OTR: టీజీ భరత్ వర్సెస్ పోలీస్ శాఖ? మంత్రి సంచలన వ్యాఖ్యల వెనుక అసలేం ఉంది?

  • తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న మంత్రి టీజీ భరత్‌
  • 2024లో గెలిచిన వెంటనే కేబినెట్‌ బెర్త్‌
  • టీడీపీ పెద్దలతో పెరిగిన సాన్నిహిత్యం
  • ఈ మధ్య కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి
Tg Bharat

Tg Bharat

OTR: కర్నూలు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి టీజీ భరత్ వ్యవహారం రాజకీయవర్గాల్లో సరికొత్త సందేహాలు రేపుతోంది. ఇన్నాళ్ళు పెద్దగా వివాదాల జోలికి పోని టీజీ ఇప్పుడెందుకు కేరాఫ్‌ కాంట్రవర్శీ అవుతున్నారంటూ లోతుల్లోకి వెళ్ళి ఆరా తీసే వాళ్ళ సంఖ్య పెరిగిపోతోంది. అందుకు తగ్గట్టే… పరిశ్రమల శాఖ మంత్రి కూడా వరుస వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయినా… 2024 ఎన్నికల్లో తిరిగి టికెట్ దక్కడం, గెలవడం, ఫస్ట్‌ అటెంప్ట్‌లోనే మంత్రివర్గంలో స్థానం దక్కడం చకచకా జరిగిపోయాయి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అమాత్యా అని పిలిపించుకునే అదృష్టం కలసి వచ్చింది. స్వతహాగా పారిశ్రామిక వేత్త కావడం, మంత్రిగా అదే శాఖ దక్కడం కూడా సానుకూల పరిణామాలని చెప్పుకుంటారు. ఇక విదేశీ పెట్టుబడుల కోసం కలిసి వెళ్ళిరావడం లాంటివి పార్టీ పెద్దలకు ఆయన్ని బాగా దగ్గర చేశాయని అంటారు. గడిచిన రెండేళ్ళలో భరత్ ఎక్కడ మాట్లాడినా… వైసీపీ పై విమర్శలు, కూటమి ప్రభుత్వం అభివృద్ధి గురించే ప్రస్తావించేవారు. కానీ… ఈ మధ్యకాలంలో కర్నూలులో కొన్ని సంచలన, మరికొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. తాము మంత్రిగా ఉంటూ… సొంత జిల్లాలో పోలీసుల తీరుపై సీరియస్‌ కామెంట్స్‌ చేయడం దుమారం రేపుతోంది. టీడీపీ అధిష్టానం దగ్గర కూడా మంత్రి మాటలు చర్చకు వచ్చాయట.

కర్నూల్‌లో జరిగిన తన పుట్టిన రోజు వేడుకల్లో హాట్ కామెంట్స్ చేశారాయన. అభివృద్ధికి అడ్డు తగిలితే సహించేది లేదని, మీ పని మీరు చేసుకోండి….నా పని నేను చేసుకుంటా అంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు. బూతులు తిడుతూ ఉంటే ఇక్కడ ఎవరూ గాజులు వేసుకొని కూర్చోలేదని, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తన క్యాడర్ సహించదని కూడా వార్నింగ్‌ ఇచ్చారు. మా క్యాడర్ నాలుక కోస్తారని మా నాన్న అన్నారని, అదే…నా దగ్గర ఉండేవాళ్ళు అయితే… చాలా ఎక్స్‌ట్రీమ్‌గా చేస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. తిక్క తిక్క చేష్టలు చేయొద్దని ప్రత్యర్థులను హెచ్చరించడంతో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. అలాగే.. అటు పోలీస్ శాఖపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారాయన. కర్నూలులో నిఘా వైఫల్యం ఉందని, టీడీపీ కార్యకర్త హత్యకు ముందే సోషల్ మీడియాలో ఫోటో పెట్టి రిప్ అని పెట్టారని… అది పోలీసుల దృష్టికి వెళ్లలేదా అంటూ నిప్పులు చెరిగారు. నేరస్థుడు జైలు నుంచి బెయిల్ పై బయటికి వస్తూ… మళ్లీ జైలుకు వస్తానని చెప్పాడంటే… పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోందని అన్నారు. మంత్రి మీద నిఘా పెట్టిన వాళ్ళు నేరస్థులపై పెట్టరా అంటూ ప్రశ్నించారాయన. మంత్రులు ఎక్కడికి వెళ్లినా ఆరా తీస్తారే….ఆ మాత్రం సమాచారం నేరస్థుల విషయంలో లేదా అంటూ పోలీస్ శాఖను నిలదీశారు. కర్నూలులో పరిస్థితులను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్తానని కూడా చెప్పారు మంత్రి. పథకం ప్రకారం..టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ ను దారుణంగా హత్య చేశారన్నారని, హంద్రీ నదిలో వైసీపీ కబ్జాలను ఆయన బయట పెట్టారంటూ గుర్తు చేశారు. వైసీపీ అక్రమాలు ప్రశ్నించినందుకే ఇంతియాజ్ ను హత్య చేశారని ఆరోపించారు టీజీ.

సరిగ్గా ఇక్కడే సరికొత్త డౌట్స్‌ పెరుగుతున్నాయి. చనిపోయింది అధికార పార్టీ కార్యకర్త, ఆరోపణలు చేస్తోంది సాక్షాత్తు రాష్ట్ర మంత్రి, టార్గెట్‌ చేస్తోంది పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ని. దీంతో ఎక్కడో లింక్‌ సింక్‌ అవడం లేదన్న అనుమానాలు పెరుగుతున్నాయి రాజకీయవర్గాల్లో. కర్నూలు జిల్లా పోలీస్ అధికారులు తనమాట వినడం లేదని మంత్రి ఫ్రస్ట్రేట్‌ అవుతున్నారా అంటూ ప్రశ్నించే వాళ్ళు లేకపోలేదు. మరోవైపు ఇంటింటికి కార్యక్రమంలో భరత్‌ కర్నూలు ఓల్డ్ సిటీకి వెళ్ళినపుడు వైసీపీ వర్గీయులుగా చెబుతున్న ఇద్దరు రౌడీ షీటర్లు మా ఏరియాకు ఎలా వస్తారంటూ బూతులు తిట్టారట. వారిపై కేసులు కూడా నమోదయ్యాయి. దాంతో… రౌడీ మూకలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారనే అభిప్రాయం మంత్రికి ఉందని అంటున్నారు. కర్నూలులో రెండేళ్లలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని మంత్రి స్వయంగా ప్రకటించారు. ఇలా… వోవరాల్‌గా పోలీసుల మీద వత్తిడి పెంచే ప్రయత్నంలో మినిస్టర్‌ ఉన్నట్టు చెప్పుకుంటున్నాయి రాజకీయవర్గాలు.