Site icon NTV Telugu

Vijayawada Central Off The Record: సెంటర్ లో సడేమియా.. ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ

Central 1

Central 1

విజయవాడ సెంట్రల్‌లో వైసీపీ రాజకీయం రసకందాయంలో పడుతోంది. ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీల మధ్య విభేదాలు మలుపులు తిరుగుతున్నాయి. అధికారపార్టీ నేతల ఎత్తుగడలతో ఆసక్తిగా మారుతున్నాయి పరిణామాలు. ఇంతకీ ఎవరా ప్రజాప్రతినిధులు? ఏమా రగడ?

ఇద్దరి మధ్య గ్యాప్‌ పెరుగుతోందా?
మల్లాది విష్ణు. విజయవాడ సెంట్రల్‌ వైసీపీ ఎమ్మెల్యే. ఇదే నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ రుహుల్లా. ఇద్దరూ అధికారపార్టీ నేతలే అయినా.. సీనియర్‌.. జూనియర్‌ ఇగోలో.. భవిష్యత్‌ రాజకీయ ఎత్తుగడలో కానీ.. సెంట్రల్‌లో రసవత్తరంగా మారుతోంది రాజకీయం. రుహుల్లా తల్లి కరీమున్నీసా ఎమ్మెల్సీగా ఉన్నంత వరకు ఎలాంటి అలజడి లేదు. ఆమె ఆకస్మిక మరణంతో కరీమున్నీసా కుమారుడు రుహుల్లా ఎమ్మెల్సీ అయ్యారు. ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్సీకే అగ్రాసనం ఉంటుంది. ఇది మల్లాది విష్ణుకు రుచించలేదో ఏమో పరిణామాలు మారిపోయినట్టు చెబుతున్నారు. అలా వచ్చిన గ్యాప్‌ పెరుగుతుందే తప్ప తరగడం లేదట.

ఎమ్మెల్సీ నీడ పడకుండా ఎమ్మెల్యే ఎత్తుగడ?
ఎమ్మెల్యే హోదాలో విజయవాడ సెంట్రల్‌లో మల్లాది విష్ణు చేపడుతున్న కార్యక్రమాల ఆహ్వాన పత్రికల్లో ఎమ్మెల్సీ రుహుల్లా పేర్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అది గమనించిన ఎమ్మెల్సీ సైతం కౌంటర్‌ పాలిటిక్స్‌కు తెరతీశారట. ఇలా ఇద్దరు ప్రజాప్రతినిధులు రచిస్తున్న వ్యూహాలతో అధికార పార్టీ రాజకీయం వేడెక్కుతోంది. రుహుల్లా సైతం నియోజకవర్గంలో నిర్వహించే కార్యక్రమాలు.. అభివృద్ధి పనుల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారట. అనుచరులకు పెద్దపీట వేయాలని ఒత్తిడి చేస్తున్నారట. కొన్ని పనులకు సంబంధించి విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫీసుకు వెళ్లి.. అక్కడే కూర్చుని అవి అయ్యే వరకు కదలడం లేదట ఎమ్మెల్సీ. సెంట్రల్‌ పరిధిలోని కొందరు వైసీపీ కార్పొరేటర్లను కూడా తనవైపునకు తిప్పుకొంటున్నారట.

 

విష్ణుపై సొంత పార్టీ నేతల ఆరోపణలు
ఇదే సమయంలో ఎమ్మెల్యే విష్ణుపైనా ఆరోపణలు చేస్తున్నారట సొంత పార్టీ నేతలు. సెంట్రల్‌లో కీలక నేతలు.. కార్యకర్తలను కాదని.. వేరేవారికి పదవులు కట్టబెడుతున్నారనేది ఆయనపై ప్రధాన ఆరోపణ. పార్టీ మారి వచ్చిన వారికి పెద్ద పీట వేస్తున్నారట. గడిచిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కొందరికి టికెట్లు రాకుండా అడ్డుకున్నారని మండిపడుతున్నారట. ఇలాంటి వాటిని రుహుల్లా తనకు అనుకూలంగా మలుచుకుంటున్నట్టు సమాచారం. టిట్‌ ఫర్‌ టాట్ అన్నట్టుగా ఎమ్మెల్సీ పాల్గొన్నే కొన్ని కార్యక్రమాలకు ఎమ్మెల్యే విష్ణును ఆహ్వానించడం లేదట.

కరీమున్నీసా వర్ధంతి సభకు వెళ్లని విష్ణు..!
కొన్నాళ్లుగా ఈ ఆధిపత్యపోరు గట్టుగా సాగినా.. ఇటీవల కరీమున్నీసా వర్ధంతికి విష్ణు వెళ్లకపోవడంతో వ్యవహారం బయటపడింది. విష్ణు కావాలనే వెళ్లలేదనే విమర్శలు వినిపించాయి. అయితే ఇంట్లో శుభకార్యం ఉన్నందునే వెళ్లలేదని విష్ణు వర్గం చెబుతున్నా.. ప్రత్యర్థి శిబిరానికి అది పెద్దగా కనెక్ట్‌ కావడం లేదట. మైనారిటీలు అంటే ఎమ్మెల్యేకు చిన్న చూపు అనే చర్చను తెరపైకి తెస్తున్నారట. దీంతో ఇద్దరి మధ్య వివాదం చినికి చినికి గాలి వానగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయట.

సెంట్రల్‌ పరిణామాలపై అధిష్ఠానం నజర్‌..!
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య రగడ.. సెంట్రల్‌ నియోజకవర్గానికే పరిమితం అయితే ఓకే కానీ.. మిగిలిన సెగ్మెంట్లకు పాకితే ఎలా అనేది వైసీపీ కేడర్‌ ప్రశ్న. నామినేటెడ్ పదవిలో కొనసాగుతున్న సెంట్రల్‌ నియోజకవర్గానికి చెందిన కీలక నేత మద్దతు రుహుల్లాకు ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక్కడి పరిణామాలపై పార్టీ అధిష్ఠానం ఒక కన్నేసినట్టు సమాచారం. మరి.. ఇద్దరు ముఖ్యనేతల మధ్య విభేదాలు శ్రుతిమించి రోడ్డున పడకుండా ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

Exit mobile version