Site icon NTV Telugu

జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మిపై టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు గరంగరం..!

మేడమ్‌ బాగా బిజీ. విపక్షాలకే కాదు.. అధికారపక్షానికి కూడా అందుబాటులో ఉండరట. ఇన్నాళ్లూ ఈ అంశంపై లోలోనే మథన పడుతున్న స్వపక్షీయులు.. టైమ్‌ రాగానే ఫిర్యాదు చేసేశారు. అదికూడా.. మేడమ్‌ సమక్షంలోనే చెప్పాల్సినవి చెప్పేయడంతో.. ఈ ఎపిసోడ్‌ అధికారపార్టీలో ఆసక్తికర చర్చగా మారింది.

మేయర్‌పై సొంతపార్టీ కార్పొరేటర్లే గుర్రు..!

గద్వాల విజయలక్ష్మి. గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌. మహానగరంలో కీలక పదవిలో ఉన్నారామె. సిటీలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా.. స్పందించాల్సింది నగర ప్రథమ పౌరురాలిగా విజయలక్ష్మే. కానీ.. ఆమె తీరు అధికారపార్టీలోనే చర్చగా మారుతోంది. అదికాస్తా ఇటీవల జరిగిన పార్టీ మీటింగ్‌లో బరస్ట్‌ కావడంతో మేయర్‌పై టీఆర్ఎస్‌ కార్పొరేటర్లలో ఉన్న అసంతృప్తి బయటపడింది.

మేయర్‌పై వరసపెట్టి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్‌ కార్పొరేటర్లు..!

GHMC కౌన్సిల్‌ మీటింగ్‌ ఉండటంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లోని సమస్యలు.. ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలి.. కౌన్సిల్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై తెలంగాణ భవన్‌లో GHMC ప్రజాప్రతినిధులతో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌కు మేయర్‌ విజయలక్ష్మితోపాటు టీఆర్ఎస్‌ కార్పొరేటర్లు వచ్చారు. కౌన్సిల్‌ మీటింగ్‌లో విపక్షాల ప్రశ్నలకు దీటుగా సమాధానం చెప్పాలని నిర్ణయించారు. సమావేశం సజావుగా సాగుతున్న సమయంలో మేయర్‌ తీరు సరిగా లేదని కొందరు కార్పొరేటర్లు గట్టిగానే ఫిర్యాదుల పర్వం అందుకున్నారు. దాంతో సమావేశం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయిందట. మీటింగ్‌లో ఉన్న మేయర్‌తోపాటు ఇతరుల ముఖాల్లో ఆందోళన కనిపించిందట.

పార్టీ సీరియస్‌గా తీసుకోవాలని కోరిన కార్పొరేటర్లు..!

సమస్యలపై మాట్లాడదామంటే మేయర్‌ విజయలక్ష్మి అందుబాటులో ఉండబోరని టీఆర్ఎస్‌ కార్పొరేటర్లు చేసిన ఆరోపణల్లో ప్రధానమైంది. ఇలా ఒకరి తర్వాత ఒకరుగా పార్టీ కార్పొరేటర్లు స్వరం పెంచడంతో గందరగోళానికి దారితీసింది. ఈ విషయాన్ని పార్టీ సీరియస్‌గా తీసుకోవాలని చెప్పడంతో.. వారికి సర్ది చెప్పడానికే మంత్రికి టైమ్‌ పట్టిందట. ఇప్పటికే సమస్యల పరిష్కారానికి మేయర్‌ టైమ్‌ కేటాయించడం లేదని బీజేపీ, కాంగ్రెస్‌ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఆ మధ్య ఇదే ఆరోపణతో మేయర్‌ ఛాంబర్‌ను ముట్టడించారు బీజేపీ కార్పొరేటర్లు.. కార్యకర్తలు. ఇప్పుడు టీఆర్ఎస్‌ కార్పొరేటర్ల వంతు రావడంతో అధికారపార్టీలో కలకలం రేగుతోందట.

వైఖరి మార్చుకోవాలని మేయర్‌కు సూచించిన పార్టీ పెద్దలు..!

పరిస్థితి తీవ్రతను గుర్తించిన అధికార పార్టీ పెద్దలు.. వైఖరి మార్చుకోవాలని మేయర్‌ విజయలక్ష్మికి సూచించినట్టు తెలుస్తోంది. ‘విపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తే.. ఏదో అనుకున్నా.. ఇప్పుడు మన పార్టీ కార్పొరేటర్లే గొంతు చించుకుంటున్నారు. ఇది కరెక్ట్‌ కాదు. ఇకనైనా మారండి’ అని గట్టిగానే చెప్పారని గులాబీ వర్గాల టాక్‌. అయితే .. కార్పొరేటర్లు చేస్తున్న ఆరోపణలను మేయర్‌ విజయలక్ష్మి ఖండించారు. తాను అందరికీ అందుబాటులో ఉంటున్నాని.. తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని మీడియా చిట్‌చాట్‌లో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి..ఈ సమస్య పరిష్కారం దిశగా కదిలి ఎండ్‌కార్డు పడుతుందో.. మరిన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Exit mobile version