ఆ పదవి నుంచి ఎవరు ఉంటారో.. మరెవరు పోతారో తెలియదు. కోర్టు నిర్ణయం.. మెడమీద కత్తిలా వేళ్లాడుతోంది. కంటిపై కునుకు లేకుండా చేస్తోందట. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం.
హైకోర్టు విచారణతో సభ్యుల ఉలికిపాటు
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా మారిపోయింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుల పరిస్థితి. ప్రస్తుత రోజుల్లో టీటీడీ బోర్డులో సభ్యుడంటే ఆషామాషీ విషయం కాదు. ఎక్కడెక్కడ నుంచో సిఫారసులు వస్తున్నాయి. పారిశ్రామిక వేత్తలూ పోటీపడుతున్నారు. గతంలో దక్షిణాది రాష్ట్రాలకే పరమితమైన బోర్డు నియామకం.. ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకు విస్తరించింది. దీంతో పాలకమండలి నియామకం అంటే.. ఎవరి నుంచి సిఫారసులు వస్తాయో అంచనా వేయలేని పరిస్థితి. తాజా పాలకమండలి బాధ్యతలు చేపట్టి నెలలు గడుస్తున్నా.. కోవిడ్ కారణంగా పూర్తిస్థాయిలో సభ్యులు తమ అధికారాలను ఉపయోగించుకోలేదు. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొనడంతో పదవిని పూర్తిగా అనుభవించొచ్చన్న ఆలోచనలో సభ్యులు ఉన్నారు. కానీ.. వారి ఆశలపై నీళ్లు చల్లేలా కోర్టు విచారణ బిగుసుకుంటోంది. ఆ విషయం తెలిసినప్పుడల్లా కొందరు సభ్యులు ఉలిక్కిపడుతున్నారట.
19న జరిగే విచారణపై సభ్యుల్లో టెన్షన్
నేర చరితులకు పాలకమండలిలో చోటు కల్పించారు అంటు కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన వాఖ్యలే ప్రస్తుతం సభ్యులను టెన్షన్ పెడుతున్నాయి. ఒక్క టీటీడీపై వేసిన పిటిషన్‌లోనే కాకుండా.. అహోబిలం కేసు విచారణ సందర్భంగా కూడా తిరుమల ప్రస్తావన తీసుకొచ్చి కొన్ని వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. దీంతో 16 మంది వరకు సభ్యులు ఆందోళనలో ఉన్నట్టు సమాచారం. 10 మంది పాలకమండలి సభ్యులు పై కేసులు ఉన్నాయని.. మరో ఆరుగురు సభ్యుల నియామకం రాజకీయ ప్రేరేపితమని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వారిని అనర్హులుగా ప్రకటించాలన్నది డిమాండ్. ఈ నెల 19న మరోసారి పిటిషన్ విచారణకు వస్తుండటంతో.. ఏం జరుగుతుందా అనే టెన్షన్ ఉందట.
సిఫారసులు చేయించుకున్న సభ్యుల పరిస్థితి ఏంటి?
ఒకవేళ కోర్టు అనర్హులుగా ప్రకటిస్తే.. రాక రాక వచ్చిన పదవి పోతుందని టీటీటీ సభ్యులు కలవర పడుతున్నారట. విచారణ సందర్భంగా టీటీడీలో నేర చరితుల గురించి తమకు తెలుసన్న న్యాయస్థానం కామెంట్స్ చుట్టూనే ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎక్కడెక్కడి నుంచో సిఫారసులు చేయించుకుని.. బోర్డులో పదవి సంపాదించిన వాళ్లు భవిష్యత్ ఏంటో తెలియక సతమతం అవుతున్నారట.
