Site icon NTV Telugu

జిల్లా అధ్యక్షుల పదవులపై తేల్చుకోలేకపోతున్న టీఆర్ఎస్‌..!

ఆ పదవుల భర్తీపై టీఆర్ఎస్ తేల్చుకోలేకపోతుందా..? ఒకసారి జిల్లా అధ్యక్షుల నియామకం చేయాలని.. మరోసారి జిల్లాకు కోఆర్డినేటర్ల నియామకం సరిపోతుందని ఎందుకు భావిస్తోంది? జిల్లాస్థాయిలో గులాబీపార్టీ ఎందుకు ఆచితూచి అడుగులు వేస్తోంది?

అప్పట్లో జిల్లా అధ్యక్షుల నియామకంపై టీఆర్ఎస్‌లో చర్చ..!

జెండా పండుగతోపాటు పార్టీ సంస్థగత నిర్మాణాన్ని మొదలు పెట్టింది టీఆర్ఎస్. గ్రామ, మండల, మున్సిపాలిటీలలో పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తయింది. పార్టీ నిర్మాణంలో భాగంగా జిల్లా అధ్యక్షులను నియమించాలని గులాబీ పెద్దలు అభిప్రాయపడ్డారు. గతంలోనే జిల్లాస్థాయిలో పార్టీకి అధ్యక్షులు ఉండాలో లేక కోఆర్డినేటర్‌ సరిపోతారా అన్నదారిపై కొంత చర్చ జరిగింది. ఆ చర్చకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ కొద్దినెలల క్రితం జిల్లా అధ్యక్షుల నియామకం ఉంటుందని ప్రకటన వచ్చింది. ఈ పదవి చేపట్టాలని జిల్లాల స్థాయిలో లాబీయింగ్‌లు మొదలయ్యాయి. పైరవీలు.. పేర్లు.. చర్చలు.. రచ్చలు నడిచాయి. పలానా వారికే పదవి అంటూ ప్రచారం జరిగింది కూడా.

అధ్యక్షులను నియమిస్తే తగాదాలు వస్తాయా?
జిల్లాకు టీఆర్ఎస్‌ కోఆర్డినేటర్లను నియమిస్తారా?

ఇప్పుడు టీఆర్ఎస్‌కు జిల్లా అధ్యక్షుల స్థానంలో పార్టీకి కోఆర్డినేటర్‌ను నియమించాలనే ఆలోచన ఉన్నట్టు గులాబీ శిబిరం నుంచి బయటకొచ్చింది. జిల్లాస్థాయిలో అధ్యక్షుడు ఉంటే గ్రూపులు, వాటితో తగాదాలు వస్తాయని.. అవి పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని టీఆర్ఎస్‌ వర్గాల అనుమానం. అధికార పార్టీలో మొదటి నుంచి నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సుప్రీం.


ఒకవేళ జిల్లా అధ్యక్షుల నియామకం చేపడితే.. సమాంతరంగా మరో వ్యవస్థతో సమస్యలు రావచ్చని అనుకుంటున్నారట. ఇప్పటికే కొత్త.. పాత నేతలు ఉన్నచోట.. రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధులున్న నియోజక వర్గాలలో గ్రూప్ తగాదాలు టీఆర్ఎస్‌కు ఇబ్బందిగా మారుతున్నాయి. ఇలాంటి తరుణంలో జిల్లా అధ్యక్షుడు లేదా జిల్లాకు కోఆర్డినేటర్‌ను నియమిస్తే ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోందట. అయితే జిల్లా స్థాయిలో నాయకత్వం ఉంటేనే పార్టీకి మంచిదన్న వాదన ఉందట.

వారం పదిరోజుల్లోనే టీఆర్ఎస్‌ క్లారిటీ ఇస్తుందా?

తాజాగా జరిగిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో జిల్లా స్థాయి పార్టీ పదవుల నియామకాల అంశాన్ని గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. వారం.. పదిరోజుల్లో ఈ అంశంపై క్లారిటీ ఉంటుందని సమాచారం. అయితే టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులను నియమిస్తుందా లేక కోఆర్డినేటర్లతో సరిపెడుతుందో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇన్నాళ్లూ నామినేటెడ్‌ పదవులపై ఆశలు పెట్టుకుని.. అవి దక్కని వాళ్లు.. కనీసం జిల్లా స్థాయిలో పార్టీ పదవి వచ్చినా చాలనే భావనలో ఉన్నారట. అలాంటివాళ్లంతా పార్టీ ప్రకటన కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

Exit mobile version