Site icon NTV Telugu

హుజురాబాద్ కు వరంగల్ నేతల క్యూ..!

హుజురాబాద్‌పై వరంగల్ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు ఫోకస్ పెట్టారా? ఆ నియోజకవర్గంలో వరస పర్యటనలు చేస్తున్నారా? ఉపఎన్నికలో ఓరుగల్లు అధికారాపార్టీ నాయకులే కీలకం కాబోతున్నారా? క్షేత్రస్థాయిలో అసలేం జరుగుతోంది? లెట్స్‌ వాచ్‌!

హుజురాబాద్‌లో మోహరించిన ఓరుగల్లు టీఆర్‌ఎస్‌ నేతలు

తెలంగాణలో త్వరలో ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గం హుజురాబాద్‌. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో ఇక్కడ ఉపఎన్నిక రాబోతుంది. ఈ నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఉన్నా.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు ఆనుకుని ఉంటుంది. అందుకే ఈ ఉపపోరును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్‌.. అక్కడ అన్ని విధాలుగా మోహరిస్తోంది. ఇందులో భాగంగా వరంగల్‌ జిల్లా నాయకులను రంగంలోకి దించి.. హుజురాబాద్‌లోని పార్టీ నాయకులు ఎవరూ జారిపోకుండా చర్యలు చేపట్టిందట.

వరంగల్‌ నేతలే కీలక భూమిక?

గులాబీపార్టీ పెద్దల ఆదేశాలతో వరంగల్‌ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌, ఆరూరి రమేష్‌, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బస్వరాజు సారయ్యలు అక్కడికి వెళ్లి ఎన్నికల వ్యూహ రచన చేస్తున్నారు. మాజీ మంత్రి ఈటలపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు ప్రజాప్రతినిధులు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హడావిడి చూసిన తర్వాత హుజురాబాద్‌ ఉపఎన్నికలో వరంగల్‌ నేతలే కీలక పాత్ర పోషిస్తారని కేడర్‌ భావిస్తోంది.

కమలాపూర్‌ మండలంపై చల్లా ధర్మారెడ్డి నజర్‌!

హుజురాబాద్‌ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కీలకమైన మూడు మండలాలకు వరంగల్‌ జిల్లా నాయకులే ఇంఛార్జులుగా ఉంటున్నారట. అధిష్ఠానం ఆదేశాలతో అక్కడ ప్రచారానికి శ్రీకారం చుట్టేశారు. హుజురాబాద్‌కు ఆనుకునే పరకాల సెగ్మంట్‌ ఉంటుంది. అందుకే ఈటల ఎపిసోడ్‌ మొదలుకాగానే పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అక్కడ ఫోకస్‌ పెట్టారట. కమలాపూర్‌ మండల పరిధిలోని గ్రామాల్లో కార్యకర్తలతో నిరంతరం టచ్‌లో ఉంటున్నట్టు సమాచారం. పలు ధపాలుగా వారితో మాంతనాలు జరిపిట్టు తెలుస్తోంది.

జమ్మికుంటపై ఆరూరి రమేష్‌ ఫోకస్‌
వీణవంక మండలంలో పెద్ది సుదర్శన్‌ ప్రచారం

జమ్మికుంటకు ఆనుకుని ఉండే నియోజకవర్గం వర్ధన్నపేట. దీంతో ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ జమ్మికుంటపై దృష్టి పెట్టారట. గతంలో కరీంనగర్‌ జిల్లా ఇంఛార్జ్‌గా ఉన్న ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సైతం అక్కడ పర్యటిస్తున్నట్టు చెబుతున్నారు. వీణవంక మండలంలో మరో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి గ్రౌండ్‌ వర్క్‌ ప్రిపేర్‌ చేస్తున్నారట. ఇప్పటికే హుజురాబాద్‌ ఉపఎన్నికపై మంత్రి హరీష్‌రావు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌లు పూర్తిస్థాయిలో అక్కడి పార్టీ నేతలను గైడ్‌ చేస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు హుజురాబాద్‌లో పనిచేస్తున్న ఓరుగల్లు టీఆర్‌ఎస్‌ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నట్టు టాక్‌.

ఈటల లక్ష్యంగా నేతల విమర్శలు..సవాళ్లు

ఎవరికి అప్పగించిన మండలాల్లో వారు పర్యటిస్తూనే రోజుకో ప్రెస్‌మీట్‌తో ఈటలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు నాయకులు. అభివృద్ధి కార్యక్రమాలతోపాటు పార్టీ అంశాలపైనా కౌంటర్లు.. సవాళ్లు విసురుతున్నారు. వారం పదిరోజుల్లో జిల్లాకు చెందిన మరో పదిమంది కీలక నాయకులు హుజురాబాద్‌ వెళ్తారని తెలుస్తోంది. గ్రామస్థాయి నుంచే టీఆర్‌ఎస్‌ గెలుపునకు వ్యూహ రచన చేస్తారని సమాచారం.

Exit mobile version