Site icon NTV Telugu

TDP : ఆ ఎపిసోడ్ లో టీడీపీ, వైసీపీ సాధించిందేంటి.? ఎవరికీ కలిసొచ్చింది.?

New Project (6)

New Project (6)

ఏపీలో అధికార వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రాజకీయ వైరం పీక్స్‌కు చేరుకుంది. ఇటీవల వెల్లడైన పదోతరగతి ఫలితాలపైనా రెండు పార్టీలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో పదో తరగతి విద్యార్ధులతో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు టీడీపీ నేత నారా లోకేష్‌. అయితే టీడీపీ పొలిటికల్‌ స్క్రీన్‌పై వైసీపీ నేతలు ప్రత్యక్షం కావడంతో రచ్చ రచ్చ అయింది. టీడీపీ అంటే ఒంటికాలిపై లేచే మాజీ మంత్రి కొడాలి నాని.. టీడీపీ నుంచి గెలిచి.. వైసీపీకి జైకొట్టిన వల్లభనేని వంశీతోపాటు.. మరికొందరు అధికారపార్టీ నాయకులు ఆ లాగిన్‌లో కనిపించారు. రోజంతా ఈ ఎపిసోడ్‌పై హైడ్రామా నడిచింది. అయితే ఈ రచ్చ ఎవరికి కలిసొచ్చింది అన్నదే ప్రశ్న.

వైసీపీ ఒక పద్దతి లేకుండా చేసిందనేది టీడీపీ ఆరోపణ. సీరియస్‌ అంశాన్ని నాన్‌ సీరియస్‌గా తీసుకుని అధికారపార్టీ పరువు పోగొట్టుకుందని టీడీపీ ఆరోపించింది. జూమ్‌ మీటింగ్‌లో కాదు.. నేరుగా వస్తే చర్చించడానికి రెడీ అన్నారు లోకేష్‌. ఈ క్రమంలో టీడీపీ మద్దతుగా అచ్చెన్నాయుడు మొదులకొని పలువురు తెలుగుదేశం నాయకులు మాటల తూటాలు పేల్చారు. అయితే ఈ విషయంలో వైసీపీ వాదన మరోలా ఉంది. పదో తరగతి ఫలితాలను రాజకీయం చేయాలని చూసిన టీడీపీ ప్రయత్నాన్ని సక్సెస్‌ ఫుల్‌గా అడ్డుకున్నామన్నది అధికారపార్టీ నేతల వాదన. జూమ్‌ మీటింగ్‌లో తమతో చర్చించకుండా.. భయపడి లోకేష్‌ పారిపోయారని విమర్శ వేడి పెంచారు. పరీక్షా ఫలితాలను పొలిటికలైజ్‌ చేస్తే ఉపేక్షించేది లేదని వార్నింగ్సూ ఇచ్చారు.

అయితే ఈ ఎపిసోడ్‌లో విద్యార్థుల తల్లిదండ్రుల వాదన ఇంకోలా ఉంది. పిల్లల భవిష్యత్‌కు సంబంధించిన అంశంలో రాజకీయ గోల ఏంటన్నది వారి ప్రశ్న. కానీ.. టీడీపీ, వైసీపీ నేతల మాటల దాడిలో వారి వాయిస్‌కు బలం లేకుండా పోయింది. రోజంతా రాజకీయ చర్చ.. రచ్చకే సమయం సరిపోయింది. ఈ రగడలో మరో వాదన కూడా వినిపిస్తోంది. లోకేష్‌ చేపట్టిన జూమ్‌ మీటింగ్‌ గురించి ముందే తెలుసుకున్న వైసీపీలోని ఒక సీనియర్ నేత స్కెచ్‌ వేశారట. విద్యార్థులతోపాటు జూమ్‌ ద్వారా మీటింగ్‌లో పాల్గొని.. లోకేష్‌ వాదనేంటో విని ప్రభుత్వ విధానాన్ని చెప్పాలని అనుకున్నారట. ఆ వెనువెంటనే కొడాలి నాని, వల్లభనేని వంశీతోపాటు ఇతర నేతలకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. కొందరు విద్యార్థులను వారే ఎంపిక చేశారట. పైగా టీడీపీ వేదికగా.. పార్టీ జెండాలు పట్టుకుని లోకేష్‌ జూమ్‌ మీటింగ్‌లోకి రావడంతో వైసీపీ మరింత అలర్ట్‌ అయినట్టు తెలుస్తోంది. మీటింగ్‌ ప్రారంభమైన కాసేపటికే మా అంకుల్‌ అన్నయ్యలు మాట్లాడతారని విద్యార్థులు కొడాలి నాని, వల్లభనేని వంశీలకు మైకులు అందజేశారు. మొత్తానికి ఈ ప్లాన్‌ను వైసీపీ సోషల్ మీడియా వింగ్‌ కూడా తమ వంతు సహకారం అందించిందట.

 

 

Exit mobile version