ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తొలిగిపోవడంతో ఓరుగల్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుందా? ఎన్నికల కోడ్‌కి.. ఎమ్మెల్యేలకు లింకేంటి? కోడ్ అమలులో ఉన్నప్పుడు వారికి కలిసొచ్చిందేంటి? ఇప్పుడు వారిని ఇబ్బంది పెడుతున్న అంశం ఏంటి?
రైతులకు ఎలా సర్దిచెప్పాలో తెలియక ఎమ్మెల్యేల ఆందోళన..!
ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని ఏకగ్రీవంగా గెలిపించుకునేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా వ్యూహాలే రచించారు. చివరకు వారు అనుకున్నదే అయింది. అధిష్ఠానం దగ్గర మార్కులు వేయించుకున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఎమ్మెల్సీ ఎన్నిక ముగిశాక ఒక్కసారిగా టెన్షన్లో పడ్డారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. ఇన్ని రోజులు ఎమ్మెల్సీ ఎన్నికలను సాకుగా చూపిస్తూ తమ నియోజకవర్గాల్లో ధాన్యం కొనుగోళ్లపై ఎవరూ పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఎవరైనా వచ్చి సమస్య చెబితే.. ఎన్నికల కోడ్ ఉందిగా.. ఇప్పుడేం చేయలేం అని సర్ది చెప్పి పంపించేశారు. ఇప్పుడా ఎన్నికల కోడ్ లేదు. రైతుల నుంచి వస్తోన్న ఒత్తిళ్లను ఎలా అధిగమించాలో తరుణోపాయం తట్టక నలిగిపోతున్నారట.
తడిచిపోతున్న ధాన్యం.. లారీల కొరత.. తూకంలో మోసాలు..!
ఎమ్మెల్సీగా పోచంపల్లిని ఏకగ్రీవంగా గెలిపించుకున్నామన్న సంతోషం ఎమ్మెల్యేల ముఖంలో కనిపించడం లేదట. ఒకరిద్దరు మాత్రం కొంత చొరవ తీసుకుని రైతులతో మాట్లాడటంతో వారు ధీమగా ఉన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం తడిచిపోయి.. లారీల కొరత.. తూకంలో మోసాలు.. ఇలా అనేక అంశాలు ఫిర్యాదు రూపంలో ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చి పడుతున్నాయి. ఈ సమస్యలను తమ పరిధిలో ఏ విధంగా పరిష్కరించాలో తెలియక ఆందోళన చెందుతున్నారు అధికారపార్టీ శాసనసభ్యులు.
రైతుల దగ్గరకు స్థానిక నేతలతో రాయబారం..!
ఎన్నికల కోడ్ సందర్భంగా ఇన్నాళ్లూ రైతుల పక్షాన ఆందోళనలకు విపక్ష పార్టీలు దూరంగా ఉంటూ వచ్చాయి. ఇప్పుడు కోడ్ తొలిగిపోవడంతో వారంతా రోడ్డెక్కే పనిలో ఉన్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచీ ఎమ్మెల్యేలలో బీపీ పెరిగిపోతోందట. నియోజకవర్గాల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ఏం సమాధానం చెప్పాలా అని జుట్టు పీక్కుంటున్నారట. ఆగ్రహంగా ఉన్న రైతుల దగ్గరకు వెళ్లితే ఇబ్బంది పడొచ్చన్నది చాలా మంది భయం. అందుకే స్థానిక నాయకులను రైతుల దగ్గరకు పంపించి వారిని మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారట ఎమ్మెల్యే. రైతలుకు ఏం కావాలి? వాటికి పరిష్కారం సాధ్యమా.. కాదా? అని లెక్కలేస్తున్నట్టు సమాచారం. పనిలో పనిగా స్థానిక అధికారులపై ఓ రేంజ్లో ఒత్తిడి తెస్తున్నట్టు చెబుతున్నారు.
అర్జెంట్ పని ఉందని హైదరాబాద్ టూర్లలో కొందరు ఎమ్మెల్యేలు..!
విపక్షాలు రైతులు దగ్గరకు వెళ్లకముందే.. వారికి తక్షణ సాయం చేసేందుకు ఎమ్మెల్యేలు అనుచరుల ద్వారా ఆరా తీస్తున్నారట. కనీసం ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన సమస్యను తీర్చేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారట శాసనసభ్యులు. ఇంకొందరైతే.. ఏదో అర్జెంట్ పని ఉందని చెబుతూ హైదరాబాద్ టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడేమో.. మరికొంత కాలం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంటే బాగుండేది అని మనసులో అనుకుంటున్నారట ఎమ్మెల్యేలు. అధిష్ఠానం దగ్గర మెప్పు ఎలా ఉన్నా.. స్థానికంగా రైతుల దగ్గర మాట పోతుందనే భయం వారిని వెంటాడుతోంది. మరి.. అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఈ టెన్షన్ నుంచి ఎలా బయట పడుతారో చూడాలి.