాన్ని క్యాచ్‌ చేసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్‌లో విష్ణుకు ఆత్మీయులు ఉన్నా.. ఆయన మాత్రం కొన్నాళ్లుగా అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శ ఉంది. దీంతో కాంగ్రెస్‌ నాయకత్వం కూడా ఈ మాజీ ఎమ్మెల్యే విషయంలో ఆలోచనలో పడినట్టు ప్రచారం జరుగుతోంది.

రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌ అయ్యాక.. PJR ఇంటికి వెళ్లారు. కాంగ్రెస్‌లో మళ్లీ చురుకైన పాత్ర పోషించాలని విష్ణును కోరారు రేవంత్‌. కానీ.. ఎలాంటి మార్పు లేదట. పార్టీ సభ్యత్వ నమోదును కూడా సీరియస్‌గా తీసుకోలేదని చెబుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇటీవల కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. హైదరాబాద్‌ వస్తే.. ఆ టూర్‌లో ఎక్కడా విష్ణు కనిపించలేదు. ఒకప్పుడు గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ అంటే.. PJR, ముఖేష్‌గౌడ్‌, దానం నాగేందర్‌ అనేట్టు ఉండేది. ఇప్పుడు ముఖేష్‌గౌడ్‌ లేరు. దానం నాగేందర్‌ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే. ఇక PJR వారసుడిగా పార్టీలో లీడ్‌ రోల్‌ పోషించాల్సిన విష్ణువర్దన్‌రెడ్డి.. ఎందుకు సైలెంట్‌గా ఉన్నారన్నది కేడర్‌ ప్రశ్న. రాహుల్‌ గాంధీ వచ్చినా ఎందుకు కనిపించలేదని ప్రశ్నిస్తున్నారు.

గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశానికి రాహుల్‌ గాంధీ హాజరైతే.. ఆ కార్యక్రమానికి విష్ణువర్దన్‌రెడ్డి వస్తారని ఒక సీటు కేటాయించారు. కానీ.. ఈ మాజీ ఎమ్మెల్యే ఆ ఛాయలకే రాలేదు. దీంతో గ్రేటర్‌ కాంగ్రెస్‌కు చెందిన ఒకరిద్దరు కాంగ్రెస్‌ నాయకులు.. ఈ విషయాన్ని AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ దృష్టికి తీసుకెళ్లారట.
రాహుల్ పర్యటనకే దూరంగా ఉంటే.. ఇక నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? నాయకుల పిల్లల కోసం నియోజకవర్గాలు కేటాయిస్తారు.. వాళ్లేమో పార్టీని పట్టించుకోవడం లేదనే ఠాగూర్‌ దగ్గర చర్చించినట్టు సమాచారం.

కాంగ్రెస్‌లో PJRకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ స్థాయిలో పీజేఆర్‌ తనయుడు విష్ణు ఉండటం లేదనేది పార్టీ వర్గాల మాట. రాజకీయాలకు అంటీముట్టనట్టు ఉండాలని అనుకుంటున్నారా? లేక మరేదైనా ఆలోచన ఉందో కానీ.. కాంగ్రెస్‌కు అవుటాఫ్‌ కవరేజ్‌ ఏరియాలో ఉన్నారన్న ప్రచారం మాత్రం ఆసక్తి రేకెత్తిస్తోంది.